భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య | Head Constable killed his wife and children and committed suicide | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య

Published Fri, Oct 6 2023 5:11 AM | Last Updated on Fri, Oct 6 2023 5:11 AM

Head Constable killed his wife and children and committed suicide - Sakshi

కడప అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా కడపలో హెడ్‌ కానిస్టేబుల్‌ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ టి.వెంకటేశ్వర్‌ (51) (హెచ్‌సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్‌ 1993లో కానిస్టేబుల్‌గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్‌ చదువుతున్నారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్‌రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్‌రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు.

ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ కం అగ్రిమెంట్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్‌ బెనిఫిట్స్‌ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్‌లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్‌.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్‌ హాసం, ఎస్‌బీ సీఐలు అశోక్‌రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్‌.బి.అంజాద్‌బాషా, కడప మేయర్‌ కె.సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ నాయకుడు అప్జల్‌ఖాన్, పులి సునీల్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు.

మృతదేహాలను కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్య­లు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్‌కుమార్‌ కడప వచ్చి స్టేషన్‌లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement