‘నమ్మి మోసపోకండి’.. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు | Narayana Murthy Deepfake Video Endorsing Trading App | Sakshi
Sakshi News home page

‘నమ్మి మోసపోకండి’.. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

Published Sat, Dec 16 2023 8:21 AM | Last Updated on Sat, Dec 16 2023 1:36 PM

Narayana Murthy Deepfake Video Endorsing Trading App - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమేటెడ్‌ ట్రేడింగ్‌ అప్లికేషన్లు కొన్నింటికి తన ఆమోదం ఉన్నట్టు వస్తున్న కల్పిత ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ తరహా మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. తనను పోలిన చిత్రాలు, వీడియోలతో కూడిన నకిలీ ఇంటర్వ్యూలపైనా ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. 

ఈ మేరకు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై పలు పోస్ట్‌లు పెట్టారు. తన పేరుతో మోసపూరితంగా సేవలు, ఉత్తత్తులను విక్రయించేందుకు పలు వెబ్‌సైట్లు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ తరహా ప్రచారం, ప్రకటనలు కనిపిస్తే నియంత్రణ సంస్థలకు తెలియజేయాలని కోరారు. ‘‘ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా యాప్‌లు, ఇంటర్నెట్‌లో పలు వెబ్‌ పేజీలు కొన్ని నకిలీ వార్తలను ప్రచారం చేశాయి. 

ఆటోమేటెడ్‌ ట్రేడింగ్‌ అప్లికేషన్లు ‘బీటీసీ ఏఐ ఇవెక్స్, బ్రిటిష్‌ బిట్‌కాయిన్‌ ప్రాఫిట్, బిట్‌ లైట్‌ సింక్, ఇమీడియెట్‌ మూమెంటమ్, క్యాపిటలిక్స్‌ వెంచర్స్‌’ తదితర వాటిలో తాను పెట్టుబడులు పెట్టినట్టు లేదా వాటికి తన ఆమోదం ఉన్నట్టు అందులో పేర్కొన్నాయి’’అని తన పోస్ట్‌లో నారాయణ మూర్తి వివరించారు. ప్రముఖ న్యూస్‌ పేపర్‌ వెబ్‌సైట్లను పోలిన మోసపూరిత వెబ్‌సైట్లలో ఈ వార్తలు ప్రచారమయ్యాయని చెప్పారు. వీటిలో కొన్ని తన చిత్రాలు, వీడియోలతో రూపొందించిన నకిలీ వీడియోలను సైతం ప్రచారం చేసినట్టు తెలిపారు. ఈ తరహా వెబ్‌సైట్లు, అప్లికేషన్లు వేటితోనూ తనకు అనుబంధం, సంబంధం లేదని స్పష్టం చేశారు.  

రతన్‌ టాటా పేరుతోనూ.. 
ఇటీవలే టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా సైతం తన పేరుతో వస్తున్న నకిలీ ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయడం తెలిసిందే.  రిస్‌్కలేని, నూరు శాతం గ్యారంటీ రాబడులను రతన్‌ టాటా సూచించినట్టు నకిలీ వీడియో ఒకటి ప్రచారం కావడం గమనార్హం. సైబర్, ఆర్థిక నేరగాళ్లు అమాయకులను మోసపుచ్చేందుకు ప్రముఖుల పేర్లను సైతం వినియోగించుకుంటున్న తీరుకు ఇవి దర్పణం పడుతున్నాయి. దీంతో ఈ తరహా నకిలీ, మోసపూరిత కంటెంట్‌ కట్టడికి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కేంద్ర సర్కారు సంప్రదింపులు సైతం నిర్వహిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement