పెనుబల్లి/గచ్చిబౌలి/మల్లాపూర్/ఎడపల్లి (బోధన్)/ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): భర్తల వేధింపులు.. ఆర్థిక ఇబ్బందులు.. కారణం ఏదైతేనేం.. క్షణికావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఇద్దరు తల్లులు, ఓ కుమార్తె కన్నుమూయగా పిల్లలతో కలసి చెరువులో దూకిన మరో ఇద్దరు తల్లులను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడి ఆచూకీ గల్లంతైంది. మరో ఘటనలో అనారోగ్యం కారణంగా కుమార్తెతో కలసి భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో...
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మణికొండలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో నివసించే బుడ్డోలు సదానందానికి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన అలివేలుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు లాస్య (14), కుమారుడు మణికంఠ (11) ఉన్నారు.
సదానందం ఖాళీగా ఉంటుండగా కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు వచ్చే ఇంటి అద్దెలు కాస్తా బందువులతో ఏర్పడిన వివాదాలతో నిలిచిపోయాయి. దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. డబ్బులేక పిల్లలను చదువు కూడా మాన్పి0చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
సమస్యల నుంచి బయటపడేయాల్సిందిగా దేవుడిని ప్రార్థించి రావాలంటూ భర్తను యాదగిరిగుట్టకు పంపింది. అనంతరం అర్ధరాత్రి వేళ ఓ బెడ్రూంలో తొలుత కుమార్తెకు ఉరేసి, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక వంటింట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున లేచిన కుమారుడు తల్లి, అక్కను విగతజీవులుగా చూసి వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలిపాడు.
చేతిపై గోరింటాకు..!
ఆత్మహత్మకు ముందు అలివేలు, లాస్య గోరింటాకు పెట్టుకున్నారు. లాస్య చేతిపై గోరింటాకు కోన్‌తో ‘డూ సమ్‌థింగ్ దట్ మేక్ యూ హ్యాపీ’అని రాసుకుంది. అదేవిదంగా తల్లీ, కూతురు ఇద్దరూ ‘ది గేమ్ ఈజ్ స్టార్టెడ్’అని గోరింటాకుతో రాసిన వ్యాఖ్యలు ఉండటంతో పోలీసులు ఇవి ఎందుకు రాసుకున్నారో...? అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు.
కాగా, అలివేలు, లాస్య ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో మరో ఉరితాడు వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కుమారుడికి కూడా ఉరివేయాలని తల్లి భావించి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.కానీ కుమారుడు బెడ్‌రూమ్‌లో నిద్ర పోతుండడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకొని ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అలివేలు ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్, బట్టలను ఇంట్లోనే తగలబెట్టింది. తల్లీకుమార్తెల మానసిక స్థితి సరిగ్గా లేదని.. కరోనా కాలం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు.
లైవ్‌లో ఆత్మహత్య...
భర్త వేధింపులు తట్టుకోలేక.. ఫేస్‌బుక్ లైవ్ వీడియో పెట్టి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారానికి చెందిన సనా (29) రాజస్తాన్‌కు చెందిన హేమంత్ పటియాల (డిజె మ్యూజిక్ అపరేటర్) 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వారి వైవాహిక జీవితం బాగానే కొనసాగింది. బాబు పుట్టాక వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
సనాను భర్త హేమంత్‌తోపాటు వారి అత్తమామలు వేధించసాగారు. దీంతో గతంలో పలుమార్లు పోలీసులకు హేమంత్‌పై సనా ఫిర్యాదు చేశారు. సైప్రస్ దేశానికి వెళ్లిన హేమంత్ గత 5 నెలలుగా సనాను ఫోన్‌లో వేధిస్తూనే ఉన్నాడు. దీంతో మంగళవారం నాచారంలోని ఇంట్లో సనా ఫేస్‌బుక్ లైవ్ పెట్టి ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. సనాకు 3 ఏళ్ల బాబు ఉన్నాడు.
పిల్లలతో సహా చెరువులో దూకిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో సహా అక్కాచెల్లెళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా అందులో బాలుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అశోక్ సాగర్ (జానకంపేట చెరువు) వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లక్షి్మ, మోహన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మోహన్‌కు కొత్త కలెక్టరేట్ సమీపంలో 2 వేల గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత భాగాన్ని పెద్ద కూతురుకు అమ్మి రెండో కూతురు అక్షయ, మూడో కూతురు నిఖితలకు వివాహం చేశాడు.
అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. వివాహ సమయంలో చెరో 200 గజాల స్థలాన్ని వారికి కానుకగా ఇచ్చారు. కొంతకాలంగా హేమంత్, మహే‹Ùలు ఇంటి స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని భార్యలను వేధిస్తున్నారు. అయితే ఈ ప్లాట్లకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని తెలిసింది. అక్షయ, నిఖితలపై వేధింపులు ఎక్కువ కావడంతో వారిద్దరూ మూడు రోజుల క్రితం పిల్లలతో కలసి పుట్టింటికి వచ్చారు.
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గురువారం ఉదయం నిఖిత తన పిల్లలైన భవశ్రీ, శ్రీమాన్, అక్షయ తన కుమారుడైన చిన్నా (3) అలియాస్ భువనేశ్వర్‌ను తీసుకొని ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పిల్లలను నీటిలోకి తోసి తర్వాత నిఖిత, అక్షయ కూడా దూకారు. ఆ సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న షేక్ హైదర్ అనే వ్యక్తి చెరువులోకి దూకి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్‌లను రక్షించాడు. మూడేళ్ల చిన్నా ఆచూకీ లభించలేదు.
కేన్సర్ నుంచి భార్య కోలుకోదేమోనని..
భార్యకు కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో భర్త తల్లడిల్లాడు. భార్యకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని.. తామిద్దరం లేకపోతే కూతురు భవిష్యత్తు ఏమిటనే భయంతో కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40)కు భార్య సుహాసిని (35), కుమార్తె అమృత (16)తోపాటు కుమారుడు కార్తీక్ ఉన్నారు.
కార్తీక్‌కు బీటెక్ సెకండియర్ పూర్తికాగానే బెంగళూరులోని హెచ్‌సీఎల్‌లో ట్రెయినీగా ఉద్యోగం రాగా అమృత ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ చదివేందుకు సిద్ధమవుతోంది. నెలన్నర క్రితం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుహాసినికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు గర్భసంచిలోని కణతిని తొలగించారు. ఈ క్రమంలో శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపగా అది కేన్సర్‌గా తేలింది. దీంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స కోసం వెళ్తామని కుమారుడు, బంధువులకు చెప్పారు. దీంతో కుమారుడు బెంగళూరు నుంచి గురువారం ఉదయం ఇంటికి రాగా, గుంటూరులో ఉంటున్న వెంకటకృష్ణారావు తమ్ముడు కూడా కొత్తకారాయిగూడెం వచ్చాడు.
అనంతరం గురువారం సాయంత్రం వెంకటకృష్ణారావు, సుహాసిని దంపతులు కుమార్తె అమృతతో కలసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెబుతూ తిరువూరు బయలుదేరారు. కానీ మధ్యలోనే మూడు ప్లాస్టిక్ స్టూళ్లు, నైలాన్ తాడు, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కొనుక్కొని స్వగ్రామంలో పొలం పక్కనే ఉన్న మామిడి తోటకు రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన గ్రామ స్తులు ఆరా తీయగా గేదెలను వెతకడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment