match box
-
కాదేదీ రికార్డుకనర్హం! కనుకే అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..
'జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు తారసపడుతూంటాయి. కొందరి జీవతంలో వారే వింతగా ఏదేదో సాధిస్తూంటారు. అలా చేసేదాకా వారికి అదే ధ్యాసనో, లేక అదే ప్రపంచమో..! ఇలాగే డెన్మార్క్‌లోని ఓ వ్యక్తి చేసిన రికార్డును చూస్తే.. వ్హా అనక తప్పదు. ఇక ఆ రికార్డు ఏంటో తెలుసుకందాం.' ‘అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే ఈ డేనిష్ పెద్దమనిషి మాత్రం కాదేదీ రికార్డుకనర్హం అనుకుని, ఏకంగా అగ్గిపుల్లలతో రికార్డు సృష్టించాడు. రెండు ముక్కురంధ్రాల్లోనూ 68 అగ్గిపుల్లలను దట్టించుకుని, అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలను ముక్కులో దట్టించుకున్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. డెన్మార్క్‌లోని ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న పీటర్, త్వరలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి మారాలనుకుంటున్నాడు. తన చర్మానికి సాగే గుణం సాధారణం కంటే కొంత ఎక్కువని, అందువల్లనే సునాయాసంగా ఈ రికార్డును సాధించగలిగానని అతడు చెప్పాడు. ఇదివరకు ఒక వ్యక్తి ముక్కురంధ్రాల్లో 44 అగ్గిపుల్లలను దట్టించుకుని రికార్డు నెలకొల్పాడు. పీటర్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించడం విశేషం. ఇవి చదవండి: పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..! -
అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!
గార్డెన్లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే... అగ్గిపుల్లతో ఏం చేయాలంటే.. అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది. (చదవండి: విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే! అది పెట్టకుండా గడప కూడా..) -
అడ్డగించి.. 'అగ్గిపెట్టె ఉందా' అని అడిగి.. ఆపై..
కరీంనగర్: పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున యువకులు వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులను కొట్టిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన అనుమాండ్ల రాజు పెద్ది రమేశ్‌తో కలిసి కరీంనగర్లో కూరగాయలను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి, శుక్రవారం తెల్లవారుజామున ట్రాలీ ఆటోలో వస్తున్నాడు. చొప్పదండి పట్టణంలోని గాంధీనగర్ దాటిన తర్వాత ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి, వాహనానికి అడ్డుగా నిల్చొని, రాజును అగ్గిపెట్టె అడిగారు. అతను లేదని చెప్పి, ముందుకు వెళ్లగా మళ్లీ అడ్డగించారు. ఈసారి మరింత మంది జమకూడి, రాజును, అడ్డువచ్చిన రమేశ్‌పై దాడి చేశారు. ట్రాలీ ఆటో అద్దం పగులగొట్టారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని రాజు తెలిపాడు. గాయపడిన అతను కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లి, చికిత్స చేయించుకున్నాడు. శనివారం చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు చొప్పదండికి చెందిన ఎండీ.ఫయాజ్, కోరుట్లకు చెందిన లింగంపల్లి మౌనేశ్, ఎలిగేడుకు చెందిన సింగిరెడ్డి రమణలపై కేసు నమోదు చేశారు. -
అగ్గిపెట్టెలో.. డైనింగ్ టేబుల్!
సాక్షి, కోనసీమ జిల్లా: అతను వృత్తిరీత్యా కార్పెంటర్.. తను నేర్చుకున్న కళకు మరింత పదును పెట్టి సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన చేనేత కళాకారులు తయారు చేశారని విన్నాం. అయితే కోనసీమ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన ఉప్పులూరి శ్రీనివాసరావు మాత్రం అగ్గిపెట్టెలో పట్టేంత సూక్ష్మంగా వస్తువులను తయా రుచేసి.. ఔరా అనిపిస్తున్నాడు. మడత మంచం, మడత కుర్చీ, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను అగ్గిపెట్టెలో పట్టేంతగా తయారు చేశాడు. మడత మంచం, మడత కుర్చీని ఒక్క రోజులో తయారుచేయగా, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను మూడు రోజుల్లో తయారు చేసినట్టు శ్రీనివాసరావు చెప్పాడు. ఐదేళ్లుగా పలు రకాల సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నానని, భవిష్యత్తులో సూక్ష్మ కళతో మరిన్ని వస్తువులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. చదవండి: లవ్‌చాట్.. మేడ్ ఇన్ ఆంధ్రా -
అగ్గిపెట్టె చీర అద్భుతం
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తానని ఐటీ, చేనేతశాఖ మంత్రి తారకరామారావు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ ఆ చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని, ఇంత అద్భుతమైన చీర నేసినందుకు విజయ్ను సబిత అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్ల చేనేత రంగంలో ఇప్పటికే అనేక మార్పులొచ్చాయని, సిరిసిల్ల నేతన్నలు ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు వెళ్తున్నారని విజయ్ మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం తాను నేసిన చీర మూడు రోజులు మరమగ్గాలపై నేసే అవకాశముంటుందని, అదే చీర చేతితో నేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని వివరించారు. ఈ మేరకు త్వరలో తాను ప్రారంభించబోయే యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని కేటీఆర్‌ను కోరారు. -
Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్ ..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తిదారులు అగ్గిపెట్టె ధర పెంచనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా, కోవిల్పట్టి తెన్కాశి జిల్లా శంకరం కోయిల్, విరుదునగర్ జిల్లా శివకాశి, గుడియాత్తంలో సుమారు రెండువేలకు పైగా అగ్గిపెట్టె కర్మాగారాలున్నాయి. వీటిలో ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ సుమారు 5 లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో క్లోరైడ్, అట్ట, మైనం, పేపర్ తదితర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అగ్గిపెట్టె ధరలను పెంచాలని ఉత్పత్తిదారుల సంఘం కోరింది. దీంతో శుక్రవారం సమాలోచన కూటమి నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను రూ.2కి విక్రయింయాలని నిర్ణయించారు. ఉత్పత్తిదారుల సంఘం వారు మాట్లాడుతూ గత 1995లో 50 పైసలకు విక్రయించిన అగ్గిపెట్టెను 2008లో రూపాయికి పెంచామన్నారు. 14 సంవత్సరాల తరువాత అగ్గిపెట్టె ధరను ప్రస్తుతం రూ.2కి పెంచుతున్నట్లు వెల్లడించారు. -
అగ్గిపెట్టె కళ.. ప్రపంచ చరిత్ర చూపుతూ
చీకటింట వెలుతురుకు జన్మనివ్వడమే కాదు గత వైభవ కాంతినీ కళ్లకు కడుతుంది అగ్గిపెట్టె. నమ్మకం కుదరకపోతే అఖంఢ భారతావనితో పాటు ఖండాంతర ఖ్యాతిని కళ్లకు కట్టే ఈ మ్యాచ్ బాక్స్ లోగోలను ఒకసారి తిలకించండి. అమితాబ్ బచ్చన్ కూలీ సినిమా నుంచి టాటా నానో వరకు ఆసక్తి కథనాలను మ్యాచ్బాక్స్ లోగోలతో పరిచయం చేస్తాను రండి.. అంటూ ఆహ్వానిస్తోంది శ్రేయ కాటూరి. సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘ఆర్ట్ ఆన్ ఎ బాక్స్’ శ్రేయకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. మ్యాచ్ బాక్స్ ద్వారా ప్రపంచ చరిత్రను విశ్లేషణాత్మకంగా చూపుతూ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అగ్గిపెట్టె కథలు ఢిల్లీలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల శ్రేయ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా అనుకోకుండా వివిధ దేశాల ప్రసిద్ధ సంస్కృతులకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా వినూత్నంగా తను అప్పటికే అలవాటుగా అప్పుడప్పుడు సేకరించిన మ్యాచ్బాక్స్లపై ఆమె దృష్టి పడింది. ఆ దృష్టి కోణం ఆమెను వినూత్నంగా ఆలోచింపజేసింది. ఆ ఆసక్తి వివిధ దేశాలకు సంబంధించిన 5,000 మ్యాచ్ బాక్స్ లోగోలను సేకరించి, శోధించి, విశ్లేషించేంతగా మారింది. అగ్గిపెట్టెల లోగో రూపకల్పనలో ఉన్న కథలను తెలుసుకుంటున్నకొద్దీ ఆమెకెన్నో విషయాల మీద అవగాహన పెరిగింది. ఈ విషయాలను పంచుకోవడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సరైన వేదికగా భావించింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘ఆర్ట్ ఆన్ ఎ బాక్స్’ పేరుతో అగ్గిపెట్టెల కథలు మొదలుపెట్టింది. రంగురంగుల లేబుళ్ల సాక్ష్యం.. ప్రిన్స్ చార్లెస్ పెళ్లి వంటి ముఖ్యమైన చారిత్రక సంఘటనను స్మరించుకునే అగ్గిపెట్టె లేబుల్ కూడా శ్రేయ సేకరణలో ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత త్రివర్ణ పతాకం, అశోకచక్రం వంటి జాతీయ చిహాలు, స్వాతంత్య్ర సమరయోధులను కూడా మ్యాచ్బాక్స్లపైన చిత్రీకరించినవి ఉన్నాయి. ఆమె పరిశోధన అక్కడితో ఆగలేదు. అగ్గిపెట్టెల లోగోల కళను అర్థం చేసుకోవడంపై మరింతగా దృష్టి సారించింది. ‘‘సామాజిక దృక్కోణంలో అగ్గిపెట్టెల గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. మతం, లింగ భేదం, దేశం ఇలా మూడు డొమైన్లను కేంద్రంగా ఉపయోగించి మ్యాచ్బాక్స్ల వెనుక ఉన్న కథలను పునర్నిర్మించాను. అందులో లేబుళ్లదే అసలైన ప్రాధాన్యత’’. అంటుంది. సంస్కృతుల అవగాహన ఈ పరిశోధన పూర్తి చేయడానికి ఏడాదికి పైగానే పట్టింది. చాలా ఆసక్తిగా అనిపించింది. వేల మ్యాచ్బాక్స్లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలవీ నా దగ్గర ఉన్నాయి. భారతదేశంలో అగ్గిపెట్టెలను అధ్యయనం చేసిన తరువాత, మతపరమైన చిహ్నాలను దైవిక ఐకానోగ్రఫీ రూపంలో ఉపయోగించడంలో నిరంతరం కృషి జరిగిందని తెలుసుకున్నాను. స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చినవి, జాతీయవాద స్ఫూర్తిని పెంచినవి.. ఒక్కోటి తెలుసుకుంటూ వెళితే ఆ ప్రయాణం అత్యంత అద్భుతంగా అనిపించింది స్త్రీని వస్తువుగా చూపిన కాలం 90 లలో లోగోలు బ్రాండ్ల వంటి వినియోగదారు ఉత్పత్తులను బట్టి మ్యాచ్బాక్స్ లేబుల్స్ మార్చారు. మరొకటి లింగ ప్రాతినిధ్యం పరంగా ఉంది. ఇది పితృస్వామ్య ఆధిపత్య శ్రేణులదని గమనించాను. నేను చూసిన ఒకే ఒక లేబుల్ పి.టి. ఉష మాత్రమే. ఎప్పుడూ పెళ్లికూతురు, బాలీవుడ్ ప్రముఖ తారల బొమ్మలు. మహిళలను ఎలా చిత్రీకరిస్తారనే దానిపైన నిర్వచనం సంవత్సరాలుగా మారనేలేదని స్పష్టమైంది. సాంకేతిక పరంగా చూస్తే మైక్రోసాఫ్ట్, ఆపిల్, కింగ్‌ఫిషర్ వంటి బ్రాండ్లు ఎలా అభివృద్ధి చెందాయో అగ్గిపెట్టెల లోగోలు చూపాయి. సాధారణ ఇతివృత్తాలు జంతువులు, మొక్కలు, పక్షులు, రేడియోలు, కార్లు .. వంటివి మ్యాచ్బాక్స్లలో ఉన్నాయి. నా స్థాయిలో నేను నా ప్రాజెక్ట్ ద్వారా ప్రజలను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు కొన్ని విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. అగ్గిపెట్టె కళ ద్వారా మహిళల చిత్రాల చిత్రణ నిర్వచనాన్ని మార్చలేమా? అన్నదే నా ప్రశ్న. మహిళల చిత్రాలను రైతులు, ఉపాధ్యాయులు లేదా వ్యోమగామిగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది స్ఫూర్తిదాయకమైన మహిళలు వివిధ రంగాలలో అసాధారణమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దేశాల మధ్య వైరుధ్యం వివిధ దేశాల నుండి అగ్గిపెట్టెల నమూనా లో ఖచ్చితంగా పెద్ద తేడా ఉంది. నేను సేకరించిన మ్యాచ్బాక్స్ల గరిష్ట సంఖ్య అమెరికా, భారత్. అమెరికాలోని బార్లు, రెస్టారెంట్ల నుండి కొన్ని సేకరించాను. వాటి డిజైన్ బ్రాండ్ ఆధారితమైనవి. అమెరికా మ్యాచ్‌బాక్స్‌లు అక్కడి చరిత్రలో 60 నుంచి 80 ల మధ్య కాలంలో ప్రత్యేకంగా ప్రింటింగ్ కంపెనీలు, హోటళ్ళు, రెస్టారెంట్ల కోసం ప్రకటనల సాధనంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జాతీయవాద భావాలను ప్రేరేపించడానికి బాగా ఉపయోగ పడ్డాయి. ఇతర దేశాల విషయానికొస్తే స్వీడన్ అగ్గిపెట్టెల డిజైన్ భిన్నంగా ఉంటుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, రష్యా, చైనా అగ్గిపెట్టెలు కొన్ని ఉన్నాయి. సమాజాన్ని మార్చేవిధంగా లోగో.. మిగతా కాలాలతో పోల్చితే 90ల కాలంలోనే కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఆ వ్యత్యాసాన్ని అధ్యయనం చేయడం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. సిండ్రెల్లా, చోటా భీమ్ చిత్రాలు కూడా ఆ లోగోల్లో ఉన్నాయి. చూడటానికి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అగ్గిపెట్టెలు ప్రధానంగా ఎరుపు, పసుపు, నారింజ రంగులను ఒక నమూనాగా ఉపయోగించారు. ఇవి అగ్నిని సూచించడమే కారణం. ఈ కళలో ప్రఖ్యాత మహిళల చిత్రాలను, సమాజం భావనను మార్చేవిధంగా, మహిళల ప్రస్తుత ఆత్మస్థైర్య చిత్రాలను మార్చాలని కోరుకుంటున్నా’’ అని వివరిస్తుంది శ్రేయ. -
ఈ పాప హాబీ ఏంటో తెలుసా?
భువనేశ్వర్ : అగ్గిపెట్టెలో పుల్లలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేయటం మనకలవాటు. అవసరం తీరిపోయిన తర్వాత వాటి గురించి ఓ క్షణం కూడా ఆలోచించము. అలా ఆలోచించి ఉంటే ఈ పాపలాగ సోషల్ మీడియా సెలెబ్రిటీ అయిపోయేవాళ్లం. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థిని దివ్యాన్షికి అగ్గిపెట్టెలను కలెక్ట్ చేయటం హాబీ. అందుకే ఏకంగా 5 వేల అగ్గిపెట్టెలను కలెక్ట్ చేసింది. నేపాల్, పోలాండ్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన అగ్గిపెట్టెలు కూడా అందులో ఉన్నాయి. దీనిపై దివ్యాన్షి తల్లి గోప మోహంటి మాట్లాడుతూ.. ‘‘ దివ్య తండ్రి చాలా దేశాలు తిరిగేవారు. అక్కడినుంచి తన స్నేహితుడికి అగ్గిపెట్టెలు తెచ్చువారు. వాటి డిజైన్ అద్భుతంగా ఉండేది. దీంతో వాటిని తన వద్దనే ఉంచుకుంటానని దివ్య తండ్రిని అడిగింది. అలా గత మూడేళ్ల నుంచి అగ్గిపెట్టెలు కలెక్ట్ చేస్తోంది. వాళ్ల నాన్న స్నేహితులు, బంధువులు తన కోసం వాటిని తెస్తుంటారు. మేము వాటిని ప్లాస్టిక్ బాక్సుల్లో భద్రంగా ఉంచుతాము’’ మని తెలిపింది. ( అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల ) తన హాబీ గురించి దివ్యాన్షి మాట్లాడుతూ.. ‘‘ మా నాన్న ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. ఆయన దేశదేశాలు తిరుగుతుంటారు. అక్కడి అగ్గిపెట్టెల్ని ఇంటికి తీసుకొస్తుంటారు. విదేశాలకు వెళ్లే బంధువులు, స్నేహితులను కూడా అగ్గిపెట్టెలు తెమ్మని అడుగుతుంటాను. వారు కూడా తెస్తుంటారు. నాకు ఖాళీ ఉన్న సమయంలో ఈ పనులన్నీ చేసేదాన్ని. వాటిని భద్రపరచటానికి అమ్మానాన్నలు సహాయపడుతున్నారు’’ అని చెప్పింది. Bhubaneswar: Dibyanshi, a class three student has collected over 5,000 matchboxes from different countries. She says,"My father is wildlife photographer & travels a lot. I also ask my relatives to bring matchboxes for me. I've organized them according to various themes." (18.12) pic.twitter.com/0Pxn0B9UjR — ANI (@ANI) December 18, 2020 -
అగ్గిపెట్టె లేకుండా బార్‌కు వస్తావా?
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని వీరంగం సృష్టించడమే కాకుండా అతడిని బెదిరించి సెల్‌ఫోన్, నగదు లాక్కెళ్లిన కేసులో ఐదుగురు నిందితులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిపై గతంలో కేసులు ఉండగా మరో ఇద్దరు విద్యార్థులు. డీసీపీ రాధాకిషన్‌రావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మోండా మార్కెట్‌కు చెందిన పగడాల మధు, సికింద్రాబాద్‌కు చెందిన పంజ కుమార్, ఎం.కృష్ణ, డి.ప్రభు మైఖేల్, మహ్మద్ జాఫర్ స్నేహితులు. వీరు మంగళవారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు కవాడిగూడలోని ఓ బార్‌కు వెళ్లారు. అదే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా అదే బార్లో మద్యం తాగుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న పంజ కుమార్ అగ్గిపెట్టె ఇవ్వాలని శ్రీనివాస్‌ను కోరాడు. అయితే తన వద్ద లేదని చెప్పగా ‘అగ్గిపెట్టె లేకుండా బార్‌కు ఎందుకు వచ్చావ్?’ అంటూ అతడితో గొడవకు దిగాడు. పోలీసుల అదుపులో నిందితులు కుమార్‌కు మిగిలిన నలుగురూ అతడికి వత్తాసు పలికారు. అనంతరం ఐదుగురూ కలిసి శ్రీనివాస్ నుంచి సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అది తిరిగి ఇవ్వాలంటే రూ.500 చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుడు డబ్బులు ఇవ్వగా దాంతో మద్యం కొనుక్కుని తాగిన వీరు సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తూ వెళ్ళిపోయారు. దీనిపై బాధితుడు గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎంఏ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌తో పాటు ఇతర ఆధారాలను బట్టి టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
అగ్గిపెట్టెల్లో ఉంచి గుట్కా విక్రయం
చెన్నై, తిరువొత్తియూరు: అగ్గిపెట్టెలలో హాన్స్, పాన్‌పరాగ్ వంటి ప్రభుత్వ నిషేధించిన మత్తు పదార్థాలను ఉంచి విక్రయిస్తున్న దుకాణం యజమానిని పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై, సెయింట్ థామస్ మౌంట్ మేట్టువీధిలో ఉన్న ఓ ప్రొవిజన్ దుకాణంలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు పోలీసు డిప్యూటీ కమిషనర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ వలర్మతి, ఎస్ఐ సెల్వమణి తదితరులతో కూడిన బృందం ఆ ప్రాంతంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో మధ్యస్థనగర్లో ఉన్న ఓ ప్రొవిజన్ దుకాణానికి యువకులు ఎక్కువమంది వచ్చి వెళుతున్నట్టు తెలిసింది. పోలీసులు ఆ దుకాణానికి వెళ్లి తనిఖీ చేశారు. దుకాణంలో పేర్చి ఉన్న అగ్గిపెట్టెలలో ప్రభుత్వం నిషేధించిన మత్తుపదార్థాలు ఉన్నట్టు తెలిసింది. వాటిలో హాన్స్, పాన్‌పరాగ్ తదితర మత్తు పదార్థాలు ఉంచి రహస్యంగా విక్రయిస్తున్నట్టు తెలిసింది. దుకాణం యజమాని అబ్బాస్ (28)ని పోలీసులు అరెస్టు చేశారు. -
అగ్గిపెట్టె తిరిగివ్వకపోతే చర్యలు తీసుకోబడును!
లక్నో : అగ్గిపెట్టె, లైటర్ ఎవరన్న తీసుకుంటే అడుగుతాం.. ఇస్తే తీసుకుంటాం లేకుంటే లైట్ తీసుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ లైట్ తీసుకోలేదు. అగ్గిపెట్టె తిరిగివ్వాలని ఏకంగా లెటరే రాశారు. అగ్గిపెట్టె తిరిగివ్వకుంటే చర్యలు తీసుకోబడునని కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇప్పడు ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొరదాబాద్ ఎలక్ట్రిసిటీ అర్భన్ డివిజన్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసే సుశీల్ కుమార్ ఆఫీసులో ఓ ఉద్యోగికి అగ్గిపెట్టె ఇచ్చారు. ఆ సదరు వ్యక్తి తిరిగివ్వకపోవడంతో ఈ నెల 1న ఓ లేఖ రాశాడు. ‘ గత జనవరి 23న మీకు ఇచ్చిన అగ్గిపెట్టె తిరిగివ్వకపోవడం’ విషయంగా పేర్కొన్నారు. ‘ఆఫీస్‌లో దోమల రిఫిలెంట్ కాయిల్స్ కాల్చేందుకు అగ్గిపెట్టె తీసుకున్నారు. అందులో సుమారు 19 పుల్లలున్నాయి. అగ్గిపెట్టె తీసుకొని వారం గడుస్తున్న మీరు తిరిగివ్వలేదు. దీంతో ఆఫీస్‌లోని ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళలో వారు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లోపు అగ్గిపెట్టెను తిరిగివ్వవలెను. ఒక వేళ ఇవ్వనిచో మీపై చర్యలు తీసుకోబడును’ అని ఆఫీస్ అధికారిక స్టాంప్‌తో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూపీ ఎస్పీ రాహుల్ శ్రీవాత్సవ్ ట్వీటర్లో పోస్ట్ చేస్తూ.. ‘అగ్గిపెట్టె తిరిగివ్వకుంటే చెప్పండి దర్యాప్తు చేస్తామని’ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే సుశీల్ కుమార్ మాత్రం ఉద్యోగంలో కొత్తగా చేరిన కంప్యూటర్ ఆపరేటర్‌కు లెటర్ ఫార్మట్ తెలియడం కోసం అలా రాసానని స్పష్టం చేశారు. సదరు కంప్యూటర్ ఆపరేటర్ సైతం ఇది వాస్తవమేనన్నాడు. తన మిత్రులు కూడా ఇదే విషయంపై పదేపదే ఫొన్ చేస్తుండగా వాట్సప్‌లో పంపించనాని అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నాడు. -
అగ్గిపెట్టెతో బాలుడి ఆట.. తగలబడిన ఇళ్లు
విజయవాడ: విజయవాడలోని సింగ్ నగర్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అఖిల్ అనే బాలుడు అగ్గిపెట్టితో ఆడుకుంటూ అగ్గిపుల్ల వెలిగించి మంచంపై వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బాలుడు ఏడుస్తూ గట్టిగా అరిచాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో బాలుడి అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వెళ్లి అతడిని రక్షించారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో బాలుడి చెవులు, చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బాలుడిని ఆసుపత్రుకి తరలించారు. -
అగ్గిపెట్టె ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
నెల్లూరు(క్రైమ్) : అగ్గిపెట్టపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఓవ్యక్తిపై కొందరు దాడిచేసి గాయపర్చారు. వివరాలు.. నెల్లూరులోని హరనాథపురం సర్వేపల్లి కాలువకట్టకు చెందిన ఆర్.సాయి ఆటో డ్రైవర్. అతను ఈనెల 26వ తేదీ రాత్రి ముత్తుకూరు బస్టాండు సమీపంలోని బ్రాందీషాప్ వద్ద తన అల్లుడు కోదండపాణితో కలిసి ఉండగా అదేప్రాంతానికి చెందిన నాగరాజు అతని స్నేహితులు అక్కడకి వచ్చారు. మద్యం మత్తులో అగ్గిపెట్టె కావాలని సాయిని అడిగారు. తనవద్ద అతను లేదని చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు గొడవపడ్డారు. రాడ్ తీసుకొని సాయిపై దాడిచేసి గాయపర్చారు. బాధితుడు మంగళవారం నాలుగో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
'ఇప్పటికీ విమానాల్లో అగ్గిపెట్టె తీసుకెళ్తున్నా'
విమానాల్లో అగ్గిపెట్టెలు, సిగరెట్ల లాంటివాటిని అనుమతించరు గానీ, తాను ఇప్పటికీ అగ్గిపెట్టెలను తీసుకెళ్తూనే ఉన్నానని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. విమానాల ఆలస్యం గురించి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఆయనీ విషయం తెలిపారు. ''నేను సిగరెట్లు కాలుస్తా. విమానశ్రయాల్లో నన్ను తనిఖీ చేయడం మానేయగానే అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్తున్నా'' అన్నారు. అయితే ప్యారిస్ విమానాశ్రయంలో మాత్రం తనిఖీలు గట్టిగా ఉంటాయని, వాళ్లు తన జేబులు చూసిన తర్వాత అగ్గిపెట్టె, సిగరెట్లు, పోర్టబుల్ యాష్ ట్రే అన్నింటినీ తీసేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. తన అగ్గిపెట్టెతో సహా అన్నింటినీ వాళ్లు తనకు తిరిగి ఇచ్చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పోర్టబుల్ యాష్ ట్రేను తీసి చూపించారు. కొన్ని దేశాల్లో అగ్గిపెట్టెలను విమానాల్లో నిషేధిత వస్తువుగా ప్రకటించారని, కొన్ని దేశాల్లో మాత్రం అలా లేదని అన్నారు. భద్రత అనేది అర్థవంతంగా ఉండాలి తప్ప అర్థరహితంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ అగ్గిపెట్టెలు తీసుకెళ్లే హక్కు కల్పించాలంటారా అని విలేకరులు ప్రశ్నించగా, పొగ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు తనకు తెలుసని, అందువల్ల భారతీయులు పొగతాగకూడదనే తాను చెబుతానని మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు.