సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకముంచి కేటాయించిన నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తానని వంద శాతం కచ్చితంగా చెప్పగలనని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో వివాదం చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసిన చవాన్, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో బుధవారం ఈసీ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం చవాన్ మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ్ కుంభకోణంలో అవినీతికి పాల్పడలేదని తన మనస్సాక్షికి తెలుసని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.
అవినీతిని వ్యతిరేకించే రాహుల్ గాంధీకి నిజం తెలుసు కాబట్టే ఈరోజు తనకు టికెట్ దక్కిందని చవాన్ వివరించారు. ఆదర్శ్ విషయంలో అవినీతి ఎక్కడుందని, సంబంధంలేని విషయాల గురించి మాట్లాడనని తెలిపారు. ప్రతిపక్ష నాయకులే రాజకీయ లబ్ధి పొందేందుకు అవినీతి ఆరోపణలు చేస్తారని అన్నారు. ఈ విషయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. మైనింగ్ కుంభకోణంలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప, గాలి సోదరులపై బీజేపీ విధానమేంటో అందరికీ తెలిసిందేనని అన్నారు.
ఆదర్శ్ కుంభకోణం చార్జిషీట్‌లో తన పేరు చేర్చారు కానీ, తనను దోషిగా పేర్కొనలేదని తెలిపారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా తాను పోటీ చేయవచ్చని, న్యాయ విధానాలు, నిబంధనల ప్రకారం అది సాధ్యమేనని అన్నారు. ఏ ఎన్నిక నుంచి పోటీ చేసేందుకు తనను దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. కామన్వెల్త్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సురేశ్ కల్మాడీని తప్పించారు కదా, మీ కేసు కూడా అలాంటిదే కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు చవాన్ తానేమీ మాట్లాడనని అన్నారు. నాందేడ్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించి ందని, ఆ బాటలోనే ముందుకెళతానని తెలిపారు.
ఆదర్శ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో సీఎంగా మిమ్మల్ని తప్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పుడు అవినీతి విషయంలో రాజీపడుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు చవాన్ మాట్లాడుతూ అసలు అవినీతి ఎక్కడుంది? ఈ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లాగడమెందుకు? దీంతో వారికి ఏమి సంబంధమని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
అందరిలో ఉత్కంఠ...
మాజీ సీఎం అశోక్ చవాన్‌కు ఆఖరి క్షణంలో ఊరట లభించింది. బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు రోజు కావడంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తల్లో నాందేడ్ సీటు ఎవరికి వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. మంగళ వారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చవాన్ పేరు ప్రకటించి సస్పెన్షన్‌కు తెరదించింది. అంతలోనే సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖత్గావ్కర్ కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి మాజీ ఎంపీ డి.బి.పాటిల్, ఆప్ తరఫున నరేంద్రసింగ్ గ్రంథి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవైపు నామినేషన్లు దాఖలు చేయడానికి సమయం దగ్గరపడుతోంది.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడంతో కార్యకర్తలో మరింత ఉత్కంఠ మొదలైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అశోక్ చవాన్ సతీమణి అమితా చవాన్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.పి.సావంత్ నామినేషన్ ఫారాలు నింపి సిద్ధంగా ఉంచారు. ఇంతలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ చవాన్ పేరును ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భారీ ఊరేగింపు, మోటార్ సైకిళ్ల ర్యాలీతో బయలుదేరిన మాజీ సీఎం ఆశోక్ చవాన్ జనాలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
‘మాజీ సీఎం పేరు తొలగించండి’
ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో దాఖలైన ఎఫ్‌ఐఆర్ నుంచి మాజీ సీఎం ఆశోక్ చవాన్ పేరును తొలగించాలని బాంబే హైకోర్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆశ్రయించింది. ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక సీబీఐ కోర్టు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నుంచి చవాన్ పేరును తొలగించేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది.
గెలుపు నాదే
Published Wed, Mar 26 2014 11:00 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
Advertisement
Advertisement