బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ముంబై: ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ముంబైలోని 31 అంతస్తుల ఈ భవనాన్ని కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తమ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 12 వారాల గడువు ఇచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న నాయకులు, మంత్రులు, అధికారులపై దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. బాంబే హైకోర్టు తీర్పుపై కామెంట్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిరాకరించారు.
ఈ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో అశోక్ చవాన్‌తో పాటు మరో 14 మంది పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే. కార్గిల్ వితంతువులతో పాటు రక్షణ సిబ్బంది కోసం నిర్మించాలనుకున్న ఫ్లాట్లను అశోక్ చవాన్ బంధువులకు కేటాయించారని అభియోగాలు మోపారు. ఈ కుంభకోణంలో అశోక్‌చవాన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌లను అప్పట్లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తప్పంతా దేశ్‌ముఖ్‌దేనని, ఆయన హయాంలోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని చవాన్, షిండేలు సీబీఐ ఎదుట ఆరోపించారు.