Pharmaceutical sector
-
ఔషధ సంస్థల ఆదాయ వృద్ధి 8–10 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలోని టాప్–25 సంస్థల ఆదాయ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇక్రా ప్రకారం.. భారతీయ మొత్తం ఔషధ పరిశ్రమలో 60 శాతం వాటా కలిగిన ఈ కంపెనీల ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం పెరిగింది. 2023–24 నాటి అధిక అమ్మకాలను అనుసరించి 2024–25లో యుఎస్ 8–10 శాతం, యూరప్ మార్కెట్ల నుండి 7–9 శాతం ఆదాయ వృద్ధి నమోదుకు ఆస్కారం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది యూఎస్ 18–20, యూరప్ 16–18 శాతం ఉండవచ్చు. దేశీయ మార్కెట్ 6–8 శాతం స్థిర వృద్ధిని చూడగలదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు 2024–25లో 8–10 శాతం, 2023–24లో 16–18 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చు. పెరిగిన కొత్త ఉత్పత్తులు.. 2023–24లో పెరిగిన కొత్త ఉత్పత్తుల విడుదల, ఎంపిక చేసిన చికిత్స విభాగాల్లో ఉత్పత్తి కొరత, సంక్లిష్ట జనరిక్స్ ఆరోగ్యకర పనితీరు యూఎస్ విపణిలో టాప్–25 భారతీయ కంపెనీల ఆదాయ వృద్ధికి కారణం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి ఉన్నప్పటికీ 2024–25లో వృద్ధి తగ్గుతుందని అంచనా. యుఎస్ మార్కెట్లో స్వల్ప ధరల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, భారతీయ ఫార్మా సంస్థలు యుఎస్ మార్కెట్లోని కాంప్లెక్స్ జెనరిక్స్ నుండి తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గత సంవత్సరంలో భారతీయ ఔషధ సంస్థలకు యూఎస్ఎఫ్డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలు, దిగుమతి హెచ్చరికల సంఖ్య పెరిగింది. దీంతో నూతన ఉత్పత్తుల విడుదలలో జాప్యానికి దారితీసింది. కన్సల్టెంట్లను నియమించుకోవడం, అదనపు వనరులను వినియోగించడం వంటి పరిష్కార చర్యలకు గణనీయంగా వ్యయ భారం పడుతోంది. తద్వారా లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతోంది. పొంచి ఉన్న ముప్పు.. కొనసాగుతున్న ఎర్ర సముద్ర సంక్షోభం ప్రస్తుతానికి భారతీయ ఔషధ కంపెనీలపై ప్రభావం చూపనప్పటికీ.. సరఫరా అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల రూపంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైతే అవి కీలకంగా మారతాయి. ధరల పెరుగుదల కీలక ఆదాయ మార్గంగా ఉన్నందున జెనరిక్స్‌కు అనుకూలమైన ఏవైనా పరిణామాలు లేదా ముఖ్యమైన మందుల జాబితా (ఎన్ఎల్ఈఎం) కింద మరిన్ని ఉత్పత్తులను చేర్చినట్టయితే తయారీ సంస్థలకు నష్టాలు వాటిల్లే ముప్పు పొంచి ఉంది. -
ఈరిస్కు.. రెడ్డీస్ డెర్మటాలజీ బ్రాండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న ఈరిస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి తొమ్మిది రకాల డెర్మటాలజీ బ్రాండ్స్‌ను దక్కించుకుంది. డీల్ విలువ రూ.275 కోట్లు. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ రంగంలో డీల్ తదనంతరం ఈరిస్ 7 శాతం వాటాతో మార్కె ట్లో మూడవ స్థానానికి ఎగబాకనుంది. 2022 మే నెలలో రూ.650 కోట్లతో ఓక్నెట్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడం ద్వారా డెర్మటాలజీ విభాగంలోకి ఈరిస్ ప్రవేశించింది. 2023 జనవరిలో గ్లెన్‌మార్క్ నుంచి తొమ్మిది డెర్మటాలజీ బ్రాండ్స్‌ను రూ.340 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లకు రూ.1,265 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. -
హెటిరో చేతికి జాన్సన్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ హెటిరో తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ఇంజెక్టేబుల్స్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసినట్టు సోమవారం ప్రకటించింది. డీల్ విలువ రూ.130 కోట్లు. హైదరాబాద్ సమీపంలోని పెంజెర్ల వద్ద 55.27 ఎకరాల్లో ఈ ప్లాంటు విస్తరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెటిరో ఫ్లాగ్షిప్ స్టెరైల్ ఫార్మాస్యూటికల్, బయోలాజిక్స్ తయారీ యూనిట్‌గా ఇది నిలవనుంది. ఈ కేంద్రంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాల ఆధునీకరణకు, మెరుగుపరచడానికి, బయోలాజిక్స్, స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీని విస్తరించడానికి సుమారు రూ.600 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నట్టు హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఫెసిలిటీ ద్వారా బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మాలిక్యులర్ బయోసైన్సెస్, ఇంజనీరింగ్, అనుబంధ విభాగాల్లో నూతనంగా 2,000 ఉద్యోగాలను జోడించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ డీల్‌కు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా పీడబ్ల్యూసీ వ్యవహరించింది. -
టైం వచ్చింది.. భారత ఫార్మా రంగంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భారత ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు అనుకూల సమయం వచ్చిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పరిమాణాత్మక (సంఖ్యా పరంగా) స్థాయి నుంచి విలువ పరంగా అగ్రస్థానాన్ని చేరుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమకు అనుకూలమైన విధానాలతో మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. భారత ఫార్మాస్యూటికల్స్ సమాఖ్యతో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘భారత ఫార్మా విజన్ 2047’కు కార్యాచరణను రూపొందించడంలో భాగంగా మంత్రి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ‘‘అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను నేర్చుకోవాలి. వాటికి అనుగుణంగా సొంత నమూనాలను రూపొందించుకోవాలి. దేశీయ డిమాండ్ అందుకుంటూనే అంతర్జాతీయంగా విస్తరించాలి. పరిమాణాత్మకంగా అగ్రస్థానంలో ఉన్న పరిశ్రమ.. విలువ పరంగానూ అదే స్థానానికి చేరుకోవాలి. పరిశోధన, తయారీ, ఔషధాల అభివృద్ధిలో అంతర్జాతీయంగా ఉన్న ఉత్త మ విధానాలను సొంతం చేసుకోవాలి’’అని మంత్రి సూచించారు. రానున్న సంవత్సరాల్లో మరింతగా వృద్ధి సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీర్ఘకాల విధానాలు పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకొస్తా యంటూ.. ఈ విషయంలో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో సమగ్రమైన విధానం అనుస్తామంటూ.. మన విధానాలు భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం తీసుకొచి్చనవిగా పేర్కొన్నారు. ఇవి దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పారు. వినూత్నమైన టెక్నాలజీలపై పరిశ్రమ పెట్టుబడులు పెట్టాలని, తయారీ సామర్థ్యాలను విస్తరించుకోవాలని సూచించారు. పీఎల్ఐ వంటి పథకాలతో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. -
Jamp Pharma: కెనడా వెలుపల తొలి ఎక్స్‌లెన్స్ సెంటర్ హైదరాబాద్‌లో..
జెనరిక్ మెడిసిన్ విభాగంలో ప్రఖ్యాతి చెందిన జాంప్ ఫార్మా తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. జాంప్ ఫార్మా విస్తరణలో భాగంగా సుమారు రూ.250 కోట్లతో నిర్మించిన ఎక్స్‌లెన్సీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. కెనడా వెలుపల జాంప్‌కి ఇదే తొలి సెంటర్. ఈ సెంటర్ ఆరంభం కావడంతో షార్మా రంగంలో కొత్తగా రెండు వందల మందికి ఉపాధి లభించనుంది. జాంప్ సంస్థ తొలి దశలో వంద కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ సంస్థ ఉత్పత్తిలో 25 శాతం హైదరాబాద్ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ ఫలితాలు బాగుండటంతో హైదరాబాద్ విస్తరించాలని ఆ సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సెంటర్లో ఓరల్ డోసేజ్ మెడిసిన్స్‌కి సంబంధించిన కార్యకలాపాలు జరగనున్నాయి. (చదవండి: బ్యాంకుల రుణాల్లో 8.9శాతం నుంచి 10.2% వృద్ధి!) -
ఫార్మాలో రూ.81,730 కోట్ల వ్యాపార అవకాశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ సరఫరా భారత ఔషధ రంగానికి కాసులు కురిపించనుంది. ఇక్కడి తయారీ సంస్థలకు భారత్‌తోపాటు, అంతర్జాతీయంగా వచ్చే మూడేళ్లలో రూ.81,730 కోట్ల వరకు వ్యాపార అవకాశాలు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ‘వ్యాక్సిన్ల విక్రయం ద్వారా యూఎస్ సంస్థలు ప్రీమియం ధరలను ఆస్వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ధరలు ఒక్కో డోసుకి రూ.1,114.5 నుంచి రూ.1,857.5 వరకు ఉంది. ఒక్కో డోసుపై రూ.260 వరకు లాభం గడిస్తున్నాయి. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు ప్రీమియం ధరను పొందే అవకాశం లేదు’ అని వివరించింది. అంతర్జాతీయంగా ఇలా.. దేశీయ డిమాండ్‌లో ఎక్కువ భాగం మార్చి 2022 నాటికి నెరవేరుతుందని అంచనా. యూరప్, ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన ఆసియా దేశాల వంటి అధిక ఆదాయ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలు పూర్తిగా అయిపోయాయి. చైనా, జపాన్, కొన్ని దక్షిణ అమెరికా దేశాలను మినహాయించి వివిధ ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎగుమతికి ఆస్కారం ఉంది. ఇక్కడ టీకా వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. డిమాండ్ 125 కోట్ల డోసుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా ఆగస్ట్ 10 నాటికి 435 కోట్ల డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్స్ నమోదయ్యాయి. భారత్‌లో అవకాశాలు.. వ్యాక్సినేషన్లో భాగంగా ఆగస్ట్ 10 నాటికి భారత్‌లో 50 కోట్ల డోసులు నమోదయ్యాయి. దేశంలో మరో 200 కోట్ల డోసులు అవసరం. ఇక్కడ రోజుకు 50–55 లక్షల డోసుల స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. ఈ ఏడాది జనాభాలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి కావొచ్చని అంచనా. ఈ కాలంలో భారత ఫార్మా సంస్థలకు రూ.34,180 కోట్ల వ్యాపార అవకాశం ఉంటుంది. ఎగుమతులు పెరగడంతో ఇది వచ్చే ఏడాది నాటికి రూ.36,410 కోట్లకు చేరుకుంటుంది. 2023లో డిమాండ్ రూ.11,890 కోట్లకు పరిమితం అవుతుంది’ అని కేర్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. -
మన టీకా కోసం ప్రపంచం నిరీక్షణ
ఔషధ రంగంలో భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఇనుమడిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కోవిడ్–19 మహమ్మారిని కట్టడి చేయడానికి మన దేశం ఇప్పటికే రెండు టీకాలను అభివృద్ధి చేసిందని, వాటి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని అన్నారు. అలాగే అతిపెద్దదైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇండియా ఎలా అమలు చేయనుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. ప్రధాని శనివారం 16వ ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) ప్రారంభోత్సవంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎక్కడైనా గొప్పగా వెలిగిపోతోంది అంటే అది భారత్‌లో మాత్రమేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపై ఎంతోమంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని, అవన్నీ పటాపంచలు అయ్యాయని ఉద్ఘాటించారు. మన దేశంలో తయారైన వస్తువులను మరిన్ని ఉపయోగించాలని ప్రవాస భారతీయులకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో మన చుట్టుపక్కల నివసించే వారిలోనూ ఆయా వస్తువులు వాడాలన్న ఆకాంక్ష పెరుగుతుందని చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ వేగంగా అడుగులేస్తోందని, ‘బ్రాండ్ ఇండియా’ ఉద్దీపనలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రపంచానికి మన దేశం ఒక ఔషధాగారంగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు అవసరమైన ముఖ్యమైన ఔషధాలను భారత్ సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాటం విషయంలో 16న భారత్ కీలకమైన ముందడుగు వేయబోతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. వ్యాక్సిన్ పంపిణీలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సఫాయి కర్మచారీలు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యం లభిస్తుంది. – ట్విట్టర్లో మోదీ -
వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్ ఐపీవో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయ రంగంలో ఉన్న మెడ్‌ప్లస్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. తద్వారా రూ.700 కోట్లకుపైగా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో ప్రమోటర్లకు 77 శాతం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థకు 13 శాతం వాటాలున్నాయి. మిగిలిన వాటా ప్రమోటర్లకు సన్నిహితులైన కొందరు ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది. ఆఫర్ ఫర్ సేల్‌తో సహా ఐపీఓ మార్గంలో 20 శాతం వాటా విక్రయించనున్నట్టు మెడ్‌ప్లస్ ప్రమోటర్, ఫౌండర్ మధుకర్ గంగాడి వెల్లడించారు. కెనడా కంపెనీ జెమీసన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా ఆ వివరాలను వెల్లడించడానికి బుధవారమిక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఓ వివరాలను వెల్లడిస్తూ... అలా సమీకరించే నిధులను విస్తరణకోసం ఉపయోగిస్తామని స్పష్టంచేశారు. సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసే ప్రక్రియ ఈ డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు. నాలుగేళ్లలో 3,100 స్టోర్లకు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో మెడ్‌ప్లస్ ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రాష్త్రాల్లో సంస్థకు 1,700కు పైగా స్టోర్లున్నాయి. ‘‘2023 నాటికి అన్ని రాష్త్రాల్లో 3,100 ఔట్లెట్ల స్థాయికి తీసుకు వెళతాం. ఈ కొత్త స్టోర్లను జమ్ము, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. 2018–19లో మెడ్‌ప్లస్ రూ.2,250 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.2,800 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై రూ.50 కోట్ల నికరలాభం వస్తుందనేది మా అంచనా’’ అని మధుకర్ వివరించారు. సంఘటిత ఔషధ రిటైల్ రంగంలో కంపెనీ వాటా 3 శాతానికి చేరుతుందని కూడా తాము అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. తమ వ్యాపారంలో దాదాపు 17 శాతం ‘మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్’ ద్వారా వస్తున్నట్లు మెడ్‌ప్లస్ సీవోవో సురేంద్ర మంతెన తెలియజేశారు. ఈ విభాగం ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తోందన్నారు. స్టోర్లలో జెమీసన్ ఉత్పత్తులు.. కెనడాకు చెందిన విటమిన్ల తయారీ దిగ్గజం జెమీసన్‌తో మెడ్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో జెమీసన్ బ్రాండ్ ఉత్పత్తులు ఇక నుంచి మెడ్‌ప్లస్ స్టోర్లలో లభిస్తాయి. 1922లో ప్రారంభమైన జెమీసన్ విటమిన్లు, మినరల్స్, హెల్త్ సప్లిమెంట్లను 40 దేశాల్లో విక్రయిస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్ మార్క్ హార్నిక్ ఈ సందర్భంగా చెప్పారు. -
ఆన్లైన్లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!
డాక్టర్ రాసిన మందుల చీటిని ఫోన్ కెమెరా నుంచి క్లిక్ మనిపించి, దాన్ని మొబైల్ యాప్ నుంచి అప్లోడ్ చేసి, చిటికెలో ఆర్డర్ చేసేయడం... ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల నుంచి మెట్రోల వరకు ఈ ఫార్మసీ వ్యాపారం విస్తరిస్తోంది. దీనివల్ల మందుల ధరలపై ఎక్కువ తగ్గింపు లభించడంతోపాటు, డాక్టర్ సూచించిన మందుల్లో ఏదో ఒక రకం లేకపోవడమన్న సమస్య కూడా దాదాపుగా ఉండడం లేదు. దేశంలో ఔషధ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌కు సంబంధించి లాభ, నష్టాలపై అవగాహన కోసమే ఈ కథనం... ఈ–ఫార్మసీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడం.. సంప్రదాయ ఔషధ దుకాణాలు సేవల గురించి ఆలోచించే విధంగా దారితీసింది. ఈ పోటీ కారణంగా ఆర్డర్ చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాయి సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు. కస్టమర్లను కాపాడుకునేందుకు వారికి అవసరమైన ఔషధాలు తమ వద్ద లేకపోయినా కానీ, ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు లు రావడానికి దోహదం చేసింది కచ్చితంగా ఈ ఫార్మసీలేనని చెప్పుకోవాలి. ఇక వైద్యులు తప్పనిసరిగా ఔషధం బ్రాండెడ్ పేరును కాకుండా, జనరిక్ పేరునే సూచించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వినియోగదారులకు ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలనే విషయంలో స్వేచ్ఛను కల్పించనుంది. ధరలు ఈ ఫార్మసీలు సాధారణంగా ఔషధ ధరలపై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆయా ఉత్పత్తులను బట్టి డిస్కౌంట్ వేర్వేరుగా ఉంటుంది. పోషక ఉత్పత్తులపై చాలా వరకు ఆన్లైన్ ఫార్మసీలు తక్కువే డిస్కౌంట్ ఇస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులపై (వైద్యులు రాసినవి) ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఫార్మసీల నుంచి కొనుగోలు చేసే వారికి కొంత ఆదా అవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ ప్రభావంతో సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు కూడా దిగొచ్చి, ఎంఆర్పీపై తగ్గింపు ఇస్తున్నాయి. అయినప్పటికీ ఆన్లైన్ ఫార్మసీల్లోనే డిస్కౌంట్ ఎక్కువ లభిస్తోంది. ఔషధ ధరలపై తగ్గింపులు, ఆర్డర్ చేసే విషయంలో ఆన్లైన్ ఫార్మసీలకే ఎక్కువ మార్కులు పడతాయి. కాకపోతే డెలివరీకి తీసుకునే సమయంలోనే సవాలు నెలకొని ఉంది. ఈ ఫార్మసీ స్టార్టప్ సంస్థలు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, రవాణా పరమైన సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓ ఔషధం వెంటనే తీసుకోవాల్సి ఉంటే సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే పరిష్కారం. ఇటువంటి వారు ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేసి, అవి వచ్చే వరకు వేచి ఉండడం సాధ్యపడదు. కాకపోతే క్రమం తప్పకుండా కొన్ని రకాల జీవనశైలి సమస్యలకు మందులు వాడే వారు మాత్రం తమకు కావాల్సిన మందులను ముందుగానే ఆన్లైన్ ఫార్మసీల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే కనీస ఆర్డర్ విలువకు తక్కువ కొనుగోలు చేస్తే, డెలివరీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. భిన్న రకాలు... ఈ ఫార్మసీల్లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఆన్లైన్లో మాత్రమే ఫార్మసీలను విక్రయించే నమూనా. సంబంధిత ఫార్మసీ స్టోర్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కావాల్సిన మందులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలను ఇంటికి డెలివరీ చేస్తారు. నెట్‌మెడ్స్, మెడ్‌లైఫ్, 1ఎంజీ, ఎంకెమిస్ట్, ఫార్మ్ఈజీ ఇవన్నీ కూడా ఈ కోవలోనివే. ఇక రెండో నమూనాలో అటు సంప్రదాయ ఫార్మసీ స్టోర్లతో పాటు, ఆన్‌లైన్‌లోనూ ఔషధ విక్రయాలను నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. తద్వారా రెండు మార్గాల్లోనూ కస్టమర్లను సంపాదించుకోవడం లక్ష్యం. మెడ్‌ప్లస్ ఈ తరహాలోనే పనిచేస్తోంది. మెడ్‌ప్లస్ సంస్థ 20 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్లపై తగ్గింపు ఇస్తోంది. మెడ్‌ప్లస్ స్టోర్‌కు వెళ్లి రూ.1,000లోపు ఆర్డర్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే, అదే ఆన్లైన్లో ఆర్డర్‌పై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తుండడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ ఆఫర్ చేయడంతోపాటు, ఇంటికి డెలివరీ చేయడం లేదా సమీపంలోని మెడ్‌ప్లస్ స్టోర్‌కు స్వయంగా వెళ్లి తీసుకునే ఆప్షన్లను కూడా ఇస్తోంది. కస్టమర్లు తమ సౌకర్యం కొద్దీ నచ్చినది ఎంచుకోవచ్చు. ఇక మూడో రకం.. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని కస్టమర్ నివాసం/కార్యాలయం సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు ఆ ఆర్డర్‌ను బదిలీ చేసేవీ ఉన్నాయి. వీఫార్మాసిస్ట్ ఇలానే చేస్తోంది. కావాల్సిన ఔషధాన్ని ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటూ.. ఆ తర్వాత అదే ఆర్డర్‌ను కస్టమర్ లొకేషన్ సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత స్టోర్ ప్రతినిధి కస్టమర్ నివాసానికి ఔషధాలను డెలివరీ చేస్తారు. డెలివరీ సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు. చట్టం ఏం చెబుతోంది... ఆన్లైన్ ఫార్మసీలు తమ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తుండడంతో సంప్రదాయ ఔషధ వర్తకులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణకు సంబంధించి ఓ నమూనా విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో ఆన్లైన్లో ఫార్మసీ నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ ఆన్లైన్లో ఔషధాలను ప్రదర్శించడం, పంపిణీ, విక్రయాలు చేయడం నిషిద్ధం. అలాగే, నార్కోటిక్, సైకోట్రాపిక్ ఔషధాలపై నిషేధానికి సంబంధించిన నిబంధనలూ వీటికి వర్తిస్తాయి. రోగుల సమాచారం గోప్యంగా ఉంచడం, ఈ తరహా సమాచారం ఎవరికీ లీక్ అవకుండా, పంచుకోకుండా ఉండాలి. ఇక ఆన్లైన్ ఫార్మసీలను సవాలు చేస్తూ గతేడాది మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఫార్మసీ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురానున్నట్టు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రం బదులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే... లోపాలను నివారించడంతోపాటు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు. -
ఫార్మా ఎగుమతులు 11% అప్
న్యూఢిల్లీ: ఉత్తర అమెరికా, యూరప్ దేశాల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఫార్మా రంగ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం 11 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. 2018–19లో 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 17.3 బిలియన్ డాలర్లు కాగా, 2016–17లో 16.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఫార్మా ఎగుమతుల్లో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 30 శాతంగా ఉండగా, ఆఫ్రికా వాటా 19 శాతం, యూరోపియన్ యూని యన్ వాటా 16 శాతంగాను ఉంది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా మార్కెట్ కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోందని, వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా చైనాకు ఫార్మా ఎగుమతులపై మరింతగా దృష్టి సారిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కీలకమైన దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్, జర్మనీలకు కూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. టాప్ 5లో ఒకటి..: ఎగుమతులకు సంబంధించిన టాప్ 5 రంగాల్లో ఫార్మా కూడా ఒకటి. 2018–19లో మొత్తం 331 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో ఫార్మా వాటా 6 శాతంగా నమోదైంది. దేశీ ఫార్మా రంగంలో జనరిక్స్ ఔషధాల వాటానే ఎక్కువగా ఉంటోంది. -
దేశీ ఫార్మా.. చలో చైనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో కీలక ముడి పదార్థాల కోసం చైనా మార్కెట్‌పై ఆధారపడుతున్న భారత కంపెనీలు... దాన్ని ఎగుమతి మార్కెట్‌గానూ చూస్తున్నాయి. అమెరికాలో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో... భారత ఫార్మా కంపెనీలకు కొత్త ఎగుమతుల మార్కెట్‌గా చైనా అవతరిస్తోంది. ఇటీవలి ఇరు దేశాధినేతల సమావేశం దీనికి మరింత ఊతమిచ్చినట్లు ఫార్మా సంస్థలు భావిస్తున్నాయి. చైనాలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని వ్యాపార అవకాశంగా మలిచేందుకు ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) హైదరాబాద్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అగ్రశ్రేణి సంస్థల ఉన్నతాధికారులతో పలు సమావేశాలనూ నిర్వహించింది. ఈ నేపథ్యంలో త్వరలో పలు వ్యాపార భాగస్వామ్యాలు సాకారం కానున్నట్లు తెలియవచ్చింది. భారత ఫార్మా ఎగుమతుల్లో చైనాతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి అనూహ్య వృద్ధి సాధ్యమేనని ఫార్మెక్సిల్ కృతనిశ్చయంతో ఉంది. చైనా ఎందుకంటే.. బీఎంఐ నివేదిక ప్రకారం చైనా ఫార్మా మార్కెట్ విలువ రూ.10.2 లక్షల కోట్లు. 2018లో ఇది రూ.10.4 లక్షల కోట్లకు, 2027 నాటికి రూ.27.2 లక్షల కోట్లకు చేరనుంది. ఇక జనరిక్స్ వాటా గతేడాది రూ.5.57 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత సంవత్సరం ఇది రూ.6.61 లక్షల కోట్లకు, 2022 కల్లా రూ.9.12 లక్షల కోట్లకు చేరుతుంది. ఈ డిమాండ్‌ను ఊహించిన అక్కడి ప్రభుత్వం విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. భారత్‌తో పోలిస్తే యా క్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్ల తయారీ ఖర్చు చైనాలో ఎక్కువ. ఈ రంగంలో వేతనాలూ ఎక్కువే. వైద్య ఖర్చుల భారం ప్రభుత్వంపై, ప్రజలపై తగ్గించాలన్న ఆలోచనలో భాగంగా చాలా ఔషధాలపై సుంకాన్ని ఎత్తివేసింది. అంటే చైనాకు మందులు ఎగుమతి చేసే కంపెనీపై పన్ను భారం ఉండదన్న మాట. భారత్ నుంచి ఎగుమతులు ఇలా.. భారత్ నుంచి ఫార్మా ఎగుమతులు ఏప్రిల్–సెప్టెంబరు పీరియడ్‌లో 12.37 శాతం వృద్ధి కనబరిచాయి. ఎగుమతులు రూ.60,590 కోట్ల నుంచి రూ.68,094 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజికల్స్ 13.66 శాతం, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 11.53 శాతం వృద్ధి చెందాయి. ఏప్రిల్– సెప్టెంబరులో రీజియన్ పరంగా ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియాన్‌లు టాప్‌లో ఉన్నాయి. దేశాల పరంగా చూస్తే యూఎస్ఏ, యూకే, సౌత్ ఆఫ్రికా, రష్యా, బ్రెజిల్, జర్మనీ, నైజీరియా, కెనడా, బెల్జియం ఒకదాని వెంట ఒకటి ముందు వరుసలో ఉన్నాయి. అడ్డంకులు తొలగిస్తే.. చైనా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా మారుతున్నట్లు ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘2017–18 ఏప్రిల్–సెప్టెంబరులో భారత్ నుంచి చైనాకు రూ.700 కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 11.7 శాతం వృద్ధితో రూ.781 కోట్లకు చేరింది. ఏపీఐలు ఎగుమతి చేయాలంటే చైనా ఎఫ్‌డీఏ అనుమతి తప్పనిసరి. దీనికి మూడేళ్లు పడుతోంది. అనుమతులను వేగంగా ఇవ్వాలని ఫార్మెక్సిల్ తరఫున కోరాం. యూఎస్, ఈయూ, జపాన్ అనుమతి ఉంటే.. ఆ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్లాంట్లకు గ్రీన్ చానెల్ రూట్లో ఏడాదిలోపే పర్మిషన్లను చైనా మంజూరు చేస్తోంది. దీన్నే భారత్‌కూ అమలు చేయాలన్నది మా డిమాండ్. ఫెర్మెంటేషన్ టెక్నాలజీలో ఇక్కడి కంపెనీలకు చైనా సాయం చేయాలి. మన కంపెనీలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రతిపాదనలను ఆ ప్రభుత్వం ముందు ఉంచాం’ అని రవి వివరించారు. ఇటీవల చైనాలో అక్కడి ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ఫార్మెక్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చైనా నుంచి 100, భారత్ నుంచి 27 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. దీంతో త్వరలోనే కొన్ని డీల్స్ సాకారం కానున్నట్లు తెలిసింది. -
వక్క లెక్కే వేరు!
ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు. అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మొదట్లో చేదు అనుభవం... కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్‌నగర్ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్‌నగర్ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు. అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే ఫలసాయాన్ని అందిస్తున్నది. అరటి+ వక్క+మిరియం+జాజి... వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు. వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది. అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకం వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది. ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం, సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు! ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది. ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు! ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్– 83329 45368. చీడపీడల నివారణలో.. చేతిని మించిన సాధనం లేదు! కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు – వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా దివంగత వైఎస్సార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ -
సువెన్ లైఫ్ కు 4 పేటెంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్ తాజాగా నాడీ సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగించే ఔషధానికి సంబంధించి వివిధ దేశాల్లో పేటెంట్లు దక్కించుకుంది. అమెరికా, యూరేషియా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాలో తమ న్యూ కెమికల్ ఎంటిటీస్ (ఎన్సీఈ)కు పేటెంట్లు లభించినట్లు సంస్థ తెలిపింది. వీటికి 2032 దాకా గడువు వర్తిస్తుందని పేర్కొంది. తాజా అనుమతులతో ఆస్ట్రేలియాలో మొత్తం 24, యూరేషియాలో 17, ఇజ్రాయెల్‌లో 9, అమెరికాలో 24 పేటెంట్లు ఉన్నట్లవుతుందని సువెన్ లైఫ్ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు. -
తెవా చేతికి అలెర్గాన్ జనరిక్స్!
40.5 బిలియన్ డాలర్ల ఒప్పందం టెల్ అవీవ్/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా.. అంతర్జాతీయ ఔషధ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. ఐర్లాండ్ సంస్థ అలెర్గాన్ జనరిక్స్‌ను ఏకంగా 40.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.63 లక్షల కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 33.75 బిలియన్ డాలర్లు నగదు రూపంలో, మిగతాది (6.75 బిలియన్ డాలర్లు) తెవా షేర్ల రూపంలో అలెర్గాన్ జనరిక్స్ మాతృసంస్థ అలెర్గాన్ పీఎల్‌సీకి లభిస్తాయి. ఈ డీల్‌కు తెవా, అలెర్గాన్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఆమోదం లభించింది. 2016 తొలి క్వార్టర్లో ఒప్పందం పూర్తి కావొచ్చని తెవా పేర్కొంది. ఒప్పందం ప్రకారం అలెర్గాన్కు చెందిన యాక్టావిస్ అంతర్జాతీయ జనరిక్స్ వ్యాపారం, థర్డ్ పార్టీ సప్లయర్ మెడిస్, అంతర్జాతీయ ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) వ్యాపారంతో పాటు కొన్ని ప్రముఖ ఔషధ బ్రాండ్స్ కూడా తెవాకు దక్కుతాయి. ఇటు జనరిక్స్, అటు స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాలను మరింతగా వృద్ధి చేసుకునే దిశగా అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెవా ప్రెసిడెంట్ ఎరెజ్ విగోడ్మన్ తెలిపారు. ఇక, మరో ఔషధ దిగ్గజం మైలాన్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు తెవా వెల్లడించింది. మైలాన్‌ను 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు తెవా ఈ ఏప్రిల్‌లో ప్రతిపాదించడం తెలిసిందే. 100 మార్కెట్లలో కార్యకలాపాలు .. తెవా, అలెర్గాన్ జనరిక్స్ రెండూ కలిస్తే 100 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నట్లవుతుంది. దాదాపు 40 మార్కెట్లలో టాప్ మూడు సంస్థల్లో స్థానం లభిస్తుంది. అలెర్గాన్ కొనుగోలు అనంతరం 2016లో తమ అమ్మకాలు దాదాపు 26 బిలియన్ డాలర్ల మేర ఉండగలవని అంచనా వేస్తున్నట్లు తెవా వర్గాలు తెలిపాయి. తద్వారా అంతర్జాతీయంగా టాప్ 10 ఫార్మా సంస్థల్లో ఒకటిగా ఉండగలమని పేర్కొన్నాయి. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన మూడేళ్ల తర్వాత వార్షికంగా వ్యయాలు, పన్నులు సుమారు 1.4 బిలియన్ డాలర్ల మేర ఆదా కాగలవని తెవా వర్గాలు తెలిపాయి. -
విశాఖలో రూ.75 కోట్లతో లీ ఫార్మా యూనిట్
కంపెనీ వ్యవస్థాపకులు ఎ.వెంకటరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న లీ ఫార్మా విశాఖ జిల్లా అచ్యుతాపురం వద్ద రూ.75 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 2016 జూన్‌కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్‌లో 2, విశాఖలో 1 యూనిట్ ఉంది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్, పెల్లెట్స్, గ్రాన్యూల్స్‌ను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులను 48 దేశాలకు ఎగుమతి చేస్తోంది. మైలాన్, డాక్టర్ రెడ్డీస్, ర్యాన్‌బాక్సీ, ఇంటాస్, టెవా, గ్లెన్‌మార్క్, టోరెంట్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. టర్నోవరు రూ.200 కోట్లుంది. వచ్చే ఏడాది ఫినిష్డ్ ప్రొడక్ట్స్ విభాగంలోకి ప్రవేశిస్తామని లీ ఫార్మా ఫౌండర్ ఎ.వెంకటరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫినిష్డ్ ప్రొడక్టులను యూఎస్ మార్కెట్లోనూ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బ్యాక్టీరియాను ఎదుర్కొనే ‘లెనోజిలైడ్’ అనే ఔషధాన్ని నూతన విధానంలో కనుగొన్నామని చెప్పారు. దీనికి యూరప్ పేటెంట్ పొందామని వివరించారు. ఇతర దేశాల్లోనూ ఔషధాన్ని నమోదు చేస్తామని చెప్పారు. పెద్ద బ్రాండ్లతో పోలిస్తే 25 శాతం ధరకే ఈ మందును విక్రయిస్తామని తెలిపారు.