గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ నానో డిగ్రీలు
యుడాసిటీ భాగస్వామ్యంతో ఆఫర్; వెయ్యి ఉచిత స్కాలర్‌షిప్‌లు
- కోర్సు కాలవ్యవధి 6-9 నెలలు
- నెలకు రూ. 9,800 వరకూ వ్యయం
బెంగళూరు: గూగుల్ సంస్థ భారత్‌లో ఆండ్రాయిడ్ నానోడిగ్రీలను ఆఫర్‌చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ యుడాసిటీ భాగస్వామ్యంతో ఈ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ, దేశీయ యాప్‌ల రూపకల్పన చేసే అత్యున్నత స్థాయి మొబైల్ డెవలపర్లను తయారు చేయడం లక్ష్యంగా ఈ డిగ్రీలను అందిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ(సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా) రాజన్ ఆనందన్ చెప్పారు. భారత్‌లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారని, 2018 కల్లా ఈ విషయంలో అమెరికాను భారత్ అధిగమిస్తుందని పేర్కొన్నారు. అప్పటికల్లా భారత్‌లో సాఫ్ట్‌వేర్ నిపుణుల సంఖ్య నలభై లక్షలకు పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే టాప్ 1,000 ఆండ్రాయిడ్ యాప్‌లలో భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమేనని తెలిపారు. సాఫ్ట్‌వేర్ నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నా, యాప్స్ రూపొందించే నైపుణ్యం ఉన్న నిపుణుల సంఖ్య స్వల్పంగా ఉందని, ఈ లోటును భర్తీ చేయడానికే ఆండ్రాయిడ్ నానో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని వివరించారు.
ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు...
ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కార్యక్రమంలో భాగంగా డెవలపర్లు ఎక్కడ నుంచైనా, ఏ డివైస్‌తోనైనా కొత్త నైపుణ్యాలను కొన్ని నెలల్లోనే నేర్చుకొని తమ కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లవచ్చని యుడాసిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సెబాస్టియన్ తరుణ్ చెప్పారు. ఈ కోర్సు కాలపరిమితి 6-9 నెలలని నెలకు రూ.9,800 ఖర్చవుతుందని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత ట్యూషన్ ఫీజులో 50 శాతం రిఫండ్ చేస్తామని వివరించారు. ఈ కోర్సుకు గూగుల్, టాటా ట్రస్ట్స్ సంస్థలు చెరో 500 ఉచిత స్కాలర్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్నాయని చెప్పారు.