'ఇప్పటికీ విమానాల్లో అగ్గిపెట్టె తీసుకెళ్తున్నా'
విమానాల్లో అగ్గిపెట్టెలు, సిగరెట్ల లాంటివాటిని అనుమతించరు గానీ, తాను ఇప్పటికీ అగ్గిపెట్టెలను తీసుకెళ్తూనే ఉన్నానని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. విమానాల ఆలస్యం గురించి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఆయనీ విషయం తెలిపారు. ''నేను సిగరెట్లు కాలుస్తా. విమానశ్రయాల్లో నన్ను తనిఖీ చేయడం మానేయగానే అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్తున్నా'' అన్నారు. అయితే ప్యారిస్ విమానాశ్రయంలో మాత్రం తనిఖీలు గట్టిగా ఉంటాయని, వాళ్లు తన జేబులు చూసిన తర్వాత అగ్గిపెట్టె, సిగరెట్లు, పోర్టబుల్ యాష్ ట్రే అన్నింటినీ తీసేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. తన అగ్గిపెట్టెతో సహా అన్నింటినీ వాళ్లు తనకు తిరిగి ఇచ్చేశారన్నారు.
ఈ సందర్భంగా ఆయన తన పోర్టబుల్ యాష్ ట్రేను తీసి చూపించారు. కొన్ని దేశాల్లో అగ్గిపెట్టెలను విమానాల్లో నిషేధిత వస్తువుగా ప్రకటించారని, కొన్ని దేశాల్లో మాత్రం అలా లేదని అన్నారు. భద్రత అనేది అర్థవంతంగా ఉండాలి తప్ప అర్థరహితంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ అగ్గిపెట్టెలు తీసుకెళ్లే హక్కు కల్పించాలంటారా అని విలేకరులు ప్రశ్నించగా, పొగ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు తనకు తెలుసని, అందువల్ల భారతీయులు పొగతాగకూడదనే తాను చెబుతానని మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు.