Madhukar Gangadi
-
వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్ ఐపీవో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయ రంగంలో ఉన్న మెడ్‌ప్లస్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. తద్వారా రూ.700 కోట్లకుపైగా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో ప్రమోటర్లకు 77 శాతం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థకు 13 శాతం వాటాలున్నాయి. మిగిలిన వాటా ప్రమోటర్లకు సన్నిహితులైన కొందరు ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది. ఆఫర్ ఫర్ సేల్‌తో సహా ఐపీఓ మార్గంలో 20 శాతం వాటా విక్రయించనున్నట్టు మెడ్‌ప్లస్ ప్రమోటర్, ఫౌండర్ మధుకర్ గంగాడి వెల్లడించారు. కెనడా కంపెనీ జెమీసన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా ఆ వివరాలను వెల్లడించడానికి బుధవారమిక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఓ వివరాలను వెల్లడిస్తూ... అలా సమీకరించే నిధులను విస్తరణకోసం ఉపయోగిస్తామని స్పష్టంచేశారు. సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసే ప్రక్రియ ఈ డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు. నాలుగేళ్లలో 3,100 స్టోర్లకు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో మెడ్‌ప్లస్ ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రాష్త్రాల్లో సంస్థకు 1,700కు పైగా స్టోర్లున్నాయి. ‘‘2023 నాటికి అన్ని రాష్త్రాల్లో 3,100 ఔట్లెట్ల స్థాయికి తీసుకు వెళతాం. ఈ కొత్త స్టోర్లను జమ్ము, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. 2018–19లో మెడ్‌ప్లస్ రూ.2,250 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.2,800 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై రూ.50 కోట్ల నికరలాభం వస్తుందనేది మా అంచనా’’ అని మధుకర్ వివరించారు. సంఘటిత ఔషధ రిటైల్ రంగంలో కంపెనీ వాటా 3 శాతానికి చేరుతుందని కూడా తాము అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. తమ వ్యాపారంలో దాదాపు 17 శాతం ‘మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్’ ద్వారా వస్తున్నట్లు మెడ్‌ప్లస్ సీవోవో సురేంద్ర మంతెన తెలియజేశారు. ఈ విభాగం ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తోందన్నారు. స్టోర్లలో జెమీసన్ ఉత్పత్తులు.. కెనడాకు చెందిన విటమిన్ల తయారీ దిగ్గజం జెమీసన్‌తో మెడ్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో జెమీసన్ బ్రాండ్ ఉత్పత్తులు ఇక నుంచి మెడ్‌ప్లస్ స్టోర్లలో లభిస్తాయి. 1922లో ప్రారంభమైన జెమీసన్ విటమిన్లు, మినరల్స్, హెల్త్ సప్లిమెంట్లను 40 దేశాల్లో విక్రయిస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్ మార్క్ హార్నిక్ ఈ సందర్భంగా చెప్పారు. -
కంపెనీ నుంచి కస్టమర్‌కు ‘బ్యాచ్‌ట్యాగ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా రిటైల్ చెయిన్ మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి.. బ్యాచ్‌ట్యాగ్ పేరిట మరో కంపెనీని ఆరంభించారు. ‘‘కంపెనీల్లో తయారైన ఉత్పత్తులు కస్టమర్ల కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. వాళ్ల మార్జిన్లు కూడా కలపడంతో అంతిమంగా కస్టమర్‌ను చేరేసరికి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపించేదే బ్యాచ్‌ట్యాగ్’’ అని మంగళవారం విలేకరులతో చెప్పారు. కస్టమర్ తనకు కావాల్సిన వస్తువులను నేరుగా తయారీ సంస్థల నుంచే కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. దీనివల్ల ధరలు మార్కెట్ కన్నా 40–80 శాతం వరకు తక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఫర్నిచర్, డెకరేషన్, హోమ్ అప్లియెన్సెస్, నిర్మాణ సామగ్రి వంటి నాలుగైదు విభాగాల్లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులతో (ఓఈఎం) ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. గుజరాత్, కాన్పూర్, కోల్‌కతా వంటి నగరాల్లోని 25కి పైగా ఓఈఎంలు, ఒక్కో కేటగిరీ నుంచి 3–4 ఓఈఎంలతో ఒప్పందం ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏసీ, టీవీ, ఫ్రిజ్ వంటి హోమ్ ఎలక్ట్రానిక్స్ ఓఈఎంలతో ఒప్పందం చేసుకోనున్నామని తెలిపారు. -
100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
- మరో 4 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు.. - రూ.10 కోట్లతో 30 ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లు - హైదరాబాద్‌లో తొలి సెంటర్ ప్రారంభం - కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గంగాడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమైజ్డ్ ఫర్నిచర్ ఈటైలర్ సంస్థ కస్టమ్ ఫర్నిష్.కామ్ రూ.100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి సారించింది. మరో 4 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటామని.. ఆ తర్వాతే డీల్‌ను క్లోజ్ చేస్తామని కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గంగాడి తెలిపారు. శనివారమిక్కడ తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘1,000-3,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఈ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌లో ఇటాలియన్ డిజైన్స్ సోఫా, ఫర్నిచర్‌తో పాటూ కర్టెన్లు వంటివి ఏర్పాటు చేశాం. స్టోర్‌ను సందర్శించి ఫర్నీచర్‌ను ఎంపిక చేసుకొని అక్కడే ఉన్న కంప్యూటర్ కియోస్క్ ద్వారా ఆన్లైన్లో ఆర్డరిచ్చే వీలుంటుంది’ అని వివరించారు. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.10 కోట్ల పెట్టుబడులతో 30 ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను, రెండేళ్లలో వంద స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో మరో 5 హైదరాబాద్‌లో, మిగిలినవి బెంగళూరు, చెన్నై, నాగ్‌పూర్, పుణెల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో కొంపల్లిలో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఉందని.. వచ్చే ఏడాది ముగింపు నాటికి ఢిల్లీ, బెంగళూరుల్లో కూడా యూనిట్లను నెలకొల్పుతామన్నారు.