ఇన్ఫోసిస్‌ భేష్‌ | Infosys Q3 Profit Rises 12percents To Rs 5,809 Crores | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ భేష్‌

Published Thu, Jan 13 2022 4:31 AM | Last Updated on Thu, Jan 13 2022 4:31 AM

Infosys Q3 Profit Rises 12percents To Rs 5,809 Crores - Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవలకు దేశంలోనే రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 11.8 శాతం పుంజుకుని రూ. 5,809 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 5,197 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 23 శాతం ఎగసి రూ. 31,867 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 25,927 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. భారీ డీల్స్‌ను గెలుచుకోవడం ద్వారా క్యూ3లో మొత్తం కాంట్రాక్టు విలువ(టీసీవీ) 2.53 బిలియన్‌ డాలర్లను తాకినట్లు వెల్లడించింది.

20 శాతం వరకూ
మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 19.5–20 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ తాజాగా అంచనా వేసింది. వెరసి ఇంతక్రితం అక్టోబర్‌లో ఇచ్చిన 16.5–17.5 శాతం అంచనాలను ఎగువముఖంగా సవరించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే సంగతి తెలిసిందే.

సరఫరా సవాళ్ల నేపథ్యంలో వ్యయాలు పెరిగినప్పటికీ మరోసారి మెరుగైన మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ పేర్కొన్నారు. నైపుణ్యాలను సొంతం చేసుకోవడం, అభివృద్ధిలపై పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియజేశారు. వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచస్థాయిలో నియమించుకుంటున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య ఈ ఏడాది 55,000కుపైగా చేరనున్నట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు 1.2% బలపడి రూ. 1,878 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది.

క్లయింట్లకున్న విశ్వాసం
పటిష్ట పనితీరుతోపాటు, మార్కెట్‌ వాటాను పెంచుకోవడం వంటి అంశాలు డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కంపెనీ సర్వీసులపట్ల క్లయింట్లకున్న విశ్వాసానికి ప్రతీకలు. నాలుగేళ్లుగా డిజిటల్, క్లౌడ్‌ సేవలలో నిలకడైన వ్యూహాలతో ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా క్లయింట్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు నైపుణ్యాల పెంపు, లోతైన సంబంధాలతో క్లయింట్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఇది కంపెనీ గైడెన్స్‌ పెంపులో ప్రతిఫలిస్తోంది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్స్‌పై భారీ కార్పొరేట్ల వ్యయాలు కొనసాగే వీలుంది. కొత్త ఐటీ పోర్టల్‌కు సంబంధించి తదుపరి దశలో మరోసారి  ఆదాయపన్ను శాఖతో కలసి పనిచేస్తాం. మరిన్ని సౌకర్యాలు(మాడ్యూల్స్‌) సమకూర్చుతాం. డిసెంబర్‌కల్లా 5.89 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. డిసెంబర్‌ 31నే 46.11 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

– సలీల్‌ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement