'డమ్మీ గ్రనేడ్ ను గుర్తించడం వాస్తవమే'
విజయనగరం: ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్ ను గుర్తించడం వాస్తవమే అని పౌర విమానాయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత నెలలో ఎన్‌ఎస్‌జీ కమాండోలు దేశవాప్తంగా ఎంపిక చేసిన ఎయిర్‌పోర్టులు, విమానాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారని, ఆ సమయంలో ఈ గ్రనేడ్ విమానంలో ఉండిపోయినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా అది డమ్మీ గ్రనేడ్ కాదని, ఒక ప్లాస్టిక్ కవర్ మాత్రమే అని ఎయిర్ ఇండియా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.
మొదట తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఎయిరిండియా మంత్రి కలుగజేసుకోవడంతో చర్యలకు దిగింది. ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరు భద్రతా తనిఖీల అధికారులను సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలకు చెందిన సంయుక్త బందం విచారణ ప్రారంభించింది. అన్ని దశల్లోనూ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.