టాప్‌గేర్‌లో టాటామోటార్స్
ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 రెట్లు ఎగసి రూ.4,805 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ.1,628 కోట్లు మాత్రమే ఆర్జించింది.
బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) అమ్మకాలు పురోగమించడం ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో సి.రామకృష్ణన్ చెప్పారు. దీనికితోడు పెట్టుబడుల విక్రయం ద్వారా రూ.1,250 కోట్ల ఇతర ఆదాయాన్ని కంపెనీ అందుకోగా, రూ.630 కోట్లమేర ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఇక ఈ కాలంలో అమ్మకాలు సైతం 39% ఎగసి రూ.63,536 కోట్లను తాకాయి. అంతక్రితం ఇదే కాలంలో అమ్మకాలు రూ.45,821 కోట్లుగా ఉన్నాయి.
బ్రిటిష్ సంస్థ సహ కారం
డిసెంబర్ క్వార్టర్‌కు జేఎల్‌ఆర్ నికర లాభం 29.6 కోట్ల పౌండ్ల నుంచి 61.9 కోట్ల పౌండ్లకు ఎగసింది. నష్టాలతో కుదేలైన జేఎల్‌ఆర్‌ను టాటా మోటార్స్ 2008లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై వరుసగా ఎనిమిదో క్వార్టర్‌లో సైతం కంపెనీ మంచి పనితీరును చూపడం విశేషం! ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో ఆదాయం కూడా 40% పుంజుకుని 532.8 కోట్ల పౌండ్లను చేరింది. గతంలో 380.4 కోట్ల పౌండ్ల ఆదాయం నమోదైంది. వాహన అమ్మకాలు 23% వృద్ధితో 1,16,357 యూనిట్లను తాకాయి.
ఇందుకు రేంజ్ రోవర్ స్పోర్ట్, జాగ్వార్ ఎఫ్‌టైప్, ఎక్స్‌ఎఫ్, ఎక్స్‌జే వంటి కొత్త మోడళ్లు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. కాగా, స్టాండ్‌అలోన్ ప్రాతిపదికన డిసెంబర్ క్వార్టర్‌లో రూ.1,251 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. ఆదాయం మాత్రం రూ. 10,630 కోట్ల నుంచి రూ. 7,770 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 458.5 కోట్ల నికర నష్టం నమోదైంది. వాహన విక్రయాలు కూడా 36% వరకూ తగ్గి 1,32,087 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్‌ఈలో షేరు ధర 1% లాభంతో రూ. 364 వద్ద ముగిసింది.