ఏప్రిల్–సెప్టెంబర్‌లో 520 మిలియన్ డాలర్లు
గతేడాదితో పోలిస్తే నాలుగురెట్లకుపైగా వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయి. 2024–25 మొదటి అర్ధభాగంలో ఎఫ్‌డీఐలు నాలుగురెట్లకుపైగా దూసుకెళ్లి 520 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఎఫ్‌డీఐ ఈక్విటీ 117 మిలియన్ డాలర్లు మాత్రమే. 2000 ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోకి వచ్చిన విదేశీ నిధులు 23.05 బిలియన్ డాలర్లు.
ఇది ఈ కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3.25 శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2024 సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో విదేశీ నిధులు దాదాపు పది రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 284 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది కేవలం 27 మిలియన్ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 162 శాతం వృద్ధితో ఎఫ్‌డీఐలు 236 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 90 మిలియన్ డాలర్లుగా ఉంది.
డీవోపీకి ఆ బాధ్యతలు..
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మాస్యూటికల్ రంగంలోకి 1.06 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇది 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.06 బిలియన్ డాలర్లు. 2021–22లో 1.41 బిలియన్ డాలర్లు నమోదైంది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో నూతనంగా స్థాపించే ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం వరకు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న ఫార్మాస్యూటికల్ ప్రాజెక్ట్‌లకు 74 శాతం దాటే విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2017 మే నెలలో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్‌ను (ఎఫ్‌ఐపీబీ) రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ ఆమోదం మార్గంలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్‌కు (డీవోపీ) ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే వైద్య పరికరాల రంగానికి సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సైతం ఈ డిపార్ట్‌మెంట్ పరిశీలిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment