న్యూఢిల్లీ: దేశీయ బొమ్మల పరిశ్రమ (టాయ్) విశాలంగా ఆలోచించాలని, సామర్థ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సూచించింది. తద్వారా తయారీని పెంచి, ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని కోరింది. దిగుమతులపై సుంకాలు పెంపు, నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం దిగుమతులు తగ్గేందుకు సాయపడతాయని, తయారీని ప్రోత్సహిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. పెద్దగా ఆలోచించడమే ఇప్పుడు పరిశ్రమ వంతుగా గుర్తు చేశారు.
యూనికార్న్(బిలియన్ డాలర్ల విలువ)గాఅవతరించాలంటే మరో స్థాయికి చేరుకోవాలన్నారు. యాజమాన్యంలో వృత్తి నైపుణ్యాలు తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో టాయ్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వల్ల మూడేళ్ల విరామం తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 96 స్టాళ్లు కొలువుదీరాయి. కేంద్ర ప్రభుత్వం స్థానికంగానే బొమ్మల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బొమ్మలపై 20 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 60 శాతానికి పెంచింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుమతి అయ్యే బొమ్మల నాణ్యత ఉండాలని నిర్ధేశించింది. భారత్‌కు ఎగుమతి చేయాలనుకునే ఏ దేశ కంపెనీ ఉత్పత్తులకు అయినా ఇవే నిబంధనలు అమలవుతాయని నాటి ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది.
గణనీయంగా తగ్గిన దిగుమతులు
దేశంలోకి బొమ్మల దిగుమతులు 2018-19లో 304 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2021-22 నాటికి 36 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో మన దేశం నుంచి బొమ్మల ఎగుమతులు 109 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్యలు పరిశ్రమకు సాయపడుతున్నట్టు ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. తయారీని ప్రోత్సహించడంతోపాటు, దిగుమతులు తగ్గేందుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కావాలి. అప్పుడే పరిశ్రమ తదుపరి స్థాయికి వెళుతుంది. ఉపాధి కల్పనతోపాటు, ఎగుమతులు పెరుగుతాయి’’అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 120 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారత్ వాటా చాలా తక్కువేనన్నారు. నేషనల్ టాయ్ పాలసీ, పీఎల్‌ఐ పథకాల వంటికి ఈ రంగం వృద్ధికి సాయపడతాయన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంతొ దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని, గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని మంగళవారం నాటి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 13వ టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ అగర్వాల్ "రీబ్రాండింగ్ ది ఇండియన్ టాయ్ స్టోరీ" పేరుతో ప్రధాని ఇచ్చిన క్లారియన్ కాల్‌ను గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment