Vishal sicca
-
అంచనాలు మించిన ఇన్ఫీ..!
♦ క్యూ3లో రూ.3,465 కోట్ల ♦ నికర లాభం, 6.6% వృద్ధి ♦ 15.3% పెరిగిన ఆదాయం; రూ. 15,902 కోట్లు ♦ ఈ ఏడాది ఆదాయ అంచనాలు పెంపు... బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలు మించిన ఫలితాలతో ఆశ్చర్యపరిచింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో కంపెనీ రూ.3,465 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 3,250 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 6.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 15.3 శాతం వృద్ధితో రూ.13,796 కోట్ల నుంచి రూ. 15,902 కోట్లకు పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు సగటున ఇన్ఫోసిస్ క్యూ3లో రూ.3,300 కోట్ల నికర లాభాన్ని, రూ.15,748 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా చూస్తే... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో నమోదైన రూ.3,398 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మూడో త్రైమాసికం(క్యూ3)లో లాభం 2 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం (క్యూ2లో రూ.15,635 కోట్లు) 1.7 శాతం పెరిగింది. ఇక డాలరు రూపంలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 0.6 శాతం వృద్ధితో 2.392 బిలియన్ల నుంచి 2.407 బిలియన్లకు చేరింది. దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ సీక్వెన్షియల్ నికర లాభం స్వల్పంగా(0.26 శాతం) తగ్గగా.. ఇన్ఫీ మాత్రం ఆకర్షణీయమైన వృద్ధిని నమోదుచేయడం గమనార్హం. గెడైన్స్ అప్... 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్ల రూపంలో ఆదాయం అంచనాలను(గెడైన్స్)ను ఇన్ఫీ భారీగా పెంచింది. అంతక్రితం 6.4-8.4 శాతం వృద్ధిని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.9-9.3 శాతానికి పెంచడం విశేషం. ఇక స్థిర కరెన్సీ ప్రాతిపదిక(రూపాయల్లో) కూడా ఆదాయ అంచనాలను 10-12 శాతం స్థాయి నుంచి 12.8-13.2 శాతానికి పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో గెడైన్స్‌ను పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ3లో కంపెనీకి కొత్తగా 75 క్లయింట్లు జతయ్యారు. 35 కోట్ల డాలర్ల విలువైన 4 భారీ కాంట్రాక్టులను దక్కించుకుంది. మరో 60 కోట్ల డాలర్ల విలువైన డీల్ ఖరారు కానున్నట్లు కంపెనీ తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో అనుబంధ సంస్థలన్నింటితో కలిపి ఇన్ఫోసిస్‌లో స్థూలంగా 14,027 మంది ఉద్యోగ నియామకాలు నమోదయ్యాయి. అయితే, ఇదే క్వార్టర్లో 8,620 మంది ఉద్యోగులు వలసపోవడం(అట్రిషన్)తో నికరంగా 5,407 మంది జతయ్యారు. 2015, డిసెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,98,383కు చేరింది. క్యూ3లో అట్రిషన్ రేటు 18.1 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇది 19.9 శాతంగా ఉంది. కంపెనీ వద్ద డిసెంబర్ ఆఖరుకి రూ.31,526 కోట్ల నగదు, తత్సబంధ నిల్వలు ఉన్నాయి. ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో గురువారం ఇన్ఫోసిస్ షేరు ధర పరుగులు తీసింది. బీఎస్ఈలో ఒకానొక దశలో 6.74 శాతం ఎగబాకి రూ.1,155 గరిష్టాన్ని తాకింది. చివరకు 4.3 శాతం లాభపడి రూ.1,129 వద్ద స్ధిరపడింది. సాధారణంగా మూడో త్రైమాసికంలో ఉండే ఒడిదుడుకులతో పాటు అదనపు సమస్యలు నెలకొన్నప్పటికీ మెరుగైన ఫలితాలను ప్రకటించాం. దీనికి ప్రధానంగా మేం అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు, అయికిడో సర్వీసులు క్లయింట్లను ఆకట్టుకోవడం వంటివి దీనికి దోహదం చేశాయి. కొత్త విభాగాలు, ప్రాంతాల నుంచి ఆదాయాల్లో నిలకడైన వృద్ధి నమోదవుతోంది. 2022 నాటికి 30% మార్జిన్, 20 బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని అందుకోగలమని విశ్వసిస్తున్నాం. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
ఇన్ఫోసిస్ అంచనాలు మిస్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలు తప్పింది. మిగతా ఐటీ దిగ్గజాల మాదిరిగానే నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. అయితే, బోనస్ షేర్ల ప్రకటన ద్వారా ఇన్వెస్టర్లను మాత్రం ఆశ్చర్యపరిచింది. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర ఒకే రోజు 6 శాతం దిగజారింది. క్యూ4లో నికర లాభం రూ.3,097 కోట్లు; 3.5% వృద్ధి ⇒ సీక్వెన్షియల్‌గా 4.7 శాతం డౌన్... ⇒ ఇన్వెస్టర్లకు 1:1 బోనస్ షేర్లు... ⇒ షేరుకి రూ.29.5 డివిడెండ్ ప్రకటన... ⇒ 6 శాతం కుప్పకూలిన షేరు ధర... బెంగళూరు: ఇన్ఫోసిస్ మార్చి క్వార్టర్ (2014-15, క్యూ4)లో రూ.3,097 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,992 కోట్లతో పోలిస్తే లాభం 3.5 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం విషయానికొస్తే.. రూ.12,875 కోట్ల నుంచి రూ.13,411 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ది నమోదైంది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ4లో రూ.3,161 కోట్ల నికర లాభం, రూ.13,818 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ప్రైసింగ్ ఒత్తిడి, కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు, ఇతరత్రా అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపాయి. సీక్వెన్షియల్‌గా డౌన్... క్రితం ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 4.7 శాతం దిగజారింది. క్యూ3లో లాభం రూ. 3,250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం 2.8%(క్యూ3లో రూ.13,796 కోట్లు) క్షీణించింది. గెడైన్స్ ఇలా... ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ విలువ ప్రకారం కంపెనీ ఆదాయాల్లో 10-12 శాతం వృద్ధి(గెడైన్స్) ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది. ఇక రూపాయల్లో ఆదాయ వృద్ధి 8.4-10.4 శాతంగా, డాలర్ల ప్రాతిపదికన 6.2-8.2 శాతంగా అంచనా వేసింది. పరిశీలకులు గెడైన్స్ 9-11 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. దీనికన్నా ఇన్ఫీ గెడైన్స్ ఎక్కువే అయినా... ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్... ఈ ఏడాది సాఫ్ట్వేర్ సేవల ఆదాయాల్లో వృద్ధి 12-14% ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో పోలిస్తే ఇన్ఫీ గెడైన్స్ తక్కువగానే ఉంది. పూర్తి ఏడాదికి చూస్తే... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,329 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,648 కోట్లతో పోలిస్తే 15.8 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 6.4 శాతం వృద్ధితో రూ.50,133 కోట్ల నుంచి రూ.53,319 కోట్లకు ఎగబాకింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ రూ. 5 ముఖవిలువగల ఒక్కో షేరుపై రూ.29.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది (1:1 బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకుంటే షేరుకి రూ.14.75 చొప్పున). ⇒ క్యూ4లో కొత్తగా 52 క్లయింట్లను కంపెనీ జత చేసుకుంది. ⇒ ఈ ఏడాది మార్చినాటికి ఇన్ఫీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.32,585 కోట్లకు చేరాయి. 2014 మార్చి నాటికి ఈ మొత్తం రూ.30,251 కోట్లు కాగా, డిసెంబర్ చివరికి రూ.34,873 కోట్లు. ⇒ క్యూ4లో 6.549 మంది ఉద్యోగులను కంపెనీ నికరంగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య మార్చినాటికి 1,76,187కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు క్యూ3లో 20.6 శాతం కాగా, క్యూ4లో 18.9 శాతానికి తగ్గింది. నిరుత్సాహకరమైన ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర భారీగా పడిపోయింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 6.5 శాతం మేర దిగజారి రూ.1,982 కనిష్టస్థాయిని తాకింది. చివరకు 5.95 శాతం నష్టపోయి రూ.1,996 వద్ద స్థిరపడింది. బోనస్ బొనాంజా... ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసం పెంచడంపై ఇన్ఫోసిస్ దృష్టిపెట్టింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1 నిష్పత్తిలో) బోనస్‌గా ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన అమెరికన్ డిపాజిటరీ షేర్(ఏడీఎస్)లకు కూడా ఇదే నిష్పత్తిలో బోనస్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి ఈ ప్రతిపాదన అమలవుతుందని వెల్లడించింది. కాగా, కంపెనీ కొత్త సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టాక ఇది రెండో బోనస్ ఇష్యూ కావడం విశేషం.గతేడాది అక్టోబర్‌లో(క్యూ2 ఫలితాల సందర్భంగా) ఇన్ఫీ 1:1 నిష్పత్తిలోనే బోనస్‌ను ప్రకటించింది. ‘కలిడస్’ కొనుగోలు... అమెరికాకు చెందిన డిజిటల్ ఎక్స్పీరియన్స్ సొల్యూషన్స్ కంపెనీ ‘కలిడస్’ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఈ డీల్ విలువ 12 కోట్ల డాలర్లు(దాదాపు రూ.750 కోట్లు). దీంతోపాటు ఎయిర్విజ్లో మైనారిటీ వాటా కోనుగోలు కోసం 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందానికి కూడా బోర్డు ఓకే చెప్పినట్లు కంపెనీ వెల్లడించింది. ఫినాకిల్, ఎడ్జ్సర్వీసెస్ వ్యాపారాలను సబ్సిడరీ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు బదలాయించే ప్రతిపాదనకు సైతం ఆమోదముద్ర పడింది. ఐటీ పరిశ్రమఫండమెంటల్గా, నిర్మాణాత్మకమైన మార్పులను సంతరించుకుంటోంది. గడిచిన త్రైమాసికంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. మేం కొత్తగా అనుసరిస్తున్న ‘రెన్యూ-న్యూ’ వ్యూహంలో ఆరంభ విజయాలను ఆస్వాదిస్తున్నాం. 2017కల్లా దేశీ ఐటీ పరిశ్రమ సగటు వృద్ధి రేటును అందుకోగలమన్న విశ్వాసం ఉంది. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి * ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ * ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్లు వైదొలగడంపై.. ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. రోహన్ మూర్తిపై.. ‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది. అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్వెర్వ్ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు.. మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్మెంట్కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు.