Ministry of Commerce and Industry data
-
ఫార్మాలో విదేశీ పెట్టుబడుల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయి. 2024–25 మొదటి అర్ధభాగంలో ఎఫ్‌డీఐలు నాలుగురెట్లకుపైగా దూసుకెళ్లి 520 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఎఫ్‌డీఐ ఈక్విటీ 117 మిలియన్ డాలర్లు మాత్రమే. 2000 ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోకి వచ్చిన విదేశీ నిధులు 23.05 బిలియన్ డాలర్లు. ఇది ఈ కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3.25 శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2024 సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో విదేశీ నిధులు దాదాపు పది రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 284 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది కేవలం 27 మిలియన్ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 162 శాతం వృద్ధితో ఎఫ్‌డీఐలు 236 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 90 మిలియన్ డాలర్లుగా ఉంది. డీవోపీకి ఆ బాధ్యతలు..వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి 1.06 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇది 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.06 బిలియన్ డాలర్లు. 2021–22లో 1.41 బిలియన్ డాలర్లు నమోదైంది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో నూతనంగా స్థాపించే ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లో 100 శాతం వరకు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న ఫార్మాస్యూటికల్ ప్రాజెక్ట్‌లకు 74 శాతం దాటే విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2017 మే నెలలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్‌ను (ఎఫ్ఐపీబీ) రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ ఆమోదం మార్గంలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్‌కు (డీవోపీ) ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే వైద్య పరికరాల రంగానికి సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సైతం ఈ డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది. -
ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనల నడుమ దేశ ఎగుమతులు ప్రోత్సాహకర స్థాయిలో పెరిగాయి. అక్టోబర్ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 39.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. చివరిగా 2022 జూన్ నెలలో ఎగుమతుల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసి గణాంకాలను పరిశీలించగా.. అక్టోబర్‌లో దిగుమతులు 3.9 శాతం పెరిగి 66.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 63.86 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులు 13.34 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 27.14 బిలియన్ డాలర్లకు చేరింది. సెపె్టంబర్ చివరికి ఇది 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలతో పోల్చి చూస్తే వాణిజ్య లోటు 3.29 బిలియన్ డాలర్ల మేర తక్కువగా ఉంది. చమురు, నూనెల దిగుమతులు అధికం.. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 5.77 శాతం ఎగసి 416.93 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడు నెలల కాలంలో వాణిజ్య లోటు 164.65 మిలియన్ డాలర్లకు ఎగిసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 149.67 బిలియన్ డాలర్లుగా ఉంది. → ఏప్రిల్–అక్టోబర్ మధ్య సేవల ఎగుమతులు 216 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 192 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → అక్టోబర్‌లో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 40 శాతం పెరిగి 11.25 బిలియన్ డాలర్లకు చేరగా.. ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు 46 శాతం వృద్ధితో 3.43 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. → వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 36 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు సైతం సెపె్టంబర్లో ఉన్న 4.39 బిలియన్ డాలర్ల నుంచి అక్టోబర్‌లో 7.13 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. క్రితం ఏడాది అక్టోబర్‌లో 7.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → ముడి చమురు దిగుమతులు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 18.2 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. -
బొమ్మల పరిశ్రమ సామర్థ్యం పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయ బొమ్మల పరిశ్రమ (టాయ్) విశాలంగా ఆలోచించాలని, సామర్థ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సూచించింది. తద్వారా తయారీని పెంచి, ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని కోరింది. దిగుమతులపై సుంకాలు పెంపు, నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం దిగుమతులు తగ్గేందుకు సాయపడతాయని, తయారీని ప్రోత్సహిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. పెద్దగా ఆలోచించడమే ఇప్పుడు పరిశ్రమ వంతుగా గుర్తు చేశారు. యూనికార్న్(బిలియన్ డాలర్ల విలువ)గాఅవతరించాలంటే మరో స్థాయికి చేరుకోవాలన్నారు. యాజమాన్యంలో వృత్తి నైపుణ్యాలు తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో టాయ్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వల్ల మూడేళ్ల విరామం తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 96 స్టాళ్లు కొలువుదీరాయి. కేంద్ర ప్రభుత్వం స్థానికంగానే బొమ్మల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బొమ్మలపై 20 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 60 శాతానికి పెంచింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుమతి అయ్యే బొమ్మల నాణ్యత ఉండాలని నిర్ధేశించింది. భారత్‌కు ఎగుమతి చేయాలనుకునే ఏ దేశ కంపెనీ ఉత్పత్తులకు అయినా ఇవే నిబంధనలు అమలవుతాయని నాటి ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. గణనీయంగా తగ్గిన దిగుమతులు దేశంలోకి బొమ్మల దిగుమతులు 2018-19లో 304 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2021-22 నాటికి 36 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో మన దేశం నుంచి బొమ్మల ఎగుమతులు 109 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్యలు పరిశ్రమకు సాయపడుతున్నట్టు ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. తయారీని ప్రోత్సహించడంతోపాటు, దిగుమతులు తగ్గేందుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కావాలి. అప్పుడే పరిశ్రమ తదుపరి స్థాయికి వెళుతుంది. ఉపాధి కల్పనతోపాటు, ఎగుమతులు పెరుగుతాయి’’అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 120 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారత్ వాటా చాలా తక్కువేనన్నారు. నేషనల్ టాయ్ పాలసీ, పీఎల్ఐ పథకాల వంటికి ఈ రంగం వృద్ధికి సాయపడతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంతొ దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని, గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని మంగళవారం నాటి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 13వ టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ అగర్వాల్ "రీబ్రాండింగ్ ది ఇండియన్ టాయ్ స్టోరీ" పేరుతో ప్రధాని ఇచ్చిన క్లారియన్ కాల్‌ను గుర్తు చేశారు. -
పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల భారం
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్‌లో భారత్‌లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు... ► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్ డాలర్లు. ► ఎగుమతుల్లో ఇంజనీరింగ్ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్లకు చేరింది. 400 బిలియన్ డాలర్ల లక్ష్యం సాకారం! ఇక భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘బేస్’ మాయలో ఏప్రిల్ మౌలిక రంగం
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌పై ఏప్రిల్‌లో పూర్తి ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. ఏకంగా 56.1 శాతం పురోగతి నమోదయ్యింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పు ను ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 ఏప్రిల్‌ను తీసుకుంటే, ఎనిమిది రంగాల గ్రూప్‌లో కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా 37.9% క్షీణత నమోదయ్యింది. సమీక్షా కాలంలో కీలక రంగాలను వేర్వేరుగా సమీక్షిస్తే... ► సహజ వాయువు: 19.9 శాతం క్షీణత నుంచి 25 శాతం పురోగతికి మారింది. ► రిఫైనరీ ప్రొడక్టులు: 24.2 శాతం క్షీణ రేటు నుంచి 30.9 శాతం వృద్ధికి చేరింది. ► స్టీల్: 82.8 శాతం మైనస్ నుంచి 400 శాతం వృద్ధికి హైజంప్ చేసింది. ► సిమెంట్: 85.2 శాతం క్షీణ రేటు నుంచి 548.8 శాతం పురోగమించింది ► విద్యుత్: 22.9 శాతం నష్టం నుంచి 38.7 శాతం వృద్ధితో యూటర్న్ తీసుకుంది. ► బొగ్గు: 9.5 శాతం పురోగమించింది. ► ఎరువులు: స్వల్పంగా 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► క్రూడ్ ఆయిల్: క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఏప్రిల్‌లోనూ దిగజారింది. 2.1% క్షీణతనే నమోదుచేసుకుంది. అయితే 2020 ఏప్రిల్ నాటి మైనస్ 6.4% క్షీణత రేటు కొంత తగ్గడం కొంత ఊరట. ఐఐపీ 150% పెరిగే చాన్స్! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉంది. భారీ బేస్ ఎఫెక్ట్ వల్ల ఐఐపీ పెరుగుదలసైతం 130 నుంచి 150 శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
ఎనిమిది నెలల గరిష్టానికి డబ్ల్యుపిఐ
సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి భారీగాఎగిసింది. గతనెలల అక్టోబర్‌లో కొద్దిగా చల్లారిన డబ్ల్యుపిఐ నవంబరు నెలలో 3.93 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా డబ్ల్యుపిఐ ఎనిమిదినెలల గరిష్టాన్ని తాకింది. ఈ మేరకు గురువారం వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. సవరించిన బేస్ సంవత్సరం 2011-12 తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) 2017 నవంబర్ నెలలో 3.93 శాతంగా నమోదైంది. గత నెలల ఇది 3.59 శాతంగా ఉంది. ఆహారధరల సూచీ ఇయర్ ఆన్ ఇయర్ 4.10 శాతం పెరిగింది. గతనెలలో నెల 3.23 శాతం పెరుగుదలను నమోదుచేసింది. -
కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది. రంగాల పరంగా చూస్తే... జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ పెరగడం హర్షణీయం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం. క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.