కూల్ కావాలంటే పర్స్ ఖాళీనే
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం తొలి రోజుల్లోనే ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగ ఉత్పత్తుల రేట్లు.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ముడి వస్తువుల వ్యయాలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయిస్తున్నాయి. ఈ నెలాఖరులో లేదా మార్చి ఆఖరు నాటికి ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తుల రేట్లు 5–10 శాతం మేర పెంచబోతున్నాయి.
పానసోనిక్, ఎల్జీ, హయర్ వంటి సంస్థలు ఇప్పటికే పెంచగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైనవి ఈ త్రైమాసికం ఆఖరు నాటికి నిర్ణయం తీసుకోనున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) నివేదిక ప్రకారం జనవరి–మార్చి వ్యవధిలో ధరలు 5–7 శాతం మేర పెరగనున్నాయి. ‘కమోడిటీల ధరలు, అంతర్జాతీయంగా రవాణా, ముడి వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోవడంతో ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల రేట్లను 3–5 శాతం పెంచేందుకు మేము చర్యలు తీసుకున్నాం‘ అని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు.
ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. ‘ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. దేశీ గృహోపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్ పరిశ్రమ పరిమాణం రూ. 75,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా.
పండుగ సీజన్లో వాయిదా..
పండుగల సీజన్ కావడంతో రేట్ల పెంపును కంపెనీలు వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘అయితే, ప్రస్తుతం భారాన్ని కస్టమర్లకు బదలాయించడం తప్ప తయారీ సంస్థలకు వేరే మార్గం లేకుండా పోయింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ధరల పెంపు 5–7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్లు పెంచేయగా మరికొన్ని దానికి సంబంధించిన ప్రక్రియలో ఉన్నందున పెంపు పరిమాణం వివిధ రకాలుగా ఉండొచ్చని బ్రగాంజా చెప్పారు.
అయితే, డిమాండ్ మందగించినా, ముడి వస్తువుల ధరలు తగ్గినా .. ఏప్రిల్ లేదా మే లో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సోనీ ఇండియా, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు రేట్ల పెంపుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్ల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (దైవా, షింకో తదితర బ్రాండ్స్ తయారీ సంస్థ) తెలిపింది.
తప్పని పరిస్థితి..
ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదని జాన్సన్ కంట్రోల్స్–హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. ముడివస్తువులు, పన్నులు, రవాణా వ్యయాలు మొదలైనవి పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ నాటికి బ్రాండ్లు దాదాపు 10% వరకూ ధరలు పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఏప్రిల్ వరకూ దశలవారీగా ధరల పెంపు కనీసం 8–10% మేర ఉండవచ్చు. గతేడాది కూడా ఇదే విధంగా 6–7% వరకూ పెరిగాయి. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, అల్యూమినియం .. రిఫ్రిజిరెంట్స్ వంటివాటిపై యాంటీ డంపింగ్ సుంకాల విధింపుతో రేట్లు మరో 2–3 శాతం పెరగవచ్చు‘ అని సింగ్ వివరించారు.