యాసిడ్ దాడి బాధితురాలు లలితతో డాక్టర్ ప్రతిభా నైతాని
పిల్లలను దృష్టిలో పెట్టుకొని టీవీ కార్యక్రమాల్లో అసభ్యత, హింస చూపడాన్ని వ్యతిరేకించడంలో పేరొందారు ముంబై వాసి డాక్టర్ ప్రతిభా నైతాని. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా కాస్మెటిక్ వైద్యం అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం జరగాలంటూ ఆయా మంత్రిత్వ శాఖల చుట్టూ తిరుగుతూ, దోషులకు శిక్ష పడేలా చేశారు, చేస్తున్నారు.
డాక్టర్ ప్రతిభ కష్టానికి ఫలితంగా చట్టం మారింది, దోషులకు శిక్షలు పెరిగాయి. యాసిడ్ దాడి బాధితుల జీవితాలు కాస్త తేలికయ్యాయి. అయితే, గడిచిన ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రతిభా నైతాని ఎన్నో విషయాలను మీడియా ముందుంచారు.
‘‘పంతొమ్మిదేళ్ల క్రితం.. ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ అశోక్ గుప్తాతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. డాక్టర్ అశోక్ అప్పటికే తన పనితో పాటు సామాజిక సేవ కూడా చేస్తుండేవారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేద, గిరిజనులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తుండేవారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన నేను, ఈ సర్జరీలలో సహాయంగా ఉండేదాన్ని. యాసిడ్ దాడి కేసులు మొదట్లో ఒకటో రెండో వచ్చేవి. తర్వాత్తర్వాత వీటి సంఖ్య పెరుగుతుండటం గమనించాను. వీరికి ఉచితంగా సర్జరీలు చేయడమొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకున్నాను. వీటిని అరికట్టేందుకు ఏదైనా చేయాలనుకున్నాను.
దోషులకు శిక్షను పెంచాలి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ, లా కమిష¯Œ వరకు ప్రదక్షిణలు చేశాను. ముంబై నుంచి ఢిల్లీకి తరచూ ప్రయాణించేదాన్ని. గతంలో యాసిడ్ దాడి దోషులకు శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. నిందితులకు కేవలం ఆరు నెలలు మాత్రమే బెయిలబుల్ శిక్ష ఉండేది. కానీ అమ్మాయి జీవితమంతా నరకమే. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మరిన్ని ఇబ్బందులు తప్పవని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేవారు. దీంతో వారికి న్యాయం జరిగేది కాదు.
కత్తి గాయం, యాసిడ్ మంట
ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరి శరీరంపై యాసిడ్ పోయడం హత్య కంటే ఘోరమైన నేరం. ఈ విషయంలో చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 2013లో ఐపిసి లో 32-6A, 32-6B సెక్షన్లు చేర్చబడ్డాయి. దీని ప్రకారం, నిందితుడు దోషిగా తేలితే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అపరాధి నుండి జరిమానా కూడా వసూలు చేయబడుతుంది. దీంతో బాధితురాలి కోసం ఎంతో కొంతైనా చేయగలిగామనే ధీమా వచ్చింది.
బాధితులకు పునరావాసం
‘‘యాసిడ్ దాడి బాధితులు సమాజంలో జీవించడం కష్టం. ఈ అమ్మాయిలకు పని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా సందర్భాల్లో చికిత్స ఖర్చులు పెరిగి, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు కూడా తెలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కేటగిరీలో చేర్చాలని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి వికలాంగుల కోటాలో వచ్చే అన్ని సౌకర్యాలు వారికి కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలోనూ విజయం సాధించాం’’.
ఉచిత వైద్య చికిత్స
‘‘యాసిడ్ దాడి బాధితులకు ప్రతి నగరంలో ఉచితంగా చికిత్స అందించాలన్నది మరో డిమాండ్. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం లేదు. ఏ ఆసుపత్రి అయినా, ఎక్కడ ఉన్నా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ మేరకు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిష¯Œ దాఖలు చేశారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
అందుబాటులో ఉండకూడదు
బహిరంగంగా విక్రయించే యాసిడ్‌కు సంబంధించి, దాని విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశాం. సాధారణ దుకాణాల్లో యాసిడ్ ఉండకూడదు. ఎప్పుడు, ఎవరు కొన్నారు, దేనికి వినియోగిస్తున్నారనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విధానం వల్ల యాసిడ్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు.
ప్రాణాలతో పోరాటం
యాసిడ్ దాడి బాధను భరిస్తూ జీవితంలో ముందుకు సాగిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అలాంటి అమ్మాయిలలో లలిత ఒకరు. దాడి జరిగి, తీసుకువచ్చినప్పుడు, ఆమె గాయాల వాసనకు, జనం క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఏ అమ్మాయీ యాసిడ్ బారిన పడకుండా అందరూ ఆనందంగా జీవించాలి’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారీ వైద్యురాలు.
Comments
Please login to add a commentAdd a comment