సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ముందుగా రాష్ట్ర మంత్రి మండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రిమండలిని విస్తరించి, గురువారం ఉదయం కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యవిద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన స్థానం, ఎన్సీపీ కోటాలోని ఓ కేబినెట్ పదవి ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీకాలం కూడా ముగిసింది.
దీంతో వీటిని భర్తీ చేయడం కోసం మంత్రిమండలిని విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మరోసారి మంత్రిపదవి దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. గావిత్ స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవాడ్‌కు వైద్యవిద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం రేసులో శరద్‌గావిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఫౌజియాఖాన్ స్థానం కోసం జితేంద్ర అవాడ్‌తోపాటు ప్రకాష్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్‌బల్‌లతోపాటు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోటాలోని మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో కూడా మంత్రి పదవులపై ఆసక్తికనబరుస్తున్న నాయకులలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసమే...
అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సుశీల్‌కుమార్ షిండే, మిలింద్ దేవరా, ప్రియాదత్ ఇలా అనేక మంది దిగ్గజ నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు మరాఠ్వాడాలోని కేవలం రెండు స్థానాలు లభించగా ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ మంత్రి మండలి విస్తరణ జరుగుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో పాత ముఖాలే..
మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి కేబినెట్ పదవిని కొత్త వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుండగా కాంగ్రెస్ మాత్రం పాతవారితోనే విస్తరణ తంతు ముగించాలనుకుంటున్నట్లు సమాచారం.
నేడే విస్తరణ
Published Wed, May 28 2014 10:31 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
Advertisement
Advertisement