చిన్న కంపెనీలకు గూగుల్ తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 5.1 కోట్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు (ఎస్‌ఎంబీ) వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో 68 శాతం కంపెనీలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాయని గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. డిజిటల్ అన్‌లాక్డ్ పేరుతో ఎస్‌ఎంబీల వ్యాపారాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
కార్యకలాపాలు సాగిస్తున్న నగరానికి వెలుపల ఆఫ్‌లైన్ కంపెనీలు 29 శాతం మాత్రమే కస్టమర్లను సొంతం చేసుకుంటే, ఆన్‌లైన్ ఆసరాగా చేసుకున్న కంపెనీలు 52 శాతం వినియోగదార్లను దక్కించుకున్నాయని వివరించారు. డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను వివరించే గూగుల్ ప్రైమర్ యాప్‌ను రెండు నెలల్లో 5.50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు తెలిపారు. తెలుగు సహా 9 భాషల్లో ప్రైమర్ యాప్ అందుబాటులో ఉంది.
విరివిగా శిబిరాలు..
డిజిటల్ విప్లవంతో భారత జీడీపీలో ఎస్‌ఎంబీల వాటా 10 శాతం పెరిగి 2020 నాటికి 48 శాతానికి చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఎండీ కెవిన్ ఓకేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో 40 నగరాల్లో 5,000 శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అయిదు నగరాల్లో 2017 జనవరి నుంచి 4 వేల పైచిలుకు చిన్న, మధ్యతరహా కంపెనీలకు గూగుల్ శిక్షణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 80 లక్షల కంపెనీలకు గూగుల్ తోడ్పాటు అందించింది. కాగా, డిజిటల్ సహకారంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్న ఎస్‌ఎంబీలకు కంపెనీ అవార్డులను ఇవ్వనుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 24. మరిన్ని వివరాలకు జ. ఛిౌ/ టఝbజ్ఛిట్ఛౌటవెబ్‌సైట్ చూడొచ్చు.