Handloom weaver
-
చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్.. పక్కాగా లబ్ధి.. బోగస్‌కు చెక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ.. కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, జౌళిశాఖ అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆధునిక సాంకేతికత సహకారంతో ఆన్లైన్లో భద్రపరుస్తున్నారు. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, లూమ్ ఫొటోలతో మగ్గం ఉన్న చోటి నుంచే అక్షాంశ, రేఖాంశాలతో సహా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. చేనేత మగ్గాలతోపాటు, కండెలు చుట్టే కార్మికుల వివరాలు, ఆ మగ్గాలపై పని చేసే ఇతర అనుబంధ రంగాల కార్మికుల సమాచారాన్ని సైతం క్రోడీకరించి పొందుపరుస్తున్నారు. పక్కాగా లబ్ధి..బోగస్‌కు చెక్ చేనేత మగ్గాలను ఆన్లైన్ చేయడం ద్వారా కార్మికులు, మగ్గాల సమాచారం పక్కాగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకం కింద 40 శాతం యార్న్ (నూలు) సబ్సిడీ అందిస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో ఈ సబ్సిడీ నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండానే అసలైన లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది. నేతన్నలకు చేయూత పథకం (త్రిఫ్ట్)లో చేనేత కార్మికులు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ప్రతి నెలా రూ.1,200 పొదుపు చేస్తే.. అంతే మొత్తం అంటే మరో రూ.1,200 ప్రభుత్వం అందిస్తుంది. ఆ సొమ్ము చేనేత కార్మికుల ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పొదుపు చేసుకున్న సొమ్ము, దానిపై వడ్డీ కలిపి 36 నెలల తర్వాత కార్మికులు తీసుకోవచ్చు. త్రిఫ్ట్ సొమ్మును నెలనెలా నేరుగా కార్మికుల వేతనాల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా లబి్ధదారుల దరికి చేర్చవచ్చు. మరోవైపు బోగస్ చేనేత సహకార సంఘాలు, బోగస్ సభ్యుల బెడద పూర్తిగా తొలగిపోతుంది. నిజంగా శ్రమించే కార్మికులు, కండిషన్లో ఉన్న మగ్గాల డేటా ఆన్లైన్లో ఉంటుంది. తగ్గిపోయిన చేనేత మగ్గాలు.. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మరమగ్గాలు ఉన్నాయి. గతంలో ఇవి కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 36,088 మరమగ్గాలు ఉండగా, చేనేత మగ్గాలు 17,573 మాత్రమే ఉన్నాయి. కాగా మరమగ్గాలకు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26,494 మరమగ్గాలు ఉన్నాయి. చేనేత మగ్గాలు మాత్రం165 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జౌళిశాఖ చేపట్టిన ఆన్లైన్ నమోదు పూర్తి అయితే.. సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఫోన్ సిగ్నల్, నెట్వర్క్ సరిగా లేక సమాచారాన్ని నమోదు చేయడం కష్టమవుతోంది. వివరాలు రాసుకున్నారు.. మాది సిరిసిల్ల గణేశ్‌నగర్. కిరాయి ఇంట్లో ఉంటాను. చిన్నప్పటి నుంచి గిదే పని చేస్తున్న. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. ఆమెకు పెన్షన్ వస్తుంది. రోజుకు ఐదు మీటర్ల బట్ట నేస్తా. మీటరుకు రూ.28.50 ఇస్తారు. రోజంతా పని చేస్తే రూ.140 వరకు వస్తాయి. మొన్ననే నా వివరాలు రాసుకుని, ఫొటోలు తీసుకున్నారు. – రాపెల్లి హన్మాండ్లు(89), చేనేత కార్మికుడు, సిరిసిల్ల క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నాం క్షేత్రస్థాయిలో చేనేత మగ్గాల, కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. చేనేత మగ్గాలున్న ప్రతి పల్లెకు వెళ్లి సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇది పూర్తి అయితే సంక్షేమ పథకాలు నేరుగా అందించే వీలుంది. –ఎం.సాగర్, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల చదవండి: నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి -
అగ్గిపెట్టె చీర అద్భుతం
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తానని ఐటీ, చేనేతశాఖ మంత్రి తారకరామారావు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ ఆ చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని, ఇంత అద్భుతమైన చీర నేసినందుకు విజయ్ను సబిత అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్ల చేనేత రంగంలో ఇప్పటికే అనేక మార్పులొచ్చాయని, సిరిసిల్ల నేతన్నలు ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు వెళ్తున్నారని విజయ్ మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం తాను నేసిన చీర మూడు రోజులు మరమగ్గాలపై నేసే అవకాశముంటుందని, అదే చీర చేతితో నేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని వివరించారు. ఈ మేరకు త్వరలో తాను ప్రారంభించబోయే యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని కేటీఆర్‌ను కోరారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
సాక్షి, సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు చెందిన వద్నల సత్తయ్య(55) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో పాటు.. మరింత కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపేయడంతో.. మనస్తాపానికి గురైన సత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేత కార్మికుడు ఆత్మహత్య..
మదనపల్లె: అనారోగ్యంతో అప్పులపాలైన ఓ చేనేత కార్మికుడు ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(39) కూలి మగ్గాలు నేసుకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక, మగ్గం నేయలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో రూ.లక్షకు పైగా అప్పులు చేశాడు. భార్య కూలి పని చేస్తే కానీ ఇల్లు గడవని దుస్తితి నెలకొంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన సుబ్రమణ్యం భార్య, పిల్లలు నిద్రించిన సమయంలో ఇంటిపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల టౌన్: అప్పులు తీర్చే దారిలేదని మనస్తాపం చెందిన ఓ డైయింగ్ కార్మికుడు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఇందిరానగర్‌కు చెందిన గడ్డం వేణు(39) డైయింగ్ కార్మికుడు. భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు వైద్యం చేయించేందుకు కొంత అప్పు చేశాడు. అంతకు ముందు తన సోదరి వివాహం కోసం మరికొంత అప్పు చేయగా, మొత్తం అప్పు రూ.3 లక్షలకు చేరింది. కుల సంఘంలో రూ.80 వేలు, ఇతరుల వద్ద చేసిన అప్పు ఎలా చెల్లించాలనే మనస్తాపంతో కొద్దిరోజులుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో డైయింగ్ పరిశ్రమలో వినియోగించే నైట్రాఫ్ అనే రసాయనాన్ని శనివారం రాత్రి తాగాడు. ఆదివారం ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. డాక్టర్‌ను పిలిపించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. -
చేనేత కార్మికురాలి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన చేనేత కార్మికురాలు యర్రజోడు గోవిందమ్మ(37) అప్పులబాధతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు కలిసి మగ్గాలు నేస్తుండేవారు. గోవిందమ్మకు అనారోగ్యంతో పాటు కుటుంబ పోషణ కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని తీర్చలేమన్న బెంగతో ఆమె రోజూ మనోవేదనకు గురయ్యేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పు దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. -
చిత్తూరు జిల్లాలో నేతన్నఆత్మహత్య
మదనపల్లె: అప్పుల బాధ తాళలేక నేతన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొల్లబైలు పంచాయతి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండి వెంకటరమణ(28) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నేతన్న ఆత్మహత్య
సిరిసిల్ల (కరీంనగర్) : తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అప్పులు తీర్చే దారి కానరాక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని గణేష్ నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన పోశెట్టి(55) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. -
చేనేత కార్మికుని ఆత్మహత్య
సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు స్వర్గం మహేశ్(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన మహేశ్ పాలిస్టర్ మగ్గాలను నడిపించేవాడు. ఇటీవలే రూ. రెండు లక్షలు అప్పు చేసి ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. పిల్లలు సాగర్, స్వాతి, శిరీష, హేమంత్ ఉన్నారు. కూతురు స్వాతి ఇంటర్‌తో చదువు ఆపివేసి బీడీలు చేస్తోంది. మహేశ్ ఎంత పని చేసినా పూట గడవడానికే సరిపోతుండడంతో అప్పు తీరే మార్గం కనిపించక వేకువ జామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌లో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. రామ్‌నగర్‌కు చెందిన ఉస్మాన్‌బాషా(48) చేనేత కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా అతనికి రూ.1.5 లక్షల వరకు అప్పు ఉన్నట్లు సమాచారం. అయితే శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఉస్మాన్ వీరి ఇంటికి సమీపంలో ఉన్న స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులబాధతో నేతన్న ఆత్మహత్య
సిరిసిల్ల(కరీంనగర్) : అప్పుల బాధలకు తోడు కుటుంబ కలహాలు ఎక్కువవడంతో మనస్తాపం చెందిన నేతన్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని బీవై నగర్‌కు చెందిన వెంగళరాజు(35) సాంచా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సాంచా కార్మికులకు సరైన పనిలేకపోవడంతో అప్పులు ఎక్కవయ్యాయి. దీనికి తోడు భార్యతో మనస్పర్థలు రావడంతో నెల రోజుల కిందటే భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన వెంగళరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
అనంతపురం (ధర్మవరం): అనంతపురం జిల్లా ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీలో చేనేత కార్మికుడు రామాంజనేయులు(28) శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాంజనేయులు ఇంట్లోనే మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి భార్య భాను, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అప్పులబాధ ఎక్కువ కావడంతోపాటు కుటుంబంలో చిన్నపాటి సమస్యలతో మనస్తాపం చెందిన రామాంజనేయులు ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు బలవన్మరణం
సిరిసిల్ల రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్‌నగర్‌కు చెందిన నామా భూమేశ్(35) చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా 15 రోజులుగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న బంద్‌తో ఉపాధి కరువైంది. దాంతో ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్యంతో మనస్తాపానికి గురైన అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
సిరిసిల్లలో చేనేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల : అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని సాయినగర్‌లో అద్దెకు ఉంటున్న కట్టెకోల రాజేశం(55) శాంతినగర్‌లో డైయింగ్ యూనిట్‌ను అద్దెకు తీసుకొని బట్టలకు రంగులు అద్దుతూ ఉపాధి పొందుతున్నాడు. అయితే ఇటీవల కూలి పెంచాలని సిరిసిల్లలో డైయింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాగా రాజేశంకు వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో పాటు కార్మికుల సమ్మె కారణంగా డైయింగ్ పరిశ్రమ నడవకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన రాజేశం సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గురువారం శవమై కనిపించాడు. అద్దకంలో వాడే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య రజిత, కొడుకులు శ్రీకాంత్, ప్రవీణ్, కూతురు లావణ్య ఉన్నారు. -
అప్పులబాధతో చేనేత కార్మికుని ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని భద్రంపల్లి గ్రామంలో అప్పులభాధతో శనివారం ఓ చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన రమేష్(26) అనే వ్యక్తి ధర్మవరంలో చేనేత కార్మికుడిగా కూలి పనులు చేసుకుంటూ భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. చీరలు నేస్తే 2 వేలు కూలీ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణకు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక కుటుంబ పోషణ భారమవడంతో మనస్తాపం చెందిన రమేష్ శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్ఐ జనార్దన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేత కార్మికుడి బలవన్మరణం
అనంతపురం: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మవరం పట్టణంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని నేసేపేటలో పెద్దకోట్ల దామోదర్(52) నివాసం ఉంటున్నాడు. దామోదర్ చేనేత కార్మికుడిగా జరీ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. సుమారు రూ.4లక్షల వరకు అప్పులున్నాయి. రుణ దాతల ఒత్తిడితో తీవ్ర మానసిక వేదనకు గురైన దామోదర్ ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. దామోదర్‌కు భార్య శ్రీదేవి.. బీటెక్ చదువుతున్న లక్ష్మి, ఇంటర్ చదువుతున్న సుష్మా, చందన అనే కుమార్తెలు ఉన్నారు. -
ఇద్దరు నేత కార్మికుల బలవన్మరణం
సిరిసిల్ల/ధర్మవరం న్యూస్‌లైన్: అప్పుల బాధలు భరించలేక వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమకు ఉపాధినిచ్చే మగ్గాలకే ఉరివేసుకొని వారు తనువు చాలించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు రంజిత్‌కుమార్ (23) కుటుంబ పరిస్థితి బాగాలేక తండ్రితో పాటు ఇంట్లోనే ఉన్న నాలుగు మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేసేవాడు. తండ్రీకొడుకులు ఒకరు పగలు, మరొకరు రాత్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లి సుజాత బీడీ కార్మికురాలు. ఇటీవల ముడిసరుకుల ధరలు పెరిగాయని, వస్త్రానికి గిట్టుబాటు ధర లభించడం లేదని వస్త్రవ్యాపారులు వస్త్రోత్పత్తిదారుల (ఆసాముల)కు ముడిసరుకులైన బీములు, కోములు ఇవ్వడం లేదు. దీంతో పది రోజులుగా సుమారు 14 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో రజింత్కుమార్కు సైతం పనిలేకుండా పోయింది. సాంచాల ఏర్పాటుకు రూ. 3లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చేదారిలేక మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అలాగే, అనంతపురం జిల్లా ధర్మవరంలోని స్థానిక లక్ష్మినగర్‌కు చెందిన చింతా శ్రీనివాసులు(45) రూ. 2 లక్షలు అప్పు చేసి రెండు మగ్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. కొంత కాలంగా చేనేత చీరలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దీంతో రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మగ్గానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
సిరిసిల్లలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
కరీంనగర్ : ఆర్థిక ఇబ్బందులు మరో నేతన్న ఉసురు తీశాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవటంతో కుటుంబ పోషణ భారమై సిరిసిల్లలోని నెహ్రూ నగర్‌కు చెందిన చక్రధర్ ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు.