రెండేళ్ళు బుల్ జోరే..
భారత్ స్టాక్ మార్కెట్‌పై స్టాన్‌చార్ట్ అంచనా
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు రానున్న రెండేళ్ల కాలంలో మరింత పుంజుకుంటాయని ఈక్విటీ రీసెర్చ్ నివేదికలో స్టాన్‌చార్ట్ బ్యాంక్ అంచనా వేసింది. తద్వారా ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. దీంతో గత నాలుగేళ్ల డౌన్‌ట్రెండ్ యూటర్న్ తీసుకుంటుందని వ్యాఖ్యానించింది.
వెరసి మార్కెట్లలో కనిపించనున్న బుల్ ట్రెండ్ అత్యంత శక్తివంతంగా ఉంటుందని అభిప్రాయపడింది. గత మూడేళ్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ స్టాక్స్‌లో దాదాపు 5% మేర తమ వాటాలను పెంచుకున్నారని తెలిపింది. ఇప్పటికే ఇండియా మార్కెట్లకు ఎఫ్‌ఐఐలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఇది తెలియజేస్తున్నదని స్టాన్‌చార్ట్ విశ్లేషించింది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కదిలే సైక్లికల్ స్టాక్స్‌పట్ల ఎఫ్‌ఐఐలు అంత ఆసక్తిని కనబరచడంలేదని తెలిపింది.
మోడీ ఎఫెక్ట్...
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికున్న ప్రాధాన్యతలు, నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా స్పందిస్తున్న తీరు వంటి అంశాలు పెట్టుబడుల వాతావరణానికి జోష్‌నిస్తుందని స్టాన్‌చార్ట్ విశ్లేషించింది. అంచనాలకంటే వేగంగా జీడీపీ రికవరీ ఉంటుందని అభిప్రాయపడింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికల్లా ఆర్థిక వ్యవస్థ 8% స్థాయిలో వృద్ధిని సాధించే అవకాశమున్నదని అభిప్రాయపడింది. ఆశావహ అంచనాలతో చూస్తే ద్రవ్యోల్బణం మందగించడంతోపాటు వడ్డీ రేట్లు తగ్గడం ద్వారా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని నివేదికలో పేర్కొంది.
సమీప కాల ంలో జీడీపీ 6-6.5% స్థాయిలో పుంజుకోవాలంటే ఉత్పాదకతను పెంచే పాలసీ విధానాలు అవసరమని తెలిపింది. అడ్డంకులను తొలగించేదిశలో వేగవంత నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించింది. జీడీపీ 8% వృద్ధిని అందుకోవాలంటే ఏడాదికి 80 బిలియన్ డాలర్ల చొప్పున విదేశీ నిధులు లభించాల్సి ఉంటుందని తెలిపింది. నిజానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2013-17)లో 8% జీడీపీ వృద్ధిని ప్రభుత్వం ఆశించింది. మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు అవసరమైన విదేశీ పెట్టుబడుల ఆధారంగా ఈ అంచనాలు రూపొందించింది.
బ్యాంకులు, సిమెంట్‌కు డిమాండ్
బుల్ ట్రెండ్ కొనసాగితే బ్యాంకులు, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు భారీగా లాభపడతాయని స్టాన్‌చార్ట్ పేర్కొంది. సబ్సిడీల తగ్గింపు, సంస్కరణల అమలు అంశాలతో ఆయిల్, గ్యాస్ షేర్లకు సైతం గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల విషయానికివస్తే... ఇప్పటికే బీఎస్‌ఈ 500 సూచీలోని స్టాక్స్‌పై 231 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది అందుబాటులో ఉన్న ఈక్విటీ క్యాపిటల్‌లో 19.2% వాటాకు సమానం. స్థూల ఆర్థిక వాతావరణం క్షీణిస్తున్నా ఎఫ్‌ఐఐలు గత 3-4 ఏళ్లుగా ఎగుమతులు, వినియోగ ఆధార రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ రావడం విశేషమని వ్యాఖ్యానించింది.
బ్రిక్‌లో భారత్ బెటర్: ఓఈసీడీ
న్యూఢిల్లీ: బ్రిక్(బీఆర్‌ఐసీ- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల్లో భారత్ ఆర్థిక భవిత బాగుండే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓఈసీడీ(ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) అంచనావేస్తోంది. తన కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్‌ఐ) ఈ విషయాన్ని సూచిస్తున్నాయని మంగళవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా బ్రిక్‌తోపాటు 34 అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి తీరును గమనించే ఈ సంస్థ
నివేదికలో ముఖ్యాంశాలు..
* గడచిన రెండేళ్లుగా 5 శాతం దిగువన ఆర్థికాభివృద్ధి రేటును సాధిస్తున్న భారత్, తిరిగి అధిక వృద్ధి బాటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
* అయితే బ్రిక్ కూటమిలో మిగిలిన బ్రెజిల్, చైనా, రష్యాల్లో వృద్ధి ఆశించినదానికన్నా తక్కువగా ఉంది.
* అమెరికా, కెనడాల్లో స్థిర వృద్ధి ధోరణిని సీఎల్‌ఐ సూచిస్తోంది. బ్రిటన్ ఆర్థికరంగం కొంత స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.