ఈ ఏడాది 12 బిలియన్ డాలర్ల సమీకరణ
పీక్ ఫిఫ్టీన్ ఎండీ రాజన్ ఆనందన్
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు జోరు మీదున్నాయి. స్టార్టప్‌లు ఈ ఏడాది దాదాపు 8–12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయతగిన ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలు.. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఆసక్తిగా ఉన్నారని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2021, 2022లో భారతీయ స్టార్టప్‌లలో ఏటా 8–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆనందన్ చెప్పారు.
దీంతో ఆ రెండు సంవత్సరాల్లో అంకుర సంస్థల్లోకి వచి్చన పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ‘గతేడాది 7 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం తక్కువని చాలా మంది అంటున్నారు. కానీ, నిజం చెప్పాలంటే ఆరేళ్లకు సరిపడా పెట్టుబడులు రెండేళ్లలోనే వచ్చేసిన నేపథ్యంలో గతేడాది అసలు పెట్టుబడుల పరిమాణం శూన్యంగా ఉండేది. ఈ ఏడాది మనం 8–10 లేదా 12 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే దిశగా ముందుకు వెడుతున్నాం.
రాబోయే రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టే స్థాయికి స్టార్టప్ వ్యవస్థ చేరుకోగలదు‘ అని ఆనందన్ తెలిపారు. దేశీ స్టార్టప్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడానికి ఏటా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80,000 కోట్లు) సరిపోతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 20 స్టార్టప్‌లు లిస్ట్ అయ్యాయని, వచ్చే 7–8 ఏళ్లలో 100 అంకుర సంస్థలు లిస్టింగ్‌కి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
డీప్‌టెక్ స్టార్టప్స్ కోసం పాలసీ..
డీప్‌టెక్ స్టార్టప్స్ కోసం ప్రత్యేక పాలసీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. అంకుర సంస్థలకు నిధులే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్లు దక్కాల్సిన అవసరం ఉందని, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్‌తో ఈ అవకాశం లభిస్తోందని సింగ్ వివరించారు. స్టార్టప్స్ నుంచి జీఈఎం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 22,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment