వివరాలు నమోదు చేస్తున్న అధికారిణి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ.. కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, జౌళిశాఖ అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆధునిక సాంకేతికత సహకారంతో ఆన్‌లైన్‌లో భద్రపరుస్తున్నారు. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, లూమ్ ఫొటోలతో మగ్గం ఉన్న చోటి నుంచే అక్షాంశ, రేఖాంశాలతో సహా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. చేనేత మగ్గాలతోపాటు, కండెలు చుట్టే కార్మికుల వివరాలు, ఆ మగ్గాలపై పని చేసే ఇతర అనుబంధ రంగాల కార్మికుల సమాచారాన్ని సైతం క్రోడీకరించి పొందుపరుస్తున్నారు.
పక్కాగా లబ్ధి..బోగస్‌కు చెక్
చేనేత మగ్గాలను ఆన్‌లైన్ చేయడం ద్వారా కార్మికులు, మగ్గాల సమాచారం పక్కాగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకం కింద 40 శాతం యార్న్ (నూలు) సబ్సిడీ అందిస్తున్నారు. ఆన్‌లైన్ ప్రక్రియతో ఈ సబ్సిడీ నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండానే అసలైన లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది. నేతన్నలకు చేయూత పథకం (త్రిఫ్ట్)లో చేనేత కార్మికులు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ప్రతి నెలా రూ.1,200 పొదుపు చేస్తే.. అంతే మొత్తం అంటే మరో రూ.1,200 ప్రభుత్వం అందిస్తుంది.
ఆ సొమ్ము చేనేత కార్మికుల ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పొదుపు చేసుకున్న సొమ్ము, దానిపై వడ్డీ కలిపి 36 నెలల తర్వాత కార్మికులు తీసుకోవచ్చు. త్రిఫ్ట్ సొమ్మును నెలనెలా నేరుగా కార్మికుల వేతనాల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా లబి్ధదారుల దరికి చేర్చవచ్చు. మరోవైపు బోగస్ చేనేత సహకార సంఘాలు, బోగస్ సభ్యుల బెడద పూర్తిగా తొలగిపోతుంది. నిజంగా శ్రమించే కార్మికులు, కండిషన్‌లో ఉన్న మగ్గాల డేటా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
తగ్గిపోయిన చేనేత మగ్గాలు..
రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మరమగ్గాలు ఉన్నాయి. గతంలో ఇవి కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 36,088 మరమగ్గాలు ఉండగా, చేనేత మగ్గాలు 17,573 మాత్రమే ఉన్నాయి. కాగా మరమగ్గాలకు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26,494 మరమగ్గాలు ఉన్నాయి. చేనేత మగ్గాలు మాత్రం165 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జౌళిశాఖ చేపట్టిన ఆన్‌లైన్ నమోదు పూర్తి అయితే.. సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఫోన్ సిగ్నల్, నెట్‌వర్క్ సరిగా లేక సమాచారాన్ని నమోదు చేయడం కష్టమవుతోంది.
వివరాలు రాసుకున్నారు..
మాది సిరిసిల్ల గణేశ్‌నగర్. కిరాయి ఇంట్లో ఉంటాను. చిన్నప్పటి నుంచి గిదే పని చేస్తున్న. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. ఆమెకు పెన్షన్ వస్తుంది. రోజుకు ఐదు మీటర్ల బట్ట నేస్తా. మీటరుకు రూ.28.50 ఇస్తారు. రోజంతా పని చేస్తే రూ.140 వరకు వస్తాయి. మొన్ననే నా వివరాలు రాసుకుని, ఫొటోలు తీసుకున్నారు.
– రాపెల్లి హన్మాండ్లు(89), చేనేత కార్మికుడు, సిరిసిల్ల
క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నాం
క్షేత్రస్థాయిలో చేనేత మగ్గాల, కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. చేనేత మగ్గాలున్న ప్రతి పల్లెకు వెళ్లి సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇది పూర్తి అయితే సంక్షేమ పథకాలు నేరుగా అందించే వీలుంది.
–ఎం.సాగర్, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల
చదవండి: నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి
Comments
Please login to add a commentAdd a comment