న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు.
దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు.
సీఆర్‌పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది.
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
Published Wed, Jan 29 2014 11:39 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
Advertisement