జాలీగా శారీ రన్‌.. | Pinkthan With Saree Run in Hyderabad | Sakshi
Sakshi News home page

జాలీగా శారీ రన్‌..

Published Mon, Jan 13 2020 8:54 AM | Last Updated on Mon, Jan 13 2020 8:54 AM

Pinkthan With Saree Run in Hyderabad - Sakshi

ఖైరతాబాద్‌: తెలుగుదనం ఉట్టిపడింది. మహిళలు, పిల్లల సంప్రదాయ చీరకట్టు ఆకట్టుకుంది. వందలాది మందితో నెక్లెస్‌ రోడ్డు కళకళలాడింది. పింకథాన్‌ మూడో ఎడిషన్‌ శారీ రన్‌ ఆద్యంతం అలరించింది. ఆదివారం తనైరా, పింకథాన్‌ మూడో ఎడిషన్‌లో భాగంగా జలవిహార్‌ నుంచి సంజీవయ్య పార్క్‌ మీదుగా తిరిగి జలవిహార్‌ వరకు నగరంలో తొలిసారిగా శారీ రన్‌ నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి సుమారు 3 వందల మంది మహిళలు చీరలు ధరించి రన్‌లో పాల్గొన్నారు.

మహిళల ఫిట్‌నెస్‌కు మద్దతు తెలుపుతూ నిర్వహించిన రన్‌ను నటుడు, మోడల్‌ అల్ట్రామ్యాన్‌ మిలింద్‌ సోమన్‌ జెండా ఊపి ప్రారంభించారు. డోంట్‌ హోల్డ్‌ బ్యాక్‌  అనే నినాదంతో నిర్వహించిన శారీ రన్‌లో భాగంగా జుంబా సెషన్, కర్రసాము, వ్యాయామంతో మహిళలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మిలింద్‌ సోమన్‌ మాట్లాడుతూ.. మహిళల్లో ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా శారీ రన్‌ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి భారతీయ మహిళకూ చీరతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పింకథాన్‌ వంటి కార్యక్రమాలతో దేశంలో మహిళా సమాజాన్ని శక్తిమంతంగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారతతోనే ఆరోగ్యకర కుటుంబం, సమాజం, దేశంగా మారుతాయన్నారు.  చీరకట్టుతో ఎంతో ఉత్సాహంగా శారీ రన్‌లో పాల్గొనడం ఆనందం కలిగించిందని మహిళలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement