మాజీ సీఎం అశోక్ చవాన్కు ఎదురుదెబ్బ
ముంబయి : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అభియోగాల ఉపసంహరణ చర్యలపై ముంబయి హైకోర్టు స్టే విధించింది.
కాగా అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్ను పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది.