అంచనాలు మించిన ఇన్ఫీ..!
♦ క్యూ3లో రూ.3,465 కోట్ల
♦ నికర లాభం, 6.6% వృద్ధి
♦ 15.3% పెరిగిన ఆదాయం; రూ. 15,902 కోట్లు
♦ ఈ ఏడాది ఆదాయ అంచనాలు పెంపు...
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలు మించిన ఫలితాలతో ఆశ్చర్యపరిచింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2015-16, క్యూ3)లో కంపెనీ రూ.3,465 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 3,250 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 6.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 15.3 శాతం వృద్ధితో రూ.13,796 కోట్ల నుంచి రూ. 15,902 కోట్లకు పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు సగటున ఇన్ఫోసిస్ క్యూ3లో రూ.3,300 కోట్ల నికర లాభాన్ని, రూ.15,748 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు.
సీక్వెన్షియల్‌గా చూస్తే...
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో నమోదైన రూ.3,398 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మూడో త్రైమాసికం(క్యూ3)లో లాభం 2 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం (క్యూ2లో రూ.15,635 కోట్లు) 1.7 శాతం పెరిగింది. ఇక డాలరు రూపంలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 0.6 శాతం వృద్ధితో 2.392 బిలియన్ల నుంచి 2.407 బిలియన్‌లకు చేరింది. దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ సీక్వెన్షియల్ నికర లాభం స్వల్పంగా(0.26 శాతం) తగ్గగా.. ఇన్ఫీ మాత్రం ఆకర్షణీయమైన వృద్ధిని నమోదుచేయడం గమనార్హం.
గెడైన్స్ అప్...
2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్ల రూపంలో ఆదాయం అంచనాలను(గెడైన్స్)ను ఇన్ఫీ భారీగా పెంచింది. అంతక్రితం 6.4-8.4 శాతం వృద్ధిని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.9-9.3 శాతానికి పెంచడం విశేషం. ఇక స్థిర కరెన్సీ ప్రాతిపదిక(రూపాయల్లో) కూడా ఆదాయ అంచనాలను 10-12 శాతం స్థాయి నుంచి 12.8-13.2 శాతానికి పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో గెడైన్స్‌ను పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ3లో కంపెనీకి కొత్తగా 75 క్లయింట్లు జతయ్యారు. 35 కోట్ల డాలర్ల విలువైన 4 భారీ కాంట్రాక్టులను దక్కించుకుంది. మరో 60 కోట్ల డాలర్ల విలువైన డీల్ ఖరారు కానున్నట్లు కంపెనీ తెలిపింది.
అక్టోబర్-డిసెంబర్ కాలంలో అనుబంధ సంస్థలన్నింటితో కలిపి ఇన్ఫోసిస్‌లో స్థూలంగా 14,027 మంది ఉద్యోగ నియామకాలు నమోదయ్యాయి. అయితే, ఇదే క్వార్టర్‌లో 8,620 మంది ఉద్యోగులు వలసపోవడం(అట్రిషన్)తో నికరంగా 5,407 మంది జతయ్యారు. 2015, డిసెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,98,383కు చేరింది. క్యూ3లో అట్రిషన్ రేటు 18.1 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇది 19.9 శాతంగా ఉంది.
కంపెనీ వద్ద డిసెంబర్ ఆఖరుకి రూ.31,526 కోట్ల నగదు, తత్సబంధ నిల్వలు ఉన్నాయి.
ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో గురువారం ఇన్ఫోసిస్ షేరు ధర పరుగులు తీసింది. బీఎస్‌ఈలో ఒకానొక దశలో 6.74 శాతం ఎగబాకి రూ.1,155 గరిష్టాన్ని తాకింది. చివరకు 4.3 శాతం లాభపడి రూ.1,129 వద్ద స్ధిరపడింది.
సాధారణంగా మూడో త్రైమాసికంలో ఉండే ఒడిదుడుకులతో పాటు అదనపు సమస్యలు నెలకొన్నప్పటికీ మెరుగైన ఫలితాలను ప్రకటించాం. దీనికి ప్రధానంగా మేం అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు, అయికిడో సర్వీసులు క్లయింట్లను ఆకట్టుకోవడం వంటివి దీనికి దోహదం చేశాయి. కొత్త విభాగాలు, ప్రాంతాల నుంచి ఆదాయాల్లో నిలకడైన వృద్ధి నమోదవుతోంది. 2022 నాటికి 30% మార్జిన్, 20 బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని అందుకోగలమని విశ్వసిస్తున్నాం.
- విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ