ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్ | Infosys Global Sales and Marketing Head Prasad Thrikutam quits | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్

Published Fri, Jun 6 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్

ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్

కంపెనీ గ్లోబల్ హెడ్ ప్రసాద్ నిష్ర్కమణ
 
 బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ అధికారుల నిష్ర్కమణ కొనసాగుతోంది. తాజాగా కంపెనీ గ్లోబల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) ప్రసాద్ త్రికూటం గురువారం ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. కొత్తగా సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇన్ఫోసిస్ కార్యకలాపాలను కూడా చూసే ప్రసాద్ రాజీనామా చేయడం గమనార్హం. ఈయన బాధ్యతలను కంపెనీ ప్రస్తుత అధ్యక్షుడు, బోర్డ్ సభ్యుడు కూడా అయిన యు.బి. ప్రవీణ్‌రావు చూస్తారని ఇన్ఫోసిస్ ప్రతినిధి పేర్కొన్నారు. గతంలో ప్రసాద్  ఎనర్జీ, యుటిలిటీస్, కమ్యూనికేషన్స్ విభాగానికి అధినేతగా పనిచేశారు. ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారని ఊహాగానాలున్న బి.జి. శ్రీనివాస్ రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ప్రసాద్ వైదొలగుతున్నారు.
 
ఇలా అయితే కష్టమే..
కాగా నారాయణ మూర్తి మళ్లీ ఇన్ఫోసిస్‌లో చేరిన ఏడాది కాలంలో కంపెనీ నుంచి ఇప్పటిదాకా 12 మంది సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. అశోక్ వేమూరి, వి. బాలకృష్ణన్, బసాబ్ ప్రధాన్, చంద్రశేఖర్ కకాల్, స్టీఫెన్ ప్రట్ వంటి ఉద్దండులు కంపెనీని వీడిపోయారు. సీనియర్ ఆధికారులే కాకుండా, సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీ నుంచి వైదొలుగుతున్నారని, ఇలా అయితే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని ఆర్జించలేకపోవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు పెదవి విరుస్తున్నాయి.
 
ఆవేక్ష టెక్నాలజీస్‌లో ఇన్ఫీ ‘బాల’
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్  మాజీ సీఎఫ్‌ఓ వి.బాల కృష్ణన్ అవేక్ష టెక్నాలజీలో చేరారు. తమ కంపెనీ సలహా మండలి సభ్యుడిగా బాలకృష్ణన్‌ను నియమించుకున్నామని అవేక్ష టెక్నాలజీస్ పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను కొందరు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులే స్థాపిం చారు. ఈ కంపెనీ  ఐటీ కన్సల్టింగ్, సొల్యూషన్స్ సర్వీసులను అందిస్తోంది. బాలకృష్ణన్ గత ఏడాది డిసెంబర్‌లో ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. ఇటీవల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement