Rajan Anandan
-
భారత్ స్టార్టప్‌ల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు జోరు మీదున్నాయి. స్టార్టప్‌లు ఈ ఏడాది దాదాపు 8–12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయతగిన ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలు.. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఆసక్తిగా ఉన్నారని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2021, 2022లో భారతీయ స్టార్టప్‌లలో ఏటా 8–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆనందన్ చెప్పారు. దీంతో ఆ రెండు సంవత్సరాల్లో అంకుర సంస్థల్లోకి వచి్చన పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ‘గతేడాది 7 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం తక్కువని చాలా మంది అంటున్నారు. కానీ, నిజం చెప్పాలంటే ఆరేళ్లకు సరిపడా పెట్టుబడులు రెండేళ్లలోనే వచ్చేసిన నేపథ్యంలో గతేడాది అసలు పెట్టుబడుల పరిమాణం శూన్యంగా ఉండేది. ఈ ఏడాది మనం 8–10 లేదా 12 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే దిశగా ముందుకు వెడుతున్నాం. రాబోయే రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టే స్థాయికి స్టార్టప్ వ్యవస్థ చేరుకోగలదు‘ అని ఆనందన్ తెలిపారు. దేశీ స్టార్టప్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడానికి ఏటా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80,000 కోట్లు) సరిపోతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 20 స్టార్టప్‌లు లిస్ట్ అయ్యాయని, వచ్చే 7–8 ఏళ్లలో 100 అంకుర సంస్థలు లిస్టింగ్‌కి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీప్‌టెక్ స్టార్టప్స్ కోసం పాలసీ.. డీప్‌టెక్ స్టార్టప్స్ కోసం ప్రత్యేక పాలసీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. అంకుర సంస్థలకు నిధులే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్లు దక్కాల్సిన అవసరం ఉందని, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్‌తో ఈ అవకాశం లభిస్తోందని సింగ్ వివరించారు. స్టార్టప్స్ నుంచి జీఈఎం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 22,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
స్టార్టప్‌లతో 10 కోట్ల కొలువులు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ వ్యవస్థ తోడ్పాటుతో అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో 10 కోట్ల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించగలవని వెంచర్ క్యాపిటల్ సంస్థ సెకోయా క్యాపిటల్ ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే దేశీ స్టార్టప్‌లు ప్రధానంగా కార్పొరేట్ గవర్నెన్స్‌పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘గత కొన్నాళ్లుగా కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలి. ఇందుకు సంబంధించి పాటించాల్సిన ప్రక్రియలు, క్రమశిక్షణ మొదలైన వాటి గురించి వ్యవస్థాపకుల్లో అవగాహన పెంచుతున్నాం‘ అని ఆనందన్ వివరించారు. సెకోయా ఇన్వెస్ట్ చేసిన భారత్‌పే, జిలింగో సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన సమస్యలు బైటపడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ అంశాల ఊతంతో అమెరికా, భారత్, చైనా తదితర దేశాల్లోని స్టార్టప్ వ్యవస్థల్లోకి భారీగా నిధులు వచ్చిపడ్డాయని ఆనందన్ చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చైనా వ్యవస్థలోకి గతేడాది దాదాపు 130 బిలియన్ డాలర్లు, అలాగే భారత స్టార్టప్ సంస్థల్లోకి 40 బిలియన్ డాలర్లు వచ్చినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయని ఆనందన్ చెప్పారు. ‘ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్లు వేగంగా పెంచవచ్చు. ఎకానమీలోకి కుమ్మరించిన 7 లక్షల కోట్ల డాలర్లలో సింహభాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా స్టార్టప్‌లు ఎదిగేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. -
ఐఏఎంఏఐ చైర్మన్‌గా రాజన్ ఆనందన్
న్యూఢిల్లీ: గూగుల్ వైస్–ప్రెసిడెంట్‌గా (దక్షిణ–తూర్పు ఆసియా, ఇండియా) ఉన్న రాజన్ ఆనందన్ తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయన ఫ్రీచార్జ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా వద్ద నుంచి ఈ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఐఏఎంఏఐ వైస్ చైర్మన్‌గా మేక్మైట్రిప్ చైర్మన్, సీఈవో దీప్ కల్రా ఎంపికయ్యారు. ఈయన మ్యూజిక్ యాప్ సావన్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ వినోద్ భట్ వద్ద నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఐఏఎంఏఐ ట్రెజరర్‌గా ఫేస్బుక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా, దక్షిణాసియా) ఉమాంగ్ బేడి నియమితులయ్యారు. సుబో రాయ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అలాగే కొనసాగుతున్నారు. కొత్తగా నియమితులైన వీరు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. -
చిన్న కంపెనీలకు గూగుల్ తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 5.1 కోట్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు (ఎస్ఎంబీ) వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో 68 శాతం కంపెనీలు ఇంటర్నెట్కు దూరంగా ఉన్నాయని గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. డిజిటల్ అన్లాక్డ్ పేరుతో ఎస్ఎంబీల వ్యాపారాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కార్యకలాపాలు సాగిస్తున్న నగరానికి వెలుపల ఆఫ్‌లైన్ కంపెనీలు 29 శాతం మాత్రమే కస్టమర్లను సొంతం చేసుకుంటే, ఆన్లైన్ ఆసరాగా చేసుకున్న కంపెనీలు 52 శాతం వినియోగదార్లను దక్కించుకున్నాయని వివరించారు. డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను వివరించే గూగుల్ ప్రైమర్ యాప్‌ను రెండు నెలల్లో 5.50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపారు. తెలుగు సహా 9 భాషల్లో ప్రైమర్ యాప్ అందుబాటులో ఉంది. విరివిగా శిబిరాలు.. డిజిటల్ విప్లవంతో భారత జీడీపీలో ఎస్ఎంబీల వాటా 10 శాతం పెరిగి 2020 నాటికి 48 శాతానికి చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఎండీ కెవిన్ ఓకేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో 40 నగరాల్లో 5,000 శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అయిదు నగరాల్లో 2017 జనవరి నుంచి 4 వేల పైచిలుకు చిన్న, మధ్యతరహా కంపెనీలకు గూగుల్ శిక్షణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 80 లక్షల కంపెనీలకు గూగుల్ తోడ్పాటు అందించింది. కాగా, డిజిటల్ సహకారంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్న ఎస్ఎంబీలకు కంపెనీ అవార్డులను ఇవ్వనుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 24. మరిన్ని వివరాలకు జ. ఛిౌ/ టఝbజ్ఛిట్ఛౌటవెబ్సైట్ చూడొచ్చు. -
గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ నానో డిగ్రీలు
యుడాసిటీ భాగస్వామ్యంతో ఆఫర్; వెయ్యి ఉచిత స్కాలర్షిప్లు - కోర్సు కాలవ్యవధి 6-9 నెలలు - నెలకు రూ. 9,800 వరకూ వ్యయం బెంగళూరు: గూగుల్ సంస్థ భారత్‌లో ఆండ్రాయిడ్ నానోడిగ్రీలను ఆఫర్‌చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ యుడాసిటీ భాగస్వామ్యంతో ఈ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ, దేశీయ యాప్‌ల రూపకల్పన చేసే అత్యున్నత స్థాయి మొబైల్ డెవలపర్లను తయారు చేయడం లక్ష్యంగా ఈ డిగ్రీలను అందిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ(సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా) రాజన్ ఆనందన్ చెప్పారు. భారత్‌లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారని, 2018 కల్లా ఈ విషయంలో అమెరికాను భారత్ అధిగమిస్తుందని పేర్కొన్నారు. అప్పటికల్లా భారత్‌లో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య నలభై లక్షలకు పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే టాప్ 1,000 ఆండ్రాయిడ్ యాప్‌లలో భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమేనని తెలిపారు. సాఫ్ట్వేర్ నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నా, యాప్స్ రూపొందించే నైపుణ్యం ఉన్న నిపుణుల సంఖ్య స్వల్పంగా ఉందని, ఈ లోటును భర్తీ చేయడానికే ఆండ్రాయిడ్ నానో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు... ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కార్యక్రమంలో భాగంగా డెవలపర్లు ఎక్కడ నుంచైనా, ఏ డివైస్తోనైనా కొత్త నైపుణ్యాలను కొన్ని నెలల్లోనే నేర్చుకొని తమ కెరీర్లో మరింత ముందుకు వెళ్లవచ్చని యుడాసిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సెబాస్టియన్ తరుణ్ చెప్పారు. ఈ కోర్సు కాలపరిమితి 6-9 నెలలని నెలకు రూ.9,800 ఖర్చవుతుందని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత ట్యూషన్ ఫీజులో 50 శాతం రిఫండ్ చేస్తామని వివరించారు. ఈ కోర్సుకు గూగుల్, టాటా ట్రస్ట్స్ సంస్థలు చెరో 500 ఉచిత స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయని చెప్పారు.