100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
- మరో 4 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు..
- రూ.10 కోట్లతో 30 ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లు
- హైదరాబాద్‌లో తొలి సెంటర్ ప్రారంభం
- కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గంగాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమైజ్డ్ ఫర్నిచర్ ఈటైలర్ సంస్థ కస్టమ్ ఫర్నిష్.కామ్ రూ.100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి సారించింది. మరో 4 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటామని.. ఆ తర్వాతే డీల్‌ను క్లోజ్ చేస్తామని కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గంగాడి తెలిపారు. శనివారమిక్కడ తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘1,000-3,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఈ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌లో ఇటాలియన్ డిజైన్స్ సోఫా, ఫర్నిచర్‌తో పాటూ కర్టెన్లు వంటివి ఏర్పాటు చేశాం.
స్టోర్‌ను సందర్శించి ఫర్నీచర్‌ను ఎంపిక చేసుకొని అక్కడే ఉన్న కంప్యూటర్ కియోస్క్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చే వీలుంటుంది’ అని వివరించారు. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.10 కోట్ల పెట్టుబడులతో 30 ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను, రెండేళ్లలో వంద స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో మరో 5 హైదరాబాద్‌లో, మిగిలినవి బెంగళూరు, చెన్నై, నాగ్‌పూర్, పుణెల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో కొంపల్లిలో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఉందని.. వచ్చే ఏడాది ముగింపు నాటికి ఢిల్లీ, బెంగళూరుల్లో కూడా యూనిట్లను నెలకొల్పుతామన్నారు.