Standard Chartered Bank
-
గ్లోబల్ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్ ’ చీఫ్ రాణా తల్వార్ కన్నుమూత!
అంతర్జాతీయ బ్యాంకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు రాణా తల్వార్ ( 76) మరణించారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సిటీ గ్రూప్ మాజీ సీఈఓ జాన్ రీడ్ వంటి గ్లోబల్ దిగ్గజాల నుండి ప్రశంసలు పొందిన ఆయన బ్యాంకింగ్ రంగంలోనే పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్టాండర్డ్చార్టర్డ్ బ్యాంక్‌లో చేరిన కొద్ది కాలానికి సీఈఓ గా బాధ్యతుల చేపట్టడం ఆయన చేసిన కృషికి నిదర్శనమనే చెప్పుకోవాలి. ఆసియా కరెన్సీ సంక్షోభం వచ్చినప్పుడే ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓగా పలు బ్యాంకుల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. యూబీఎస్ ట్రేడ్ ఫైనాన్స్ బిజినెస్ ఇంటిగ్రేషన్ తోపాటు ఏఎన్‌జడ్ గ్రిన్లే బ్యాంక్ భారత్, మిడిల్ ఈస్ట్, హాంకాంగ్‌లో ఛేస్ మాన్‌హట్టన్ క్రెడిట్ కార్డు బిజినెస్ లను ఆయన సారధ్యంలోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ టేకోవర్ చేసింది. బ్యాంకింగ్ నుండి రిటైర్మెంట్ తర్వాత, తల్వార్ సాబర్ క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్‌కు అండగా నిలిచారు. తరువాత దానిని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
వేదాంత 250 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్.. తాజాగా బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి తీసుకున్న 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించేసింది. బార్క్లేస్ బ్యాంకుకు 150 మిలియన్ డాలర్లు, స్టాండర్డ్ చార్టర్డ్‌కు 100 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లోనూ జరపాల్సిన చెల్లింపులకు తగినన్ని నిధులు తమ దగ్గర ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మార్చి నాటికి చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ముందుగానే చెల్లించేసినట్లు వివరించింది. 1.75 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. -
విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!
ముంబై: ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్..మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డు
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇటీవల మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డును ఆవిష్కరించింది. యూఎస్ డాలర్, యూరో, స్విస్ ఫ్రాంక్, బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, సౌతాఫ్రికా రాండ్, సింగపూర్ డాలర్ వంటి 20కి పైగా కరెన్సీలను ఈ కార్డులో లోడ్ చేసుకోవచ్చు. ట్రావెలర్లు విదేశాల్లో పర్యటించేటప్పుడు కార్డును ఆన్లైన్లో రిలోడ్ చేసుకోవచ్చు. కార్డు నగదు విత్డ్రాయల్స్పై జీరో మార్క్–అప్ ఫారెక్స్ రేట్ లాక్ ఇన్ సదుపాయముంది. తద్వారా కార్డు లోడ్ చేసేటప్పుడు ఏ మార్పిడి రేటు ఉందో తర్వాత షాపింగ్ చేసేటప్పుడు ఆ రేటునే చెల్లించవచ్చు. అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డు పర్యాటకులకు అదనంగా ట్రావెల్ బీమాను కూడా అందిస్తోంది. -
స్టాన్చార్ట్తో ఎల్ఐసీ ఎంఎఫ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో యూనీఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలుంటుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నగదు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశముంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పేపర్ ముక్కతో 14 లక్షలు కొట్టేశాడు!
సింగపూర్: ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా బ్యాంకు నుంచి దాదాపు రూ.14 లక్షలు (22 వేల డాలర్లు) ఎత్తుకుపోయిన దొంగను పట్టుకునేందుకు సింగపూర్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు. కేవలం ఒక పేపర్ ముక్కతో బ్యాంకును బురిడీ కొట్టించిన మోసగాడిని ఆస్ట్రేలియన్ గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం భోజన సమయంలో స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకు వచ్చిన నిందితుడు తన డిమాండ్లను ఒక కాగితంపై రాసి బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. కొద్ది నిమిషాల తర్వాత 22 వేల డాలర్ల సొమ్ముతో బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడని దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దుండగుడు ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా ఎలా దొంగతనం చేశాడనే దానిపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఆసియాలో సురక్షితమైన దేశంగా పేరుగాంచిన సింగపూర్ లో బ్యాంకు చోరీలు చాలా అరుదు. నేరస్తుల పట్ల, తుపాకీ సంస్కృతి పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడంతో సింగపూర్ లో నేరాలు తక్కుగా నమోదవుతుంటాయి. 2008, నవంబర్ లో ఓ వ్యక్తి బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేశాడు. -
ఆఫ్రికాపై భారత్ వృద్ధి ప్రభావం!
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అక్రా (ఘనా): భారత్ స్థిరమైన రీతిలో వృద్ధి బాటన పయనిస్తోందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గ్లోబల్ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలో ఇతర దేశాల్లోని పరిస్థితితో పోల్చితే భారత్‌లో కొన్ని ప్రత్యేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీనితోపాటు వచ్చే ఏడాది భారత్‌లో చోటుచేసుకున్న వృద్ధి ప్రభావం ఆఫ్రికాపై కూడా పడుతుందని, ఆ దేశంలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషించింది. గత ఏడాది ఆఫ్రికాలో ఇండియన్ పెట్టుబడులు 14 రెట్లు పెరిగాయని, వచ్చే ఏడాది ఈ నిధుల పరిమాణం 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ మాజీ ప్రెసిడెంట్ ఆర్వీ కనోరియా గతంలో పేర్కొన్న అంశాన్ని కూడా నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్‌తో పాటు ఆఫ్రికా కూడా వచ్చే ఏడాది ‘వృద్ధి జోన్’లో ఉంటుందని పేర్కొంది. -
ఆర్థిక గణాంకాల నిరుత్సాహం
న్యూఢిల్లీ: 2013 జూన్‌లో ఐఐపీ అసలు వృద్ధి నమోదు చేసుకోకపోగా, మైనస్ (-)1.8 శాతం క్షీణతలో ఉంది. ఈ అతి తక్కువ ‘బేస్’ ఎఫెక్ట్ వల్లే తాజా సమీక్ష నెల (2014 జూన్) గణాంకాలు ఎంతోకొంత మెరుగ్గా కనిపిస్తున్నాయని కొందరు ఆర్థిక నిపుణుల విశ్లేషణ. 2013 మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)తో పోల్చిచేస్తే కూడా తాజా జూన్ త్రైమాసిక ఐఐపీ ఫలితాలు మెరుగ్గా కనిపించాయి. ఈ కాలంలో ఉత్పత్తి గత -1.0 శాతం క్షీణత నుంచి తాజాగా 3.9 శాతం వృద్ధి బాట పట్టింది. వార్షికంగా ఓకే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తి 2013 జూన్‌లో క్షీణతలో -1.7 శాతంగా ఉంది. అయితే 2014 జూన్‌లో ఈ రేటు 1.8 శాతానికి ఎగసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ రేటు 2013 ఇదే కాలంతో పోల్చితే -1.1 శాతం క్షీణ బాట నుంచి 3.1 శాతానికి ఎగసింది. వార్షికంగా పరిశీలిస్తే- ఇది కొంత ఊరటనిచ్చే అంశం. మైనింగ్: ఈ రంగం కూడా కొంత ఉత్సాహకరమైన ఫలితాన్ని ఇచ్చింది. -4.6 క్షీణత నుంచి 4.3 శాతం వృద్ధికి మళ్లింది. త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి. -4.6 క్షీణ ఉత్పత్తి, 3.2 శాతం వృద్ధి బాట పట్టింది. విద్యుత్: 2013 జూన్‌లో అసలు వృద్ధి లేకుండా నిశ్చలంగా ఉండిపోయిన ఈ రంగం, 2014 జూన్‌లో 15.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. త్రైమాసికంగానూ వృద్ధి 3.5 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగం 6.6 శాతం క్షీణత నుంచి 23 శాతం వృద్ధి బాటకు మళ్లింది. త్రైమాసికంలో ఈ రేటు 3.7 శాతం నుంచి 13.9 శాతానికి ఎగసింది. వినియోగ వస్తువులు: ఈ రంగం మాత్రం నిరుత్సాహంగానే ఉంది. అసలు వృద్ధి లేకపోగా, 1.5 శాతం క్షీణత మరింతగా 10 శాతం క్షీణతకు జారిపోయింది. త్రైమాసికంగా కూడా క్షీణత రేటు - 2.1శాతం నుంచి -3.6 శాతానికి ఎగసింది. ఈ రంగంలో రెండు విభాగాలైన ‘కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్’ ఫలితాలు కూడా నిరాశా జనకంగానే ఉన్నాయి. ఈ రంగం మొత్తం గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై ధరలు బెంబేలు... ఇక రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, వార్షిక ప్రాతిపదికన 2014 జూన్‌లో రిటైల్ ధరలు (2013 ఇదే నెలలో ధరలను పోల్చి) 7.31 శాతం పెరిగితే, జూలైలో ఈ రేటు మరింత ఎగసి 7.96 శాతానికి చేరింది. ఇందులోని మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహార, పానియాల ద్రవ్యోల్బణం రేటు 9.16 శాతంగా నమోదయ్యింది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.47 శాతంగా ఉంది. దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షల ద్రవ్యోల్బణం రేటు 8.73 శాతం. వేర్వేరుగా ఆహార, పానియాల విభాగంలో వార్షిక ప్రాతిపదికన 2014 జూలైలో ధరల పరుగు తీరును పరిశీలిస్తే- పండ్ల ధరలు భారీగా 22.48 శాతం ఎగశాయి. కూరగాయల ధరలు 16.88 శాతం పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 11.26 శాతం పరుగు పెట్టాయి. అన్ని ఆహార ఉత్పత్తుల ధరలూ ఎంతోకొంత శాతం పెరిగాయి తప్ప, తగ్గడం ప్రశ్నే లేదు. వీటిలో తృణ ధాన్యాలు, ఉత్పత్తులు (7.45 శాతం), పప్పు దినుసులు, సంబంధిత ఉత్పత్తులు (5.85 శాతం), చమురు, వెన్న పదార్థాలు (0.70 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం (7.68 శాతం), సుగంధ ద్రవ్యాలు (8.74 శాతం), చక్కెర (0.82 శాతం), ఆల్కాహాలేతర పానియాలు (6.35 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (7.77 శాతం) ఉన్నాయి. -
రెండేళ్ళు బుల్ జోరే..
భారత్ స్టాక్ మార్కెట్‌పై స్టాన్‌చార్ట్ అంచనా ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు రానున్న రెండేళ్ల కాలంలో మరింత పుంజుకుంటాయని ఈక్విటీ రీసెర్చ్ నివేదికలో స్టాన్‌చార్ట్ బ్యాంక్ అంచనా వేసింది. తద్వారా ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. దీంతో గత నాలుగేళ్ల డౌన్‌ట్రెండ్ యూటర్న్ తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. వెరసి మార్కెట్లలో కనిపించనున్న బుల్ ట్రెండ్ అత్యంత శక్తివంతంగా ఉంటుందని అభిప్రాయపడింది. గత మూడేళ్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ స్టాక్స్‌లో దాదాపు 5% మేర తమ వాటాలను పెంచుకున్నారని తెలిపింది. ఇప్పటికే ఇండియా మార్కెట్లకు ఎఫ్ఐఐలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఇది తెలియజేస్తున్నదని స్టాన్‌చార్ట్ విశ్లేషించింది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కదిలే సైక్లికల్ స్టాక్స్‌పట్ల ఎఫ్ఐఐలు అంత ఆసక్తిని కనబరచడంలేదని తెలిపింది. మోడీ ఎఫెక్ట్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికున్న ప్రాధాన్యతలు, నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా స్పందిస్తున్న తీరు వంటి అంశాలు పెట్టుబడుల వాతావరణానికి జోష్‌నిస్తుందని స్టాన్‌చార్ట్ విశ్లేషించింది. అంచనాలకంటే వేగంగా జీడీపీ రికవరీ ఉంటుందని అభిప్రాయపడింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికల్లా ఆర్థిక వ్యవస్థ 8% స్థాయిలో వృద్ధిని సాధించే అవకాశమున్నదని అభిప్రాయపడింది. ఆశావహ అంచనాలతో చూస్తే ద్రవ్యోల్బణం మందగించడంతోపాటు వడ్డీ రేట్లు తగ్గడం ద్వారా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని నివేదికలో పేర్కొంది. సమీప కాల ంలో జీడీపీ 6-6.5% స్థాయిలో పుంజుకోవాలంటే ఉత్పాదకతను పెంచే పాలసీ విధానాలు అవసరమని తెలిపింది. అడ్డంకులను తొలగించేదిశలో వేగవంత నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించింది. జీడీపీ 8% వృద్ధిని అందుకోవాలంటే ఏడాదికి 80 బిలియన్ డాలర్ల చొప్పున విదేశీ నిధులు లభించాల్సి ఉంటుందని తెలిపింది. నిజానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2013-17)లో 8% జీడీపీ వృద్ధిని ప్రభుత్వం ఆశించింది. మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు అవసరమైన విదేశీ పెట్టుబడుల ఆధారంగా ఈ అంచనాలు రూపొందించింది. బ్యాంకులు, సిమెంట్‌కు డిమాండ్ బుల్ ట్రెండ్ కొనసాగితే బ్యాంకులు, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు భారీగా లాభపడతాయని స్టాన్‌చార్ట్ పేర్కొంది. సబ్సిడీల తగ్గింపు, సంస్కరణల అమలు అంశాలతో ఆయిల్, గ్యాస్ షేర్లకు సైతం గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. ఎఫ్ఐఐల పెట్టుబడుల విషయానికివస్తే... ఇప్పటికే బీఎస్ఈ 500 సూచీలోని స్టాక్స్‌పై 231 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది అందుబాటులో ఉన్న ఈక్విటీ క్యాపిటల్‌లో 19.2% వాటాకు సమానం. స్థూల ఆర్థిక వాతావరణం క్షీణిస్తున్నా ఎఫ్ఐఐలు గత 3-4 ఏళ్లుగా ఎగుమతులు, వినియోగ ఆధార రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ రావడం విశేషమని వ్యాఖ్యానించింది. బ్రిక్‌లో భారత్ బెటర్: ఓఈసీడీ న్యూఢిల్లీ: బ్రిక్(బీఆర్ఐసీ- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల్లో భారత్ ఆర్థిక భవిత బాగుండే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓఈసీడీ(ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) అంచనావేస్తోంది. తన కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్ఐ) ఈ విషయాన్ని సూచిస్తున్నాయని మంగళవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా బ్రిక్తోపాటు 34 అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి తీరును గమనించే ఈ సంస్థ నివేదికలో ముఖ్యాంశాలు.. * గడచిన రెండేళ్లుగా 5 శాతం దిగువన ఆర్థికాభివృద్ధి రేటును సాధిస్తున్న భారత్, తిరిగి అధిక వృద్ధి బాటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. * అయితే బ్రిక్ కూటమిలో మిగిలిన బ్రెజిల్, చైనా, రష్యాల్లో వృద్ధి ఆశించినదానికన్నా తక్కువగా ఉంది. * అమెరికా, కెనడాల్లో స్థిర వృద్ధి ధోరణిని సీఎల్ఐ సూచిస్తోంది. బ్రిటన్ ఆర్థికరంగం కొంత స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.