సిరిసిల్ల టౌన్: అప్పులు తీర్చే దారిలేదని మనస్తాపం చెందిన ఓ డైయింగ్ కార్మికుడు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఇందిరానగర్‌కు చెందిన గడ్డం వేణు(39) డైయింగ్ కార్మికుడు. భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు వైద్యం చేయించేందుకు కొంత అప్పు చేశాడు. అంతకు ముందు తన సోదరి వివాహం కోసం మరికొంత అప్పు చేయగా, మొత్తం అప్పు రూ.3 లక్షలకు చేరింది.
కుల సంఘంలో రూ.80 వేలు, ఇతరుల వద్ద చేసిన అప్పు ఎలా చెల్లించాలనే మనస్తాపంతో కొద్దిరోజులుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో డైయింగ్ పరిశ్రమలో వినియోగించే నైట్రాఫ్ అనే రసాయనాన్ని శనివారం రాత్రి తాగాడు. ఆదివారం ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. డాక్టర్‌ను పిలిపించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది.