వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్‌ ఐపీవో | Pharmacy retail chain Medplus plans IPO to raise Rs 700 Cr | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్‌ ఐపీవో

Nov 14 2019 6:22 AM | Updated on Nov 14 2019 6:22 AM

Pharmacy retail chain Medplus plans IPO to raise Rs 700 Cr - Sakshi

మధుకర్‌ గంగాడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధాల విక్రయ రంగంలో ఉన్న మెడ్‌ప్లస్‌ వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. తద్వారా రూ.700 కోట్లకుపైగా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో ప్రమోటర్లకు 77 శాతం, విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థకు 13 శాతం వాటాలున్నాయి. మిగిలిన వాటా ప్రమోటర్లకు సన్నిహితులైన కొందరు ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌తో సహా ఐపీఓ మార్గంలో 20 శాతం వాటా విక్రయించనున్నట్టు మెడ్‌ప్లస్‌ ప్రమోటర్, ఫౌండర్‌ మధుకర్‌ గంగాడి వెల్లడించారు. కెనడా కంపెనీ జెమీసన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా ఆ వివరాలను వెల్లడించడానికి బుధవారమిక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఓ వివరాలను వెల్లడిస్తూ... అలా సమీకరించే నిధులను విస్తరణకోసం ఉపయోగిస్తామని స్పష్టంచేశారు. సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసే ప్రక్రియ ఈ డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు.

నాలుగేళ్లలో 3,100 స్టోర్లకు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో మెడ్‌ప్లస్‌ ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రాష్త్రాల్లో సంస్థకు 1,700కు పైగా స్టోర్లున్నాయి. ‘‘2023 నాటికి అన్ని రాష్త్రాల్లో 3,100 ఔట్‌లెట్ల స్థాయికి తీసుకు వెళతాం. ఈ కొత్త స్టోర్లను జమ్ము, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. 2018–19లో మెడ్‌ప్లస్‌ రూ.2,250 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.2,800 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై రూ.50 కోట్ల నికరలాభం వస్తుందనేది మా అంచనా’’ అని మధుకర్‌ వివరించారు. సంఘటిత ఔషధ రిటైల్‌ రంగంలో కంపెనీ వాటా 3 శాతానికి చేరుతుందని కూడా తాము అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. తమ వ్యాపారంలో దాదాపు 17 శాతం ‘మెడ్‌ప్లస్‌మార్ట్‌.కామ్‌’ ద్వారా వస్తున్నట్లు మెడ్‌ప్లస్‌ సీవోవో సురేంద్ర మంతెన తెలియజేశారు. ఈ విభాగం ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తోందన్నారు.

స్టోర్లలో జెమీసన్‌ ఉత్పత్తులు..
కెనడాకు చెందిన విటమిన్ల తయారీ దిగ్గజం జెమీసన్‌తో మెడ్‌ప్లస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో జెమీసన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు ఇక నుంచి మెడ్‌ప్లస్‌ స్టోర్లలో లభిస్తాయి. 1922లో ప్రారంభమైన జెమీసన్‌ విటమిన్లు, మినరల్స్, హెల్త్‌ సప్లిమెంట్లను 40 దేశాల్లో విక్రయిస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్‌ మార్క్‌ హార్నిక్‌ ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement