న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో దేశీ అంకుర సంస్థల్లోకి కొత్త ఏడాది (2023)లో భారీగా విదేశీ పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయం తెలిపారు.
ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, మన అంకుర సంస్థల పనితీరును బట్టి చూస్తే త్వరలోనే అంతర్జాతీయంగా అగ్ర స్థానానికి చేరుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘గుర్తింపు పొందిన స్టార్టప్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్టార్టప్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాలకు మంచి ఆదరణ ఉంటోంది’’ అని జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వం సరళతరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని పాటిస్తుండటం కూడా అంకుర సంస్థల్లోకి మరిన్ని పెట్టుబడుల రావడానికి దోహదపడనుందని ఆయన చెప్పారు.
మరోవైపు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) వినియోగించుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయని జైన్ తెలిపారు. పలు గ్లోబల్ సంస్థలు తమ తయారీ కార్యకలాపాలను భారత్కు మార్చుకునే యోచనలో ఉన్నాయని ఆయన వివరించారు. 14 రంగాల్లో పీఎల్‌ఐ స్కీములతో రూ. 2.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాలు పెట్టుబడులు, ఉత్పత్తి/విక్రయాలు, ఉద్యోగాల కల్పనలో కీలకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు.
పథకాల దన్ను
దేశీయంగా నవకల్పనలు, అంకుర సంస్థలు, స్టార్టప్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా ప్రణాళికను ఆవిష్కరించింది. గణాంకాల ప్రకారం నవంబర్ 30 వరకూ దీని కింద 84,000 పైగా అంకుర సంస్థలు గుర్తింపు పొందాయి. ఇక, స్టార్టప్‌లకు వివిధ దశల్లో అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కేంద్రం ఎఫ్‌ఎఫ్‌ఎస్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్), రుణ హామీ పథకం (సీజీఎస్‌ఎస్) మొదలైనవి అమలు చేస్తోంది. ఎఫ్‌ఎఫ్‌ఎస్ కింద 93 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) 773 స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు పెడుతున్నాయి.
అలాగే, 2021–22లో ప్రవేశపెట్టిన ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్ కింద 126 ఇన్‌క్యుబేటర్స్‌లోకి రూ. 455 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. నవంబర్ 30 వరకూ ఈ ఇన్‌క్యుబేటర్స్ ద్వారా ఆర్థిక తోడ్పాటు పొందేందుకు 650 స్టార్టప్స్ ఆమోదం పొందాయి. ఇక సీజీఎస్‌ఎస్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నోటిఫై చేయగా, పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment