ఏఐ ప్రైవేటీకరణకు తొందరపడం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఏఐ ప్రైవేటీకరణపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికీ రాలేదనీ, దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తామనీ చెప్పారు. ‘వివిధ దేశాల్లోని అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు సమర్థంగా పనిచేస్తున్నాయి. కారణం ఏదైనా మనదగ్గర అలా జరగలేదు. కానీ, ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించాల్సి ఉంది.
ఎయిర్ ఇండియా ప్రభుత్వ అధీనంలో ఉంది. ఆ సంస్థకు కొన్ని సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలున్నాయి. ఎయిర్ ఇండియాను ఎలా అభివృద్ధి చేయగలమో ఆలోచించాలి..’ అని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ పునఃసమీక్షిస్తారా అని ప్రశ్నించగా, పోస్ట్‌మార్టమ్ వల్ల లాభం ఉండదని బదులిచ్చారు. మునుపటి ప్రభుత్వం అనేక రంగాలకు పలు హామీలిచ్చింది... వాటన్నిటినీ అమలు చేయాలంటే ప్రభుత్వంలో మార్పు ఉండకూడదని వ్యాఖ్యానించారు. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు చేపడతామని తెలిపారు.