విజయ్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తానని ఐటీ, చేనేతశాఖ మంత్రి తారకరామారావు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ ఆ చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని, ఇంత అద్భుతమైన చీర నేసినందుకు విజయ్‌ను సబిత అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్ల చేనేత రంగంలో ఇప్పటికే అనేక మార్పులొచ్చాయని, సిరిసిల్ల నేతన్నలు ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు వెళ్తున్నారని విజయ్ మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం తాను నేసిన చీర మూడు రోజులు మరమగ్గాలపై నేసే అవకాశముంటుందని, అదే చీర చేతితో నేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని వివరించారు. ఈ మేరకు త్వరలో తాను ప్రారంభించబోయే యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని కేటీఆర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment