జనవరి 1 నుంచి వాట్సప్‌ పని చేయదు! కారణం.. | Meta discontinue WhatsApp support for older devices impacts several models | Sakshi
Sakshi News home page

జనవరి 1 నుంచి వాట్సప్‌ పని చేయదు! కారణం..

Published Mon, Dec 23 2024 2:59 PM | Last Updated on Mon, Dec 23 2024 4:11 PM

Meta discontinue WhatsApp support for older devices impacts several models

ప్రముఖ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్‌ పాత వర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్‌ అప్‌డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్‌డేట్లను పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడుతున్న వారు  అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.

సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ

మోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్‌డీ, మోటో ఈ 2014

హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601

ఎల్‌జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90

సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్‌పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీ

యాపిల్‌ ఓఎస్‌లోనూ..

ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్‌ ఓఎస్‌ ఇన్‌స్టాల్‌ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్‌ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్‌ పీరియడ్‌ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్‌ 15.1 వర్షన్‌ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్‌ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.

ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..

అప్‌డేట్లు ఎందుకు అవసరం అంటే..

ఆన్‌లైన్‌ యాప్‌లు నిత్యం కొత్త అప్‌డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్‌డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను సపోర్ట్‌ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్‌ అప్‌డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్‌డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్‌డేట్‌ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement