ఆర్థిక గణాంకాల నిరుత్సాహం
న్యూఢిల్లీ: 2013 జూన్‌లో ఐఐపీ అసలు వృద్ధి నమోదు చేసుకోకపోగా, మైనస్ (-)1.8 శాతం క్షీణతలో ఉంది. ఈ అతి తక్కువ ‘బేస్’ ఎఫెక్ట్ వల్లే తాజా సమీక్ష నెల (2014 జూన్) గణాంకాలు ఎంతోకొంత మెరుగ్గా కనిపిస్తున్నాయని కొందరు ఆర్థిక నిపుణుల విశ్లేషణ. 2013 మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)తో పోల్చిచేస్తే కూడా తాజా జూన్ త్రైమాసిక ఐఐపీ ఫలితాలు మెరుగ్గా కనిపించాయి. ఈ కాలంలో ఉత్పత్తి గత -1.0 శాతం క్షీణత నుంచి తాజాగా 3.9 శాతం వృద్ధి బాట పట్టింది.
వార్షికంగా ఓకే...
తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తి 2013 జూన్‌లో క్షీణతలో -1.7 శాతంగా ఉంది. అయితే 2014 జూన్‌లో ఈ రేటు 1.8 శాతానికి ఎగసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ రేటు 2013 ఇదే కాలంతో పోల్చితే -1.1 శాతం క్షీణ బాట నుంచి 3.1 శాతానికి ఎగసింది. వార్షికంగా పరిశీలిస్తే- ఇది కొంత ఊరటనిచ్చే అంశం.
మైనింగ్: ఈ రంగం కూడా కొంత ఉత్సాహకరమైన ఫలితాన్ని ఇచ్చింది. -4.6 క్షీణత నుంచి 4.3 శాతం వృద్ధికి మళ్లింది. త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి. -4.6 క్షీణ ఉత్పత్తి, 3.2 శాతం వృద్ధి బాట పట్టింది.
విద్యుత్: 2013 జూన్‌లో అసలు వృద్ధి లేకుండా నిశ్చలంగా ఉండిపోయిన ఈ రంగం, 2014 జూన్‌లో 15.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. త్రైమాసికంగానూ వృద్ధి 3.5 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది.
క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగం 6.6 శాతం క్షీణత నుంచి 23 శాతం వృద్ధి బాటకు మళ్లింది. త్రైమాసికంలో ఈ రేటు 3.7 శాతం నుంచి 13.9 శాతానికి ఎగసింది.
వినియోగ వస్తువులు: ఈ రంగం మాత్రం నిరుత్సాహంగానే ఉంది. అసలు వృద్ధి లేకపోగా, 1.5 శాతం క్షీణత మరింతగా 10 శాతం క్షీణతకు జారిపోయింది. త్రైమాసికంగా కూడా క్షీణత రేటు - 2.1శాతం నుంచి -3.6 శాతానికి ఎగసింది. ఈ రంగంలో రెండు విభాగాలైన ‘కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్’ ఫలితాలు కూడా నిరాశా జనకంగానే ఉన్నాయి. ఈ రంగం మొత్తం గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జూలై ధరలు బెంబేలు...
ఇక రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, వార్షిక ప్రాతిపదికన 2014 జూన్‌లో రిటైల్ ధరలు (2013 ఇదే నెలలో ధరలను పోల్చి) 7.31 శాతం పెరిగితే, జూలైలో ఈ రేటు మరింత ఎగసి 7.96 శాతానికి చేరింది.
ఇందులోని మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహార, పానియాల ద్రవ్యోల్బణం రేటు 9.16 శాతంగా నమోదయ్యింది.
ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.47 శాతంగా ఉంది.
దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షల ద్రవ్యోల్బణం రేటు 8.73 శాతం.
వేర్వేరుగా ఆహార, పానియాల విభాగంలో వార్షిక ప్రాతిపదికన 2014 జూలైలో ధరల పరుగు తీరును పరిశీలిస్తే- పండ్ల ధరలు భారీగా 22.48 శాతం ఎగశాయి. కూరగాయల ధరలు 16.88 శాతం పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 11.26 శాతం పరుగు పెట్టాయి. అన్ని ఆహార ఉత్పత్తుల ధరలూ ఎంతోకొంత శాతం పెరిగాయి తప్ప, తగ్గడం ప్రశ్నే లేదు. వీటిలో తృణ ధాన్యాలు, ఉత్పత్తులు (7.45 శాతం), పప్పు దినుసులు, సంబంధిత ఉత్పత్తులు (5.85 శాతం), చమురు, వెన్న పదార్థాలు (0.70 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం (7.68 శాతం), సుగంధ ద్రవ్యాలు (8.74 శాతం), చక్కెర (0.82 శాతం), ఆల్కాహాలేతర పానియాలు (6.35 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (7.77 శాతం) ఉన్నాయి.