ఎయిరిండియాలో మరో భారీ స్కామ్
న్యూఢిల్లీ: అసలే తీవ్ర ఆర్థిక సమస్యలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియా.. ఇంటిదొంగల చేతివాటంతో మరింత కుదేలవుతోంది. ఇటీవలే ఎల్‌టీసీ కుంభకోణంతో కుదుపునకు గురైన సంస్థలో మరో భారీ స్కామ్ బయటపడింది. సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రయాణ ఛార్జీల స్కీమ్(ఎఫ్‌ఎఫ్‌ఎస్)కు సంబంధించి... కోట్లాది రూపాయల మోసం జరిగినట్లు విజిలెన్స్ విభాగం దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు... ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు ఏజెన్సీలతో ముడిపడిఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ కింద ఎయిరిండియా ఉద్యోగులు తమ కుటుంబసభ్యులను ఏడాదికోసారి దేశీయంగా ఎక్కడికైనా సంస్థ విమానాల్లో రాయితీ చార్జీల్లో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీబీఓ) బీకే మౌర్య ధ్రువీకరించారు. ఒక అనుమానిత ట్రావెల్ ఏజెన్సీ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను దుర్వినియోగం చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని.. దీనివల్ల దాదాపు రూ.6 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఇంకా చాలా ట్రావెల్ ఏజెన్సీలకు పాత్ర ఉండొచ్చనే అనుమానిస్తున్నామని.. దీనివల్ల నష్టం కూడా భారీగా ఉండొచ్చన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ జరపాలని తాము కోరినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఎయిరిండియా అధికార ప్రతినిధులెవరూ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.
తవ్వినకొద్దీ అక్రమాలు...
ఈ స్కామ్‌పై సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ... కంపెనీ విజిలెన్స్ బృందం అంతర్గత దర్యాప్తులో 2007 నుంచి రికార్డులను పరిశీలించినట్లు వెల్లడించారు. ఒక్క సెక్టార్‌లోనే ఈ స్కీమ్ కింద 5,916 టిక్కెట్లలో అవకతవకలు బయటపడినట్లు తెలిపారు. ఆడిట్ కూపన్‌లో పేర్కొన్న ప్రయాణ చార్జీ కంటే... ప్రయాణించిన టిక్కెట్(ఫ్లైట్) కూపన్లలో చార్జీ మొత్తాన్ని అధికంగా చూపించడం ద్వారా ఒక ట్రావెల్ ఆపరేటర్ మోసానికి పాల్పడినట్లు తేలింది. విజిలెన్స్ దర్యాప్తు నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారని సీబీఐ అధికారి చెప్పారు. ఈ చార్జీల మధ్య వ్యత్యాసాన్ని సొమ్ముచేసుకున్నారని వెల్లడించారు.
నిబంధనలకు తూట్లు...
అంతేకాకుండా స్కీమ్‌ను దుర్వినియోగం చేయకుండా.. టిక్కెట్లలో కుటుంబ సభ్యులందరూ కలిసే ప్రయణిస్తున్నట్లు తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. అయితే, చాలా టిక్కెట్లలో ఈ నిబంధనలను తుంగలోతొక్కినట్లు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ఈ స్కామ్‌లో మోసగాళ్లతో తమ సొంత సిబ్బంది కూడా చేతులుకలిపి ఉండొచ్చని ఎయిరిండియా అనుమానిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. చెన్నై-పోర్ట్‌బ్లెయిర్, కోల్‌కతా-పోర్ట్‌బ్లెయిర్ సెక్టార్‌లో టిక్కెట్లపై విజిలెన్స్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. గతంలో సిబ్బంది లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్‌టీసీ) స్కీమ్‌లో కుంభకోణాన్ని కూడా విజిలెన్స్ విభాగమే బయటపెట్టింది. దీనిపైన కూడా ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది.