న్యూఢిల్లీ/విజయనగరం: ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్ కలకలం రేపింది. మొదట ఈ వ్యవహారాన్ని తక్కువ చేసి చూపేందుకు యత్నించిన ఎయిరిండియా.. పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు జోక్యంతో చర్యలకు దిగింది. ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరు సెక్యూరిటీ అధికారులపై వేటు వేసింది. ముంబై నుంచి బయలుదేరిన బోయింగ్ 747-400 ఏఐ-965 విమానం హైదరాబాద్ మీదుగా శనివారం తెల్లవారుజామున సౌదీఅరేబియాలోని జెద్దాకు చేరింది. ల్యాండింగ్ సమయంలో బిజినెస్ క్లాస్‌లోని సీట్ల కింద ప్లాస్టిక్ కవర్‌లో చుట్టబడి ఉన్న ఓ అనుమానిత వస్తువు కనిపించడంతో పైలట్లు జెద్దా ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ల్యాండ్ అవ్వగానే భద్రతా సిబ్బంది విమానాన్ని స్వాధీనం చేసుకుని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అనంతరం విమానం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎయిర్‌పోర్ట్ భద్రతాధికారులు అనుమతించారు.
ఎయిరిండియా మొదట ఓ ప్రకటనలో స్పందిస్తూ.. విమానంలో కనిపించింది డమ్మీ గ్రనేడ్ కాదని, ఒక ప్లాస్టిక్ కవర్ మాత్రమే అని పేర్కొంది. అయితే మంత్రి అశోక్‌గజపతిరాజు విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్ ను గుర్తించడం వాస్తవమే అని పేర్కొన్నారు. గత నెలలో ఎన్‌ఎస్‌జీ కమాండోలు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎయిర్‌పోర్టులు, విమానాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారని, ఆ సమయంలో ఈ గ్రనేడ్ విమానంలో ఉండిపోయినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. తనిఖీల సమయంలో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. మొదట తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఎయిరిండియా మంత్రి కలుగజేసుకోవడంతో చర్యలకు దిగింది.
ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరు భద్రతా తనిఖీల అధికారులను సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలకు చెందిన సంయుక్త బృందం విచారణ ప్రారంభించింది. అన్ని దశల్లోనూ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ విమానం అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోసం స్టాండ్‌బైగా ఉంచిందంటూ వచ్చిన వార్తలను ఎయిరిండియా కొట్టిపారేసింది. ఆ సమయంలో ఈ విమానాన్ని ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య నడిపినట్టు పేర్కొంది.