'ఎంపీలు దొరికేస్తారని కలలో కూడా అనుకోలేదు'
మన విమానయాన సంస్థలలో భద్రతా నిబంధనలు చాలా బాగున్నాయని, అయితే ఒక పార్లమెంటు సభ్యుడు ఇలా దొరికేస్తాడని తాను కలలో కూడా ఊహించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లోక్‌సభలో వ్యాఖ్యానించారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సిబ్బంది ఒకరిని 25 సార్లు చెప్పుతో కొట్టడం, దాంతో పలు విమానయాన సంస్థలు ఆయనను తమ విమానాల్లో ఎక్కించుకోబోమంటూ నిషేధం విధించిన అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోను సోమవారం చర్చ జరిగింది.
కమెడియన్ కపిల్ శర్మ కూడా బాగా తాగేసి విమానంలో గొడవ చేశాడని, అయితే అతడిపై మాత్రం నిషేధం ఎందుకు విధించలేదని శివసేన ఎంపీ ఆనందరావు అడ్సుల్ ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని ఈ సందర్భంగా లోక్‌సభలో అశోక్ గజపతిరాజు చెప్పారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను నిషేధించడం ద్వారా విమానయాన సంస్థలు తమ దాదాగిరీ చూపించుకుంటున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద పలు పార్టీలకు చెందిన ఎంపీలు రవీంద్ర గైక్వాడ్‌కు మద్దతుగా నిలిచి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.