సిరిసిల్ల/ధర్మవరం న్యూస్‌లైన్: అప్పుల బాధలు భరించలేక వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమకు ఉపాధినిచ్చే మగ్గాలకే ఉరివేసుకొని వారు తనువు చాలించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు రంజిత్‌కుమార్ (23) కుటుంబ పరిస్థితి బాగాలేక తండ్రితో పాటు ఇంట్లోనే ఉన్న నాలుగు మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేసేవాడు. తండ్రీకొడుకులు ఒకరు పగలు, మరొకరు రాత్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లి సుజాత బీడీ కార్మికురాలు.
ఇటీవల ముడిసరుకుల ధరలు పెరిగాయని, వస్త్రానికి గిట్టుబాటు ధర లభించడం లేదని వస్త్రవ్యాపారులు వస్త్రోత్పత్తిదారుల (ఆసాముల)కు ముడిసరుకులైన బీములు, కోములు ఇవ్వడం లేదు. దీంతో పది రోజులుగా సుమారు 14 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో రజింత్‌కుమార్‌కు సైతం పనిలేకుండా పోయింది. సాంచాల ఏర్పాటుకు రూ. 3లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చేదారిలేక మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అలాగే, అనంతపురం జిల్లా ధర్మవరంలోని స్థానిక లక్ష్మినగర్‌కు చెందిన చింతా శ్రీనివాసులు(45) రూ. 2 లక్షలు అప్పు చేసి రెండు మగ్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. కొంత కాలంగా చేనేత చీరలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దీంతో రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మగ్గానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇద్దరు నేత కార్మికుల బలవన్మరణం
Published Fri, Aug 9 2013 2:57 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement