చవాన్‌కు మరిన్నిచిక్కులు
Published Tue, Dec 10 2013 11:04 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
సాక్షి, ముంబై: ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ కుంభకోణంపై విచారణకు నియమించిన కమిటీ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కొని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ కుంభకోణంలో నిందితుడిగా కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అశోక్ చవాన్‌పై కేసు నమోదు చేయడానికి గవర్నల్ కె.శంకర్ నారాయణన్ అనుమతి కోరింది.
ఈ పరిణామం అశోక్ చవాన్‌కు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కానీ ఇది ఇంత వరకు నివేదికను అసెంబ్లీకు సమర్పించలేదు. దీనిపై బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. చివరికి బీజేపీ ముంబై నాయకులు ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై చర్యలు కోరుతూ బాంబే హైకోర్టుకు వెళ్లారు. ఈ కుంభకోణంపై విచారణ నివేదికను అసెంబ్లీ సమావేశంలో ఎప్పుడు చర్చకు తీసుకొస్తారో రాతపూర్వకంగా తెలియజేయాలని పృథ్వీరాజ్ చవాన్ సర్కారును ఆదేశించింది. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఆదర్శ్ కుంభకోణం విచారణ నివేదికపై చర్చిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా హైకోర్టుకు విన్నవించింది.
Advertisement