సిరిసిల్ల : అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని సాయినగర్‌లో అద్దెకు ఉంటున్న కట్టెకోల రాజేశం(55) శాంతినగర్‌లో డైయింగ్ యూనిట్‌ను అద్దెకు తీసుకొని బట్టలకు రంగులు అద్దుతూ ఉపాధి పొందుతున్నాడు. అయితే ఇటీవల కూలి పెంచాలని సిరిసిల్లలో డైయింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాగా రాజేశంకు వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో పాటు కార్మికుల సమ్మె కారణంగా డైయింగ్ పరిశ్రమ నడవకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన రాజేశం సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గురువారం శవమై కనిపించాడు. అద్దకంలో వాడే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య రజిత, కొడుకులు శ్రీకాంత్, ప్రవీణ్, కూతురు లావణ్య ఉన్నారు.