సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి..
కొనుగోలుదారుల్లా వచ్చి..
మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్‌లేని స్కారి్పయో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్‌లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు.
వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్‌ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కారి్పయో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కారి్మకుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు.
మొదటిసారి దొంగతనం చేశామని..
వైరల్‌గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్‌లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది.
వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్‌కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment