ఇన్ఫీలో మరో వికెట్ డౌన్...
బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మరో వికెట్ పడింది. కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చిన సీనియర్లు వరుసగా సంస్థను వీడుతున్నారు. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్, బోర్డ్ సభ్యుడు కూడా అయిన బి.జి.శ్రీనివాస్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వచ్చే నెల 10 నుంచి అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ప్రస్తుత సీఈఓ ఎస్.డి. శిబులాల్ తర్వాత కంపెనీ సీఈవో రేసులో ఉన్న శ్రీనివాస్ రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఏడాది జనవరిలో కొత్తగా ప్రెసిడెంట్ పదవిని సృష్టించి, దానిని శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలను కంపెనీ కానీ శ్రీనివాస్ కానీ వెల్లడించలేదు. మరో వైపు ఇన్ఫోసిస్ తనకు అద్భుతమైన అవకాశాన్నిచ్చిందని శ్రీనివాస్ కృత జ్ఞతలు వ్యక్తం చేశారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలోనే అత్యధిక వేతనం (రూ.7.52 కోట్లు) పొందిన శ్రీనివాస్ త్వరలో మరో ఐటీ సేవల కంపెనీకి సీఈవో, ఎండీ కానున్నట్లు సమాచారం.
10 మంది ఔట్...
శ్రీనివాస్ రాజీనామా పట్ల ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. కంపెనీ వృద్ధిలో శ్రీనివాస్ పాత్ర ఎంతో ముఖ్యమైనది, కీలకమైనదని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో శ్రీనివాస్ చేపట్టే అన్ని ప్రయత్నాల్లో ఆయనను విజయం వరించాలని మూర్తి ఆకాంక్షించారు. 2013, జూన్ 1న మూర్తి ఇన్ఫోసిస్‌లో మళ్లీ ప్రవేశించారు. తన తనయుడు, రోహన్ మూర్తిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ఫోసిస్ నుంచి 10 మంది సీనియర్‌లు వైదొలిగారు. కాగా శ్రీనివాస్ రాజీనామా ఇన్ఫోసిస్ షేర్‌పై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభా వం చూపించగలదని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బుధవారం రాత్రి నాస్‌డాక్‌లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4% పైగా క్షీణించింది.