ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన జమున
సాక్షి, మంచిర్యాల క్రైం: పైసా పైసా కూడబెట్టి, బ్యాంకులో అప్పు చేసి కలల గూడు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు వరద నీరు ఇంటిని ముంచెత్తింది. ముంపు నష్టాన్ని తట్టుకోలేక మహిళ ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాలలో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన సిద్ది వీరయ్య, జమున(55) దంపతులు మంచిర్యాల మార్కెట్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు సురేష్ రబ్బర్ స్టాంపులు తయారు చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు.
మిగతా ఇద్దరు కుమారులు నవీన్, జగదీష్ మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ లోనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. సొంతిల్లు లేకపోవడంతో ఏడాది కిందట ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు బ్యాంకులో రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. ఇంటికి ఇంకా చిన్నచిన్న పనులు చేయించాల్సి ఉన్నా.. 15రోజుల కిందట గృహ ప్రవేశం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. సుమారు వెయ్యి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరమైంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్య ను పెద్ద కుమారుడు సురేష్ వరదలకు ముందే హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు.
వరదలు ఇంటిని ముంచెత్తడంతో జమునను ఒక స్నేహితుని ఇంట్లో ఉంచి, నవీన్, జగదీష్‌లు మరో స్నేహితుని ఇంట్లో తలదాచుకున్నారు. అప్పటివరకు ఒకేచోట ఉన్న కుటుంబం చెల్లాచెదురైంది. కొత్త ఇల్లు కట్టుకున్నామనే ఆనందం వరదలతో ఆవిరైంది. ఓ వైపు బ్యాంకు రుణం, రూ.4 లక్షల విలువైన ఇల్లు వరదలో పాడైపోవడం, వీటన్నింటికి తోడు భర్త అనారోగ్యంతో జమున మనస్తాపం చెందింది. ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అంజన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment