వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం! | startup company special story on vonik | Sakshi
Sakshi News home page

వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం!

Published Sat, Sep 10 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం!

వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం!

ఒకే వేదికగా 20 వేల రిటైలర్లు, 15 లక్షల ఉత్పత్తులు
మహిళలకు వూనిక్; పురుషులకు మిస్టర్ వూనిక్
డిసెంబర్‌లో విలారా పేరిట మరో స్టార్టప్
ఇప్పటికే రూ.184 కోట్ల నిధుల సమీకరణ
రూ.660 కోట్ల జీఎంవీ; టర్నోవర్ రూ.80 కోట్ల్లు
రెండేళ్లలో ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలకూ విస్తరణ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫ్యాషన్‌ను అనుకరిస్తే నలుగురిలో ట్రెండీగా కనిపించొచ్చు!
అదే ఫ్యాషన్స్‌పై ఇష్టం పెంచుకుంటే?
ట్రెండీతో పాటూ ఆదాయాన్ని ఆర్జించొచ్చు!!

...ఇదే వూనిక్ ఫౌండర్ల వ్యాపార సూత్రం. మహిళా ఫ్యాషన్ పోర్టల్‌గా ప్రారంభమైన వూనిక్.. పురుషుల కోసం మిస్టర్ వూనిక్‌గా విస్తరించింది. దేశంలోని ఇతర ఫ్యాషన్ స్టార్టప్స్ ఆరింటిని కొనుగోలు చేసే స్థాయికీ ఎదిగింది. విదేశాలకూ ఫ్యాషన్ పాఠాలను నేర్పే దిశగా ఆడుగులేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం! రూ.40 లక్షల పెట్టుబడితో 2013లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన వూనిక్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సుజాయత్ అలీ, నవనీత కృష్ణన్‌లు ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు.

పెట్టుబడుల్లేవ్.. గిడ్డంగులూ లేవ్
ఎలాంటి పెట్టుబడులు, గిడ్డంగులు లేకుండానే వందల కోట్ల వ్యాపారాన్ని చేస్తోంది వూనిక్. ఇది కే వలం ఫ్యాషన్ ప్రియులను, రిటైలర్లు కలిపే ఒక వేదిక. మ్యాడ్‌స్టాక్ టెక్నాలజీ ద్వారా పనిచేయడమే వూనిక్ ప్రత్యేకత. అంటే వెబ్‌సైట్‌లో ఉత్పత్తులను చూడటంతో పాటూ మన శరీరానికి వేసుకుంటే ఎలా ఉంటుందో కళ్లతో చూసుకునే వీలుంటుంది కూడా. అలాగే మన శరీరాకృతి, రంగును చెబితే చాలు మనకెలాంటి దుస్తులు నప్పుతాయో సూచిస్తారు. ‘హర్ దిన్ ఫ్యాషన్ కరో’ నినాదంతో ఈ ఏడాది ప్రారంభంలో తొలి టీవీ క్యాంపెయిన్‌ను ప్రారంభించాం. దీనికి ప్రముఖ బాలీవుడ్ డెరైక్టర్ ఫరాఖాన్ లీడ్ రోల్ నిర్వహించారు.

ఏటా రూ.660 కోట్ల జీఎంవీ..
ప్రస్తుతం మా వెబ్‌సైట్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. 10 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రోజుకు 25 వేల ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులో నాలుగో వంతు వాటా దక్షిణాది రాష్ట్రాలదే. ప్రస్తుతం మా సంస్థలో 20 వేల రిటైలర్లు నమోదయ్యారు. 15 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. ప్రతి కొనుగోలు మీద 20% కమీషన్ రూపంలో తీసుకుంటాం. మా భాగస్వామ్య సంస్థలకు ఏడాదికి రూ.660 కోట్లు (100 మిలియన్ డాలర్లు) గ్రాస్ మర్చంటైస్ వాల్యూ (జీఎంవీ) జరుగుతోంది. ఇందులో రూ.80 కోట్లు (12 మిలియన్ డాలర్లు) కమీషన్ రూపంలో వస్తుంది. ఇదే మా టర్నోవర్.

డిసెంబర్‌లో విలారా ప్రారంభం..
జూన్‌లో పురుషుల కోసం మిస్టర్ వూనిక్‌ను ప్రారంభించాం. ఇందులో 1,500 మంది అమ్మకందారులు, 2 లక్షల మంది యూజర్లు నమోదయ్యారు. డిసెంబర్‌లో విలారా పేరిట మరో స్టార్టప్‌ను ప్రారంభించనున్నాం. మహిళలు, పురుషులు ఇద్దరికీ ప్రీమియం డిజైనర్ దుస్తుల విభాగం. మార్కెటింగ్, రిటైలర్లతో ఒప్పందాల కోసం 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు కూడా. ‘‘గతేడాది ఆగస్టులో ట్రయల్‌కార్ట్ కొనుగోలుతో మొదలైన మా ప్రయాణం.. గెట్సీ, స్టయిల్, పిక్‌సిల్క్, జోహ్రా, డెక్కాన్‌ల వరకు సాగింది. వచ్చే రెండేళ్లూ టెక్నాలజీ స్టార్టప్స్ కొనుగోళ్లపై దృష్టిసారిస్తాం.

 రూ.184 కోట్ల నిధుల సమీకరణ..
ఇప్పటిదాకా వూనిక్ రూ.184 కోట్లు(28 మిలియన్ డాలర్లు) సమీకరించింది. ఇందులో సికోయా క్యాపిటల్, టైమ్స్ ఇంటర్నెట్, బీనస్, బీనెక్ట్స్, పార్క్‌వుడ్ బెస్పిన్, టాన్‌కాన్, ఫ్రీచార్జ్ కునాల్ షా ఉన్నారు. ప్రస్తుతం మా సంస్థలో 500 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ రఘు లక్కప్రగడ సీఓఓగా, మింత్ర సీఎఫ్‌ఓ ప్రభాకర్ సుందర్ లీడ్ ఫైనాన్స్ గా ఉన్నారు. వచ్చే 12 నెలల్లో 300 మిలియన్ డాలర్ల జీఎంవీని చేరాలన్నది లక్ష్యం. ఆ తర్వాతే మరో విడత నిధుల సమీకరణ చేస్తాం. రెండేళ్లలో ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలకూ వూనిక్ సేవలను విస్తరిస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement